కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఇద్దరి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఇద్దరి బలవన్మరణం

Feb 9 2026 8:22 AM | Updated on Feb 9 2026 8:22 AM

కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఇద్దరి బలవన్మరణం

కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఇద్దరి బలవన్మరణం

కొత్తపేట పీఎస్‌ పరిధిలో ఇద్దరి బలవన్మరణం పోయిన బంగారు నగ అప్పగింత

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తపేట బ్రహ్మణ వీధి రాయన వారి వీధిలో వర్రి హైమావతి, సూర్య ప్రకాష్‌రావులు నివాసం ఉంటారు. వీరి ఇంటిలోని ఓ పోర్షన్‌లో బంకా లక్ష్మణరావు ఒంటరిగా నివాసం ఉంటాడు. లక్ష్మణరావు తోపుడు బండిపై నిమ్మకామలు అమ్ముతూ జీవిస్తుంటాడు. లక్ష్మణరావుకు గతంలో వివాహం కాగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వారితో విభేదాల కారణంగా నాలుగేళ్లగా హైమావతి ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. ఒంటరి జీవితం, ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఇంటి యజమానికి మూడు నెలలు అద్దె బకాయి ఉండటంతో శనివారం రాత్రి ఇంటికి వచ్చిన లక్ష్మణరావును డబ్బులు అడిగేందుకు హైమావతి కిందకు దిగింది. లోపల ఉన్న లక్ష్మణరావును ఎంత పిలిచినా పలకక పోవడంతో తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది. అయితే లోపల సీలింగ్‌ ఫ్యాన్‌కు లక్ష్మణరావు ఉరి వేసుకుని కనిపించడంతో కేకలు వేసింది. చుట్టు పక్కల వారు వచ్చి లక్ష్మణరావుకు ఉరి నుంచి కిందకు దింపగా అప్పటికే మృతి చెందాడు. ఘటనపై హైమావతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉరి వేసుకుని మైనర్‌..

కొత్తపేట ఆంజనేయ వాగు నాగేంద్రస్వామి వారి పుట్ట ప్రాంతంలో పాల కనకం, గోవిందుల కుటుంబం నివాసం ఉంటుంది. గోవిందుకు మొదటి వివాహం కాగా అమ్మాయి, అబ్బాయి సంతానం. గోవిందు మొదటి భార్య చనిపోవడంతో కనకంను రెండో వివాహం చేసుకున్నాడు. గోవిందు తాపీ పని చేస్తుండగా, కనకం టిఫిన్‌ బండి నడుపుతుంది. కనకం కుమార్తె 9వ తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. రెండు రోజులుగా సరిగా అన్నం తినకుండా ముబావంగా ఉండటంతో తల్లి ఆరా తీసినా విషయం చెప్పలేదు. ఆదివారం మధ్యాహ్నం బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుంది. దీంతో విషయం తెలుసుకున్న కనకం ఇంటికి వెళ్లి కుమార్తెను ఉరి నుంచి కిందకు దింపి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందింది. ఘటనపై తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కోనేరుసెంటర్‌: బందరు బస్టాండ్‌లో ఓ బాధితురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాన్ని సేకరించిన పోలీసులు సదరు వస్తువును సంబంధిత మహిళకు అప్పగించిన ఘటన మచిలీపట్నంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నరసాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే ఆమె కొంత మంది స్నేహితులతో కలిసి మొక్కుబడి తీర్చుకునేందుకు ఈ నెల 5న విజయవాడ బయలుదేరింది. నరసాపురం బస్సు బందరు బస్టాండ్‌కు రావటంతో విజయవాడ బస్సు ఎక్కేందుకు అందరూ బస్టాండ్‌లో దిగారు. ఆ సమయంలో లిఖిత చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌ కింద పడిపోయింది. విషయాన్ని ఎప్పటికో గ్రహించిన లిఖిత ఆభరణం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో అదే రోజు వెంటనే చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న బందరు డీఎస్పీ క్రైం పార్టీ సిబ్బంది బస్టాండ్‌కు చేరుకుని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఓ వృద్ధుడికి ఆభరణం కనిపించగా అతను ఆభరణాన్ని తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. సదరు వృద్ధుడి శారదనగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆభరణాన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం చిలకలపూడి సీఐ ఎస్‌కే నభీ చేతుల మీదుగా బాధితురాలికి ఆభరణాన్ని అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement