నదీమ తల్లికి కవితా హారతులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదిపై జలవిహారం చేస్తూ ప్రకృతి అందాలను తిలకించిన కవులు, కవయిత్రుల్లో భావావేశాలు ఉప్పొంగాయి. కృష్ణా తరంగాలపై ఓలలాడుతూ ఆనందోత్సాహాల నడుమ తమ కవితలతో కృష్ణమ్మకు హారతులిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, ఏపీ పర్యాటక శాఖ సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆదివారం విజయవాడ భవానీపురంలోని బెరంపార్క్ వద్ద ‘కృష్ణా తీరం.. కవితా హారం’ పేరుతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నదిలో ప్రయాణిస్తున్న బోటులో కవి సమ్మేళనం నిర్వహించడం ఒక కొత్త ఒరవడికి నాంది అని, ఇదే తరహాలో పెన్నా, గోదావరి నదీ తీరాలలో సాహిత్య కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవీపట్నం నుంచి పాపికొండలు వెళ్లే లాంచిలో త్వరలోనే కవి సమ్మేళనం నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. కవులు, రచయితలు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. కళలు, సాహిత్యం మన సంస్కృతికి చెట్ల వేర్లు వంటివని, అవి ఎంత బలంగా ఉంటే మన సమాజం అంత బలంగా ఉంటుందని చెప్పారు.
జాతి బతకాలంటే భాష బతకాలి
ఏపీ సృజనాత్మక, సంస్కృతి సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజశ్వి మాట్లాడుతూ జాతి బతకాలంటే భాష బతకాలన్నారు. చరిత్ర అనేది రాజుల శాసనాల నుంచి మాత్రమే కాదని, కవుల పద్యాల నుంచి కూడా తెలుసుకున్న చరిత్ర మనదని పేర్కొన్నారు. భాష, సాహిత్యాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ప్రతినిధులు, సాహిత్యాభిలాషులు తదితరులు పాల్గొన్నారు.


