పారిశ్రామిక క్షోభ..
చంద్రబాబు ప్రభుత్వంలో ఆదరణ సున్నా
నాడు వెన్నుదన్నుగా
ప్రభుత్వ ఆదరణ లేక ఐడీఏలో పరిశ్రమల మూత బాట
ఇబ్రహీంపట్నం: రాష్ట్రాభివృద్ధి కోసం పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ చంద్రబాబు సర్కార్ ఊదరగొడుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆయన చెబుతున్న మాటలకు చేతలకు పొంతన కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆదరణ లేకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి ఐడీఏ (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఏరియా)లో పరిశ్రమలు మూతబాట పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక బ్యాంకు రుణాలతో వాటిని నిర్వహించలేక.. భారంగా మారడంతో పారిశ్రామిక క్షోభ ఏర్పడుతోంది.
అందని భరోసా
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాటి పాలకులు పరిశ్రమల నిర్వహణకు భరోసా ఇచ్చారు. వాటికి అవసరమైనవన్నీ అందుబాటులోకి తీసు కొచ్చారు. నాడు అందించిన భరోసా.. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో పరిశ్రమలకు అందడం లేదు. ఆదరణ ఉపన్యాసాల్లోగానీ.. ఆచరణలో కానరావడం లేదు. దీంతో ఏపీఐఐసీకి చెందిన అనేక ఖాళీ స్థలాలు కూడా నిరుపయోగంగా మారాయి. కొండపల్లిలో 1986లో 438 ఎకరాల్లో 308 ప్లాట్లతో ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేశారు. ఇక్కడ 150 పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. అప్పటి నుంచి ఎందరికో జీవనోపాధి చూపిన పరిశ్రమలు నేడు మూసివేత దశకు చేరుకోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలను పట్టించుకోకపోవడంతో ఇలాంటి దుస్థితి ఎదురవుతోంది.
పరిశ్రమల నిర్వహణ భారం
ఒకప్పుడు కొండపల్లి ఐడీఏలోని పరిశ్రమల్లో తయారైన వివిధ రకాల ఉత్పత్తులు రాష్ట్రవ్యాప్తంగా ఎగుమతి జరిగేవి. ప్రస్తుతం పరిశ్రమలు నిర్వహణ కష్టంగా మారిందని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పెట్టుబడులు అధికమొత్తంలో వెచ్చించడం, ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడం, కూలీల కొరత, తీసుకున్న బ్యాంకు రుణాలకు వడ్డీలు చెల్లించలేక పోవడం, మార్కెట్‌లో ఉన్న పోటీతత్వంతో యజమానులు పరిశ్రమల మూసివేతకు మొగ్గుచూపుతున్నారు. ఈ రెండేళ్ల కాలంలో ఇక్కడ సుమారు 30కి పైగా పరిశ్రమలు మూత పడ్డాయి. మూలధనం పెట్టుబడి, వార్షిక ఆదాయ వ్యయాల్లో భారీ వ్యత్యాసాలు నమోదు కావడంతో వీటిని నిర్వహించలేకపోతున్నారు. కొందరు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. వడ్డీ భారం పెరగడంతో పాటు కార్మికుల కొరత వేధిస్తోంది. నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమవుతు న్నాయని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తి శబ్దాలతో కళకళలాడిన పరిశ్రమలు నేడు మూగనోము పట్టాయి. ఒకప్పుడు పొగలు కక్కిన చిమ్నీలు నిశ్శబ్దంగా నిలిచాయి. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ తీరుతో ఆదరణ లేక.. పెరుగుతున్న నష్టాల కారణంగా కొండపల్లి ఐడీఏలోని అనేక పరిశ్రమలు మూత బాట పడుతున్నాయి. పారిశ్రామిక సంక్షోభ ఛాయలు ఎదురుకావడంతో వేలాది కుటుంబాల భవితవ్యం ఆందోళనలో పడింది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఎంఎస్‌ఎంఈ మూడేళ్ల నూతన పాలసీ తీసుకొచ్చి కొత్తగా పరిశ్రమలు నెలకొల్పేవారికి అనేక రాయితీలు ప్రకటించింది. కరోనా కష్టకాలంలో అనేక పరిశ్రమలు నిలదొక్కుకోలేక మూలనపడే దశకు చేరుకున్నాయి. ఆ సమయంలో అప్పటికే ఉన్న బ్యాంకు రుణాలపై 20శాతం అదనంగా రుణాలు అందజేసింది. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలు మొత్తం విడుదల చేసి ఇండస్ట్రీస్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రోత్సాహం అందించింది. దీంతో రెండేళ్ల కరోనా కాలంలో సైతం అవి నిర్విరామంగా నడిచాయి. ఎంఎస్‌ఎంఈలపై మరింత భారం పడకుండా చేశారు. మారటోరియం విధించి ఆరు నెలల కాలవ్యవధిలో రుణాలకు అప్పులు, వడ్డీలు చెల్లించకుండా వెసులుబాటు కల్పించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కింది.


