గుణదలలో మృతదేహం కలకలం
పాడుబడిన కారులో గుర్తింపు
మధురానగర్(విజయవాడసెంట్రల్): గుణదలలో పాడుబడిన కారులో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. రామవరప్పాడు నుంచి విజయవాడ వచ్చే మార్గంలో ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న పాతకారులో మృతదేహాన్ని స్థానికులు గురువారం గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు గుణదల పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో మృతుడు విజయవాడ గిరిపురానికి చెందిన పెయింటర్ నిమ్మకోరి చక్రపాణి (45) అని గుర్తించారు. చక్రపాణి గత సోమవారం నుంచి కనిపించటం లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడ కనిపించకుండా పోయిన చక్రపాణి గుణదల పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాత కారులో, గుణదల ఉత్సవాలు జరుగుతున్న సమయంలో విగతజీవిగా పడిఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చక్రపాణి అనారోగ్య సమస్యలతో చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
––––––––––––––––––––––––
12విఐసీ127ఏ: మృతుడు చక్రపాణి


