వీరమ్మ తల్లి తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు
ఉయ్యూరు: ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ఆదివారం భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కల్పవల్లికి భక్తజనం నీరాజనం పలికారు. వేకువజాము నుంచే వేలాది మంది భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి పాల పొంగళ్లు, చలువ కావిళ్లు, జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లు కానుకగా సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఉయ్యూరు పట్టణం అంతా వీరమ్మతల్లి నామస్మరణతో భక్తజన సంద్రంగా మారింది. పలువురు భక్తులు ప్రసాదాలు పంపిణీ చేసి అమ్మవారి సేవలో తరించారు.
భక్తులకు అగచాట్లు..
వేలాదిగా భక్తజనం తిరునాళ్లకు తరలిరావటంతో భక్తజనం నరకయాతన పడ్డారు. క్యూ లైన్లు అన్నీ కిక్కిరిసిపోవటంతో శిడి బండి వరకూ బారులుతీరి గంటల కొద్దీ దర్శనానికి నిరీక్షించి అవస్థలు పడ్డారు. భక్తులకు క్యూలైన్లలో వసతులు కల్పించకపోవటంతో వృద్ధులు, చిన్నారుల ఇక్కట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీఐపీల తాకిడితో సామాన్య భక్తులు మరింత ఇబ్బంది పడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల కొద్దీ వేచి ఉండలేక ధ్వజస్తంభం, ఆలయం వెలుపలే మొక్కులు చెల్లించుకుని వెనుతిరిగిరు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు.


