ధరల దోబూచులాట.. | - | Sakshi
Sakshi News home page

ధరల దోబూచులాట..

Feb 5 2026 7:14 AM | Updated on Feb 5 2026 7:14 AM

ధరల ద

ధరల దోబూచులాట..

వ్యాపారాలు దిగజారాయి..

బంగారం కొనుగోలుదారుల్లో అనిశ్చితి

తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతున్న ధరలు

ఏడాదిలో రెట్టింపైన బంగారం ధర

సగానికి పైగా పడిపోయిన వ్యాపారం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకుంది. గత వారంలో తులం బంగారం రూ.1.80 లక్షల మార్కు దాటింది. అయితే అంతలోనే కొద్దిమేర వెనుకకు తగ్గి దోబూచులాడుతోంది. అయితే నాణేనికి ఒకవైపు పుత్తడి ధరల విషయంలో సానుకూల అంశాలు మనకు కనిపిస్తుంటే.. మరోవైపు బంగారు ఆభరణాల అమ్మకాలు లేక వ్యాపారులు అల్లాడిపోతున్నారు. దీంతో ఆ రంగంపై ఆధారపడి ఉన్న వ్యాపారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వాణిజ్య రాజధానిగా పిలిచే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని వ్యాపార వర్గాల జీవితాలపైనా దాని ప్రభావం అధికంగా పడుతోంది.

ఏడాదిలో రెట్టింపైన ధర..

బంగారం ధరలు కేవలం ఏడాదిలో రెట్టింపు అవ్వటంతో అందులో పెట్టుబడులు పెట్టిన మదుపరులు పండుగ చేసుకుంటున్నారు. అదే సమయంలో వెనుకకు, ముందుకు వెళ్తుండటంతో టెన్షన్‌కూ గురవుతున్నారు. 2025 జనవరి ప్రారంభంలో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,800గా నమోదైంది. అదే నెల చివరిలో రూ.8,400గా నమోదైంది. అలాగే వెండి సైతం 2025 జనవరి ప్రారంభంలో కిలో రూ.88,300 నమోదు కాగా, అదే మాసం చివరిలో రూ.93,100గా ఉంది. కానీ గత గురువారం విజయవాడ బులియన్‌ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,86,000 మార్కుకు చేరుకొని ఆల్‌టైం రికార్డు కొట్టింది. తాజాగా రూ.1,63,860 అంటే దాదాపుగా ఏడాదిలో బంగారం ధర రెట్టింపు అయ్యింది. ఇక వెండిని పరిశీలిస్తే గత వారం బులియన్‌ మార్కెట్‌లో కిలో నాలుగు లక్షలుగా నమోదైంది. వెండి ఏడాదిలో నాలుగు రెట్లు పెరిగింది. ఈ పెరుగుదల వ్యాపారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

దారుణంగా చిరు వ్యాపారుల పరిస్థితి

ఉమ్మడి కృష్ణాజిల్లాలో బులియన్‌ అమ్మకాలు చేసే దుకాణాలు సుమారుగా 15వందల వరకూ ఉన్నాయని వ్యాపార సంఘాల నేతలు చెబుతున్నారు. విజయవాడ పాతబస్తీతో పాటుగా గవర్నరుపేట, బందరురోడ్డులో అత్యధిక దుకాణాలు కొనసాగుతుండగా, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, ఉయ్యూరు, గుడివాడ వంటి ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలోనే దుకాణాలను నిర్వహిస్తున్నారు. వ్యాపా రుల్లో అత్యధికంగా 85 నుంచి 95 శాతం చిన్న వ్యాపారులే ఉన్నారు. అమ్మకాలు లేకపోవటం, ఊహించని దానికన్నా బంగారం ధర పెరిగిపోతుండటంతో వ్యాపారులు అతలాకుతలమవుతున్నారు. వీరిలో అత్యధికులు వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకొని తయారు చేసి ఇచ్చే వారే అధికంగా ఉంటారు. ఆర్డరు తీసుకున్న సమయంలో ఉన్న ధరకు, డెలివరీ ఇచ్చే సమయానికి మధ్య ధరలో భారీగా వ్యత్యాసం ఉండటంతో ప్రభావితమవుతున్నారు. ఒకరిద్దరు పెట్టుబడులు పెట్టే వారు మినహా మిగిలిన వ్యాపారులను ఈ ధరల పెరుగుదల తీవ్రంగా నష్టపరుస్తుందని వ్యాపార సంఘాల నేతలు వివరిస్తున్నారు.

కార్మికుల ఆత్మహత్యలు..

బంగారం ధర భారీగా పెరుగుతుండటంతో ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. దాంతో పనులు లేక బంగారు ఆభరణాల తయారీ కార్మిక కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఇటీవల కొంతమంది కార్మికులు పనులు లేక ఆదాయం రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రధానంగా గడిచిన రెండేళ్లగా కొంతమంది కార్మికులు ఆత్మహత్యలకు తెగబడుతున్నారంటూ నాయకులు పేర్కొంటున్నారు. అలాగే పనులు లేకపోవటంతో చాలా మంది ఈ రంగాన్ని వదిలి ఆటో కార్మికులుగా ఇతర రంగాలకు తరలిపోతున్నారని వాపోతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఆర్డరు ఇచ్చే సమయంలో ఉన్న ధర ఒక్కసారిగా పెరిగిపోతుండటంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మొన్నటి వరకూ పెరిగిన ధరలు కొంత తగ్గితే కొనుగోలు చేద్దామని వినియోగదారులు ఎదురు చూశారు. ఇప్పుడు తగ్గినా మరింత తగ్గుతుందోమోనని చూస్తున్నారు. ఈ అనిశ్చిత కారణంగా కొనుగోలు చేసే వారు దుకాణాలు వైపు చూడటం మానేశారు. దాంతో వ్యాపారాలు దారుణంగా పడిపోయాయి.

– కోన శ్రీహరిసత్యనారాయణ, అధ్యక్షుడు, బెజవాడ జ్యూవెలరీ అండ్‌ బులియన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌

ధరల దోబూచులాట..1
1/1

ధరల దోబూచులాట..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement