
అంతర్జాతీయంగా 130 ఏళ్లు, భారత్‌లో పాతికేళ్ల వార్షికోత్సవ వేడుక సందర్భంగా స్కోడా ఆటో తన ప్రముఖ మోడళ్లు కైలాక్, స్లావియా, కుషాక్‌లకు లిమిటెడ్ ఎడిషన్ కార్లు విడుదల చేసింది. ఈ పరిమిత ఎడిషన్‌లను ఇప్పటికే ఉన్న హై–స్పెసిఫికేషన్‌ల ఆధారంగా తీర్చిదిద్దారు. అంటే కుషాక్, స్లావియా కోసం మోంటే కార్లో ట్రిమ్‌లపై, కైలాక్ కోసం ప్రెస్టీజ్, సిగ్నేచర్ ప్లస్ ట్రిమ్‌లపై ఆధారపడి రూపుదిద్దుకున్నాయి.
ఎడిషన్ వేరియంట్లు ప్రత్యేకంగా 25వ వార్షికోత్సవ బ్యాడ్జ్‌తో, మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా తయారయ్యాయి. ఉచితంగా ఇచ్చే యాక్సెసరీస్ కిట్‌లో 360–డిగ్రీ కెమెరా, పుడిల్ ల్యాంప్స్, అండర్ బాడీ లైటింగ్, ప్రత్యేక బాడీ గార్నిష్‌లు ఉంటాయి. ఈ కిట్ వేరియంట్లకు ప్రీమియం లుక్‌తో పాటు, మరింత ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది.
ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?
‘మా సుదీర్ఘ ప్రయాణంలో భాగమైన అభిమానులకు ఇది మేము ఇస్తున్న కానుక. కస్టమర్ల ప్రాధాన్యతలకు పెద్ద పీట వేస్తూ ఉత్పత్తులు అందించే మా బలమైన అంకితభావానికి నిదర్శనం. ఇకపైనా అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇస్తున్నాము’ అని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అశిష్ గుప్తా తెలిపారు.