పక్కా ప్రణాళికతోనే జోగి రమేష్ ఇంటిపై దాడి
మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
ఇబ్రహీంపట్నం: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి యాదృచ్ఛికంగా జరిగింది కాదని, పక్కా ప్రణాళిక పరంగా జరిగిన హత్యా ప్రయత్నమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం వచ్చిన ఆయన జోగి రమేష్ నివాసానికి వెళ్లి రమేష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం జోగి రమేష్ కుమారుడిపై అక్రమ కేసు, జోగి రమేష్‌పై నకిలీ మద్యం కేసుతో పాటు లోకేష్‌ను దూషించాడని పలు కేసులు పెట్టి ఎలా వేధిస్తుందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని విమర్శించారు. నేతల ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసే సంస్కృతి కొత్తగా ప్రారంభమైందన్నారు. గతంలో ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదని, ఇప్పుడు ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ దాడుల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నుంచోబెట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము కచ్చితంగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తామన్నారు. జోగి రమేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు జోగి రమేష్ పైన హత్యాయత్నం అవకాశం ఉన్నందున వన్ ప్లస్ వన్ సెక్యూరిటీతో పాటు ఆయన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోరారు. దాడి విషయమై మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాజీ మంత్రులు అందరం కలిసి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అంతకుముందు నూజివీడు, కై కలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, దూలం నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఏలూరు ఇన్‌చార్జి జయప్రకాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సర్నాల తిరుపతిరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి నల్లమోతు ప్రకాశ్ తదితరులు జోగి రమేష్ కుటుంబసభ్యులను పరామర్శించారు.


