దుర్గమ్మ భక్తులకు త్వరలో జలప్రసాదం
రూ.1.10 కోట్లతో మినరల్ వాటర్‌ప్లాంట్ ట్రస్ట్ బోర్డు సమావేశంలో 15 అంశాలపై చర్చ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి విచ్చేసే భక్తులకు ఇకపై దేవస్థానమే ఉచితంగా మినరల్ వాటర్ బాటిళ్లను జల ప్రసాదంగా పంపిణీ చేయనుంది. ఇందు కోసం మినరల్ వాటర్‌ను బాటిళ్లలో ప్యాకింగ్ చేసేందుకు అవసరమైన ప్లాంట్‌ను దేవస్థానం ఏర్పాటు చేయనుంది. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో రూ.1.10 కోట్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ట్రస్ట్ బోర్డు సమావేశం సోమవారం బ్రాహ్మణ వీధిలో ఉన్న జమ్మిదొడ్డి ఆవరణలోని బోర్డు సమావేశ మందిరంలో నిర్వహించారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈఓ శీనానాయక్, ఏసీ రంగారావు, ఈఈ కోటేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఏఈఓలు హాజరయ్యారు. బోర్డు సమావేశంలో మొత్తం 15 అంశాలు చర్చకు రాగా పది అంశాలను ఆమోదించారు. కొన్నింటిని వాయిదా వేశారు. మరి కొన్నింటిని తిరస్కరించారు.
ఆమోదం తెలిపిన అంశాలివే...
ప్రసాదాల ప్యాకింగ్‌కు అవసరమైన క్యారీ బ్యాగులను 12 నెలలకు సరఫరా చేసే టెండర్‌ను ఆమోదించారు. దుర్గగుడి దత్తత దేవస్థానం కొమర వోలులోని అమరలింగేశ్వర దుర్గానాగేశ్వర స్వామి వారి ఆలయానికి మరమ్మతులు, పెయింటింగ్, నిర్వహణ పనులకు ఆమోదం తెలిపారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని రాయబార మండపం ఉత్తరభాగంలో మెట్లు అభివృద్ధికి రూ.8.25 లక్షల అంచనాలకు, వేసవి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటుకు రూ.14.50 లక్షల అంచనాలకు, మార్చిలో జరిగే కుంభాభిషేకానికి అవసరమైన స్కాఫోల్డింగ్ పనులకు రూ.6.50 లక్షల అంచనాలకు, భవానీ దీక్ష విరమణ సమయంలో లడ్డూ తయారీ నిమిత్తం కాంట్రాక్టర్‌కు రూ.19.85 లక్షలు చెల్లించేందుకు, ప్రసాదాల పోటులో నాలుగు లిఫ్ట్‌ల ఏర్పాటుకు రూ.1.70 కోట్ల అంచనాలకు, అన్నదాన భవనంలో రూ.70 లక్షల అంచనాలతో లిఫ్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. సీవీ రెడ్డి చారిటీస్ స్థలంలో 150 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు జిల్లా కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ చేసిన తీర్మానాన్ని ట్రస్ట్ బోర్డు తిరస్కరించారు. దేవస్థానానికి చెందిన భూములు, పొలం లీజులు, కౌలు వంటి అంశాలపైనా చర్చ జరిగింది.


