పొలాలు కుయ్యోరొయ్యో | - | Sakshi
Sakshi News home page

పొలాలు కుయ్యోరొయ్యో

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

పొలాల

పొలాలు కుయ్యోరొయ్యో

ప్రభుత్వ ఏడబ్ల్యూడీ భూములపై బడాబాబులు కన్ను యథేచ్ఛగా అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు సమీప పొలాలు చౌడుబారతాయని రైతుల ఆందోళన

పట్టించుకోని మైనింగ్‌, రెవెన్యూ అధికారులు

ఆయకట్టు చౌడుబారే ప్రమాదం

సాక్షి టాస్‌ఫోర్స్‌: కోడూరు మండలం పరిధిలో సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఏడబ్ల్యూడీ భూములపై బడాబాబులు కన్నేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఈ భూముల్లో యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేపట్టారు. రొయ్యల చెరువుల సాగు వల్ల సమీపంలోని పంటపొలాలు చౌడుబారతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పెద్ద ఎత్తున సాగుతున్న తవ్వకాలు

కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామ సమీపంలో దింటిమెరక రహదారిని అనుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూమి ఉంది. సాగునీటి సమస్య కారణంగా ఈ ప్రాంతాన్ని బీడుగా వదిలేశారు. దీనిని అదునుగా చేసుకున్న కొంతమంది బడాబాబులు రెవెన్యూ అధికా రులతో సంబంధం లేకుండానే ఈ భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు ప్రారంభించారు. ఇప్పటికే 25 ఎకరాల ఏడబ్ల్యూడీ భూమిని కబ్జా చేసినట్లు సమాచారం. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా చెరువు తవ్వకాల పనులు నిరాటంకంగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో పది అడుగుల ఎత్తున చెరువుల గట్లను నిర్మిస్తున్నారు. దింటిమెరక – హంసల దీవి రహదారి మార్జిన్‌ను కూడా ఆక్రమించి గట్లను ఏర్పాటు చేస్తున్నారు. చెరువులకు సంబంధించిన పరికరాలు భద్రపర్చుకోవడం, కూలీలకు ఉండేందుకు అవసరమైన నిర్మాణాలను కూడా రహదారి మార్జిన్‌ వెంట చేపట్టారు. చెరువుల్లోని వ్యర్థాలను వదిలేందుకు పక్కనే ఉన్న పంటకాలువను వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

లేని చెరువులకు మరమ్మతుల పేరిట అనుమతులు

ప్రస్తుతం బడాబాబులు తవ్వకాలు చేపట్టిన చెరువులు నిన్నటి వరకు బీడు భూములు గానే ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆక్వా జోన్‌ పరిధిలో మాత్రమే ఉప్పునీటి రొయ్యలు, చేపల చెరువుల తవ్వడానికి అనుమతి ఉంది. ఆక్వా జోన్‌ పరిధి కాకుండా కొత్త చెరువుల తవ్వినా, ఉన్న చెరువులకు మరమ్మతులు చేసినా అధికారులు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ చెరువుల తవ్వకాలకు మత్స్యశాఖ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు సమీప రైతులు ఆరోపిస్తున్నారు. అసలు చెరువులు లేకుండానే ఈ భూముల్లో చెరువులు ఉన్నట్లు మత్స్యశాఖ అధికారులు 11 నెలలకు సీఓసీ (సాగు సర్టిఫికెట్‌) ఇచ్చినట్లు సమాచారం. లేని చెరువులు ఉన్నట్లు చూపి, కొత్త చెరువులు తవ్వడానికి బడాబాబులకు పూర్తిస్థాయిలో మత్స్యశాఖ అధికారులు సహకరిస్తున్నట్లు రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న చెరువులు కొత్తవి కాదని, గతంలో ఉన్న చెరువులకు మరమ్మతులు చేస్తున్నారని మత్స్య శాఖ అధికారులు ప్రకటనలు ఇవ్వడం చర్చనీయంశమైంది. ఈ చెరువుల తవ్వకాలు జరిపేందుకు సంబంధించి అధికారులకు బడాబాబులు భారీ మొత్తంలో ముడుపులు చెల్లించినట్లు ఆయకట్టు రైతులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రభుత్వానికి సంబంధించిన ఏడబ్ల్యూడీ భూముల్లో యథేచ్ఛగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేస్తున్నా రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేదు. చెరువులు తవ్వకాలు పూర్తిగా మత్స్యశాఖ పరిధిలోకి వస్తాయని, వీటితో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. చెరువు గట్లను నిబంధనలకు విరుద్ధంగా పది అడుగులు ఎత్తున ఏర్పాటు చేస్తున్నా మైనింగ్‌ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. రైతులు తమ పంట పొలాల్లో మెరకలు తీసుకొనేందుకు మైనింగ్‌ అధికారులు సవాలక్ష ఆంక్షలు విధిస్తారు. ఇంత భారీ మొత్తంలో రొయ్యల చెరువులు తవ్వుతున్నా వారు పట్టించుకోకపోవడంపై రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం తవ్వకాలు చేపడుతున్న చెరువుల పక్కనే వేలాది ఎకరాల మాగాణి భూమి ఉంది. ఈ భూమిలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఉప్పునీటి చెరువుల కారణంగా ఆయకట్టు మొత్తం బీడుబారే ప్రమాదం ఉందని రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే సముద్రతీర ప్రాంతం వెంట తాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని, పొలాల పక్కన కూడా ఉప్పునీటి చెరువులు తవ్వితే భవిష్యత్‌లో సాగు భూమి లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. తీరప్రాంతాన్ని రక్షించాల్సిన అధికారులు, పాలకులు బడాబాబులకు కొమ్ముకాస్తూ నిబంధనలకు విరుద్ధంగా చెరవుల తవ్వకా లకు అనుమతి ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తు న్నారు. ఈ వ్యవహరంపై కలెక్టర్‌ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని తీరప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై మత్స్యశాఖ ఏడీ ప్రతిభను వివరణ కోరగా, హంసలదీవి సమీపంలో తవ్వేవి కొత్త చెరువులు కాదని, గతంలో ఉన్న వాటికి మరమ్మతులు చేసుకుంటున్నారని చెప్పడం గమనార్హం.

పొలాలు కుయ్యోరొయ్యో 1
1/1

పొలాలు కుయ్యోరొయ్యో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement