మైనింగ్ నిలిపివేయాలని ఆందోళన
గన్నవరం రూరల్: మండలంలోని సావరగూడెం గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. మన ఊరు–మన భవిష్యత్ అని పేర్కొంటూ ‘బాంబు పేలుళ్లు వద్దు.. అక్రమ మైనింగ్ వద్దు అని నిదిస్తూ మంగళవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి మైనింగ్ జరుగుతున్న క్వారీ వద్దకు చేరుకుని నిరసన దీక్ష చేపట్టారు. సావరగూడెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న వెదురుపావులూరులో సర్వే నంబరు 717–2లో కొండపోరంబోకు ఉంది. దీనిలో ఏపీఎస్పీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం భూమి కేటాయించింది. నిర్మాణాలు చేసేందుకు ఆ ప్రాంతాన్ని చదును చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏడాదిగా ఇక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని, రాత్రి వేళల్లో బాంబ్ బ్లాస్టింగులు చేస్తున్నారని సావరగూడెం గ్రామస్తులు ఆరోపించారు. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తరువాత జరుగుతున్న బ్లాస్టింగ్ ధాటికి తమ ఇళ్లు కదిలిపోతున్నాయని, ఇంట్లో సామగ్రి దెబ్బతింటోందని, తాగునీరు, సాగునీటి బోర్లు పూడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్ జరుగుతున్న పరిసరాల్లో పెట్రోల్ బంక్, గ్యాస్ గోడౌన్ ఉన్నాయని వివరించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయారు. కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై గన్నవరం తహసీల్దారు కె.వి.శివయ్యను వివరణ కోరగా.. గ్రామస్తుల ఆందో ళన విషయం తన దృష్టికి రాలేదన్నారు. మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. వీఆర్వో శేఖర్ ఆందోళనకారుల అభ్యంతరాలను నమోదు చేసుకున్నారు. ముస్తాబాద సీపీఎం నాయకులు కై లే ఏసుదాసు, ఆంతోని, బాలశౌరి, ఏడుకొండలు తదితరులు నిరసన శిబిరం సందర్శించి గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు.


