నయనానందకరం.. శిడి బండి ఉత్సవం
ఉయ్యూరు: శ్రీకనక చింతయ్య సమేత వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడి బండి ఉత్సవం శనివారం రాత్రి నయ నానందకరంగా సాగింది. కొబ్బరి తోట ప్రాంతంలో శిడి బండికి భక్తులు పసుపు నీరు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల కోలాహలం నడుమ శిడి బండిని కాలేజీ రోడ్డు, ప్రధాన సెంటరు మీదుగా ఊయల స్తంభాలు వద్ద ప్రదక్షిణలు చేయించి ఆలయం ఎదుట నిలి పారు. దళితవాడ నుంచి సీఆర్‌పీఎఫ్ విశ్రాంత మేజరు శివన్న కుమారుడు ఉయ్యూరు విక్రమ్ సింహ పెండ్లి కుమారుడిగా చలువ కావిళ్లతో ఊరేగింపుతో శిడి బండి వద్దకు చేరుకున్నాడు. సంప్రదాయం ప్రకారం శిడి బండి బుట్టలో విక్రమ్ సింహను కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణలు చేయించారు. అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడి బండిని నిలిపి మూడు సార్లు శిడి ఆడించారు. శిడి ఆడే క్రమంలో అశేష భక్తజనం ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షిస్తూ అరటిపండ్లు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరిపించారు. అమ్మవారికి చీర సారె సమర్పించారు.


