నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించండి
చిలకలపూడి(మచిలీపట్నం): గన్నవరం నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు ఇళ్లపట్టాలు అందించాలని గన్నవరం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్‌కు వినతిపత్రం సమర్పించి, పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మల్లవల్లి గ్రామంలో ఆర్‌ఎస్ నంబర్–11 ఉన్న అటవీభూముల్లో పశువుల మేత కోసం వినియోగించుకుని జీవనం సాగించేవారన్నారు. అయితే ఈ భూములను ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు కోసం ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించారన్నారు. దీని కారణంగా జీవనభృతి దెబ్బతిన్న ఆ ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి, కొంతమందికి మాత్రమే చెల్లించారని.. మిగిలిన వారికి వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీఐఐసీకి 1,460 ఎకరాలు బదిలీ చేసిన నేపథ్యంలో తెల్లరేషన్ కార్డుదారులు 2,400 మంది ఉన్నారని వీరికి సర్వే నంబరు 11లో ఉన్న 100 ఎకరాలను ఇళ్లపట్టాలు అందించాలని ఆయన జేసీకి వివరించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా రైతుల నుంచి తీసుకున్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో ఈ భూమికి సంబంధించిన అన్ని అంశాలను జేసీకి ఆయన వివరించారు.
‘మీ కోసం’లో జేసీకి విన్నవించిన
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ


