
స్కోడా ఇండియా.. సరికొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octovia RS) కారును అక్టోబర్ 17న భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా దీనికోసం రూ. 2.50 లక్షల టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలుపెట్టింది. బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే.. దేశీయ విఫణికి కేటాయించిన అన్ని కార్లు అమ్ముడైపోయాయి.
స్కోడా (Skoda) కంపెనీ తన ఆక్టావియా ఆర్ఎస్ కారును భారతదేశంలో 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే ఈ కొత్త కారును 100 మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. బుకింగ్స్ ప్రారంభమైన తరువాత ఈ 100 యూనిట్లు అమ్ముడైపోయాయని సంస్థ వెల్లడించింది. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం. దీనిని సీబీయూ మార్గం ద్వారా దేశంలోకి దిగుమతి చేసుకుంటారు. ఈ కారణంగానే దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.
కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు.. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, డీఆర్ఎల్ వంటి వాటితో పాటు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇది 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదనపు అప్‌గ్రేడ్‌లను పొందుతుంది.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 216 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్‌మిషన్ ద్వారా శక్తిని ఫ్రంట్ వీల్స్‌కు డెలివరీ చేస్తుంది. ఈ కారు 6.4 సెకన్లలో 0-100 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం.