భర్త ఆచూకీ కోసం పోలీస్‌స్టేషన్ ఎదుట గర్భిణి ఆందోళన
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): తన భర్తను అతని అన్న, తల్లి ఎక్కడో నిర్బంధించారని, ఆయన ఆచూకీ తెలపమంటే పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ నిండు గర్భిణి తన బంధువులతో కలిసి సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన ఘటన మంగళవారం జరిగింది. బాధితు రాలి కథనం మేరకు.. సింగ్‌నగర్ పైపులరోడ్డు సమీపంలో నివసిస్తున్న పినపాల లిఖితకు జ్ఞానపవన్ కుమార్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. పెళ్లయిన కొంతకాలం వరకూ తన భర్త, అత్త పుణ్యలక్ష్మీదుర్గ తనను బాగానే చూసున్నారని, ఆ తరువాత వారిద్దరితో పాటు తన బావ ఉదయ్‌కిరణ్ తనను వేధింపులకు గురిచేస్తున్నారని లిఖిత ఆరోపించింది. గతేడాది టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో 498ఏ కింద కేసు పెట్టగా ఆ తరువాత తాను, తన భర్త పటమటలో వేరు కాపురం పెట్టుకుని నివసిస్తుండగా, అత్త, బావ అక్కడకు కూడా వచ్చి తనను వేధింపులకు గురిచేశారని, దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిపింది. ఆ తరువాత నుంచి తన భర్త జ్ఞానపవన్‌కుమార్ ఆచూకీ తెలియడం లేదని, తన అత్త, బావలే ఎక్కడో నిర్బంధించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తూ సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నెల రోజుల నుంచి పట్టించుకోవడం లేదని, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించింది.
లిఖిత నోటీసులు తీసుకోవడం లేదు
తన భర్త ఆచూకీ తెలపాలంటూ లిఖిత నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదూ అందలేదని సింగ్‌నగర్ సీఐ బి.హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. గత డిసెంబర్ 25వ తేదీన లిఖితే తనపై దాడి చేసి గాయపర్చిందని ఆమె అత్త పుణ్యలక్ష్మీదుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి 41ఏ నోటీసులు తీసుకోవడానికి రావాలని లిఖితను ఎన్నిసార్లు పిలిచినా స్టేషన్‌కు రావడం లేదన్నారు. పటమటలో లిఖిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ కావడంతో గత నెల 19వ తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కేసు విచారణకు ఆమె సహరించకపోగా ఇలా పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేపడతామన్నారు.


