క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము | - | Sakshi
Sakshi News home page

క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము

Feb 10 2026 8:14 AM | Updated on Feb 10 2026 8:14 AM

క్వార

క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము

క్వారీల నుంచి టిప్పర్ల రాకపోకలతో వెదజల్లుతున్న దుమ్ము రహదారులకు ఇరువైపులాపంటలను కమ్మేస్తున్న దుమ్ము రోడ్లపై నామమాత్రంగా నీరు చల్లి వదిలేస్తున్న క్వారీల నిర్వాహకులు పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్న లోయ గ్రామాల రైతులు ఏడు గ్రామాల్లో 5,487.07 ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం

జి.కొండూరు: క్వారీలు, క్రషర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. నత్తనడకన రహదారులు విస్తరణ పనులు, అడుగడుగునా భారీ గోతులతో నిండిన రోడ్లపై అధిక లోడింగ్‌తో అతివేగంగా దూసుకెళ్తున్న టిప్పర్ల రాకపోకలతో రైతులు నష్టపోతున్నారు. రోడ్లను ఆనుకుని ఉన్న పొలా ల్లోని పైర్లు టిప్పర్ల కారణంగా రేగుతున్న దుమ్ముతో నిండిపోతున్నాయి. పంట వేయకుండా ఉండలేక, వేసినా దుమ్ము కారణంగా పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జి.కొండూరు మండలంలోని లోయ గ్రామాల రైతులు దుమ్ము సమస్యతో సతమతమవుతున్నారు.

వందల టిప్పర్ల రాకపోకలు

ఎన్టీఆర్‌ జిల్లాలో క్వారీలు, క్రషర్లు అంటే గుర్తొచ్చేది నందిగామ నియోజకవర్గంతో పాటు మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలు. ఇబ్రహీంపట్నం, కంచికచర్లలో కలిపి 39 క్వారీలు ఉన్నాయి. జి.కొండూరు మండలంలోని లోయ ప్రాంతంలో తొమ్మిది, కొండపల్లి పరిధిలో మరో ఆరు క్వారీలు నడుస్తున్నాయి. కొండ పల్లి, లోయలో ప్రాంతాల్లోని 15 క్వారీలు, క్రషర్ల నుంచి రోజూ వందల టిప్పర్లు మెటల్‌, డస్టును రవాణా చేస్తూ ఉంటాయి. జి.కొండూరు నుంచి గంగినేని వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జి.కొండూరు నుంచి గడ్డమణుగు ఎస్సీ కాలనీ మీదుగా మరో రహదారి సైతం మరమ్మతులకు నోచుకోక భారీ గోతులతో నిండిపో యింది. ఈ నేపథ్యంలో భారీ లోడులతో టిప్పర్లు మితి మీరిన వేగంతో రాకపోకలు సాగించడం వల్లన రహదారులను ఆనుకొని ఉన్న వ్యవసాయ భూముల్లో సాగువుతున్న పంటలపై దుమ్ము పేరుకుపోతోంది. దుమ్ము కారణంగా పంట దిగుబడులు పడిపోతున్నాయి.

ఏడు గ్రామాల్లో సమస్య తీవ్రం

క్వారీల నుంచి టిప్పర్ల రాకపోకల వల్ల జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు, పినపాక, కడింపోతవరం, చెర్వుమాధవరం, మునగపాడు, జి.కొండూరు, లోయ గ్రామాల్లో రహదారుల పక్కన రబీలో సాగువుతున్న 5,487.07 ఎకరాలలో మొక్కజొన్న, వరి, ఉద్యాన పంటలైన మిరప, అరటి, పామాయిల్‌, కూరగాయ పంటలపై దుమ్ము చేరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దుమ్ము లేవకుండా ఉండేలా నిత్యం రహదారులపై నీరు చల్లాల్సి ఉంది. అయితే క్వారీల నిర్వాహకులు నామమాత్రంగా నీళ్లు చల్లి వదిలేస్తున్నారు. దుమ్ము ప్రభావంతో అవసరాలకు భూములు అమ్ముకోవాలన్నా కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదని రైతులు వాపోతున్నారు.

క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము 1
1/1

క్వారీల దుమ్ము.. సాగు ఆశలు వమ్ము

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement