బీపీఎస్ అనరే?
జనవరి 29వ తేదీ వరకూ దరఖాస్తుల వివరాలు..
దరఖాస్తు చేయనివి కూడా చాలానే..
పెడన: అనధికారిక లే అవుట్లు(ఎల్‌ఆర్‌ఎస్), భవనాల క్రమబద్ధీకరణ(బీపీఎస్)లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసి క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది. దీంతో కొందరు దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు దరఖాస్తు చేసుకోలేదు. బీపీఎస్‌కు(బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం– భవనాల క్రమబద్ధీకరణ), ఎల్‌ఆర్‌ఎస్(లే అవుట్ రెగ్యులరేజేషన్ స్కీం– లే అవుట్లు క్రమబద్ధీకరణ)కు దరఖాస్తు ఫీజు రూ.10వేలు నిర్ణయించడంతో కొందరు ముందుకు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలు గడిచినా బీపీఎస్ కింద దరఖాస్తులు అతి తక్కువ సంఖ్యలోనే పరిష్కారం కావడం గమనార్హం. బీపీఎస్‌కు మార్చి 11తో గడువు పూర్తవనుండగా, ఎల్‌ఆర్‌ఎస్‌కు ఏప్రిల్ 23 వరకు గడువు ఉంది. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటికే పలు దఫాలుగా జీవోలు జారీ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ నెల 23న జీవో 49 జారీ చేసి ఏప్రిల్ 23వ తేదీలోగా క్రమబద్ధీకరించుకోవాలని పేర్కొంది.
బీపీఎస్ దరఖాస్తులు ఇలా..
భవనాల క్రమబద్ధీకరణ కోసం కార్పొరేషన్, మునిసిపాలిటీ, నగర పంచాయతీలకు సంబంధించి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జనవరి 29వరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే..
● కృష్ణాజిల్లాలో 1,196 దరఖాస్తులు రాగా 91 మాత్రమే పరిష్కరించారు. గుడివాడలో 145 దరఖాస్తులు రాగా 4 పరిష్కరించారు. మచిలీపట్నంలో 176కు ఆరు, పెడనలో 24కు జీరో, తాడిగడపలో 806కు 75, ఉయ్యూరు నగర పంచాయతీలో 45 దరఖాస్తులకు ఆరు దరఖాస్తులను పరిష్కరించారు.
● ఎన్టీఆర్ జిల్లాలో పరిశీలిస్తే 1,905 దరఖాస్తులకు 137 మాత్రమే పరిష్కరించారు. జగ్గయ్యపేటలో 35కు 11, కొండపల్లిలో 12కు ఒకటి, నందిగామ నగర పంచాయతీలో 116కు జీరో, తిరువూరు నగర పంచాయతీలో 47కు 11, విజయవాడ కార్పొరేషన్‌లో 1,695కు 114 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు.
ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తులు ఇవి..
● లే అవుట్ల రెగ్యులరేజేషన్ స్కీంకు సంబంధించి జనవరి 29వ వరకూ కృష్ణాజిల్లాలో 2,397 దరఖాస్తులు రాగా వీటిల్లో 392 మాత్రమే పరిష్కరించారు. గుడివాడలో 96కు 19, మచిలీపట్నంలో 391కి 41, పెడనలో 38కి 5, తాడిగడపలో 1,555కు 265, ఉయ్యూరు నగర పంచాయతీలో 317కు 62 దరఖాస్తులను పరిష్కరించారు.
● ఎన్టీఆర్ జిల్లాకు వస్తే 3,416 దరఖాస్తులు రాగా వీటిల్లో 1,058 మాత్రమే పరిష్కరించారు. మునిసిపాలిటీల వారీగా చూస్తే జగ్గయ్యపేటలో 36కు 9, కొండపల్లిలో 192కు 15, నందిగామలో 33కు జీరో, తిరువూరుకు 231కి 168, విజయవాడ కార్పొరేషన్‌లో 2,924కు 866 దరఖాస్తులు పరిష్కరించారు.
పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా రూ.74.62కోట్లు
ఆయా పురపాలక సంఘాల్లోను, కార్పొరేషన్లలో, నగర పంచాయతీలలో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిష్కరించడం ద్వారా రెండు జిల్లాలకు కలిపి వచ్చిన ఆదాయం రూ.74.62 కోట్లు. కృష్ణాజిల్లాలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వచ్చిన ఆదాయం 21.96 కోట్లు. ఎన్టీఆర్ జిల్లాలో వచ్చిన ఆదాయం రూ.46.14 కోట్లు. బీపీఎస్ దరఖాస్తుల ద్వారా కృష్ణాజిల్లాకు రూ.2.63 కోట్లు రాగా ఎన్టీఆర్ జిల్లాకు రూ.3.90 కోట్లు ఆదాయం వచ్చింది. మిగిలిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరిస్తే ఆదాయం వంద కోట్లకు పైగా దాటుతుందని మునిసిపల్ అధికారుల అంచనా.
దరఖాస్తు చేయని వాటిని కూడా అధికారులు గుర్తించారు. వారికి కూడా నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఒకసారి జారీ చేస్తే రెండోసారి కూడా ఇవ్వాలని ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. ఉదాహరణకు పెడన పురపాలక సంఘంలో బీపీఎస్‌కు సంబంధించి దరఖాస్తు చేసినవి కేవలం 24 మంది మాత్రమే. క్షేత్రస్థాయిలో గుర్తించినవి 217 వరకు ఉన్నాయి. ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి 43 వరకు అనధికారిక లే అవుట్లు ఉంటే దరఖాస్తు చేసింది 38 మంది. ఈ విధంగా మిగిలిన పురపాలక సంఘాల్లోను, నగర కార్పొరేషన్‌లలోను, నగర పంచాయతీల్లోను అధికంగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారీగా పెండింగ్‌లో ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ దరఖాస్తులు
రెండు జిల్లాల్లోనూ అతి తక్కువ
సంఖ్యలోనే పరిష్కారం
బీపీఎస్‌కు మార్చి11 వరకూ గడువు
ఎల్‌ఆర్‌ఎస్‌కు మాత్రం ఏప్రిల్
23వరకూ అవకాశం


