భారతదేశంలో కేవలం సెడాన్, హ్యాచ్‌బ్యాక్స్ కార్లకు మాత్రమే కాకుండా.. ఎస్‌యూవీలకు, ఎంపీవీలకు డిమాండ్ ఉంది. దీంతో వీటి సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కథనంలో అత్యంత సరసమైన.. ఐదు 7 సీటర్ కార్లను గురించి తెలుసుకుందాం.
రెనాల్ట్ ట్రైబర్
రెనాల్ట్ ట్రైబర్ భారతదేశంలో అత్యంత సరసమైన ఎంపీవీ. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 8.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ కారు స్లైడింగ్, రిక్లైనింగ్ (మధ్య వరుస) సీట్లను పొందుతుంది. అంటే ప్రయాణీకులు అవసరానికి అనుగుణంగా సీటింగ్ లేఅవుట్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చన్నమాట. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ & ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.

మహీంద్రా బొలెరో
మహీంద్రా బొలెరో భారతదేశంలో చాలా కాలంగా అందుబాటులో ఉంది. ఈ మోడల్ సెవెన్ సీటర్ ధర రూ. 7.99 లక్షల నుంచి రూ. 9.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. బొలెరో గ్రామీణ & సెమీ అర్బన్ ప్రాంతాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్
సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్ అనేది ఏడు సీట్ల లేఅవుట్‌తో కూడిన కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఇండియన్ మార్కెట్లో ఏడు సీట్ల లేఅవుట్‌తో అందుబాటులో ఉన్న సిట్రోయెన్ మోడల్ ఇదే. దీని ధర రూ. 8.29 లక్షల నుంచి రూ. 13.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది.

మహీంద్రా బొలెరో నియో
మహీంద్రా బొలెరో నియో బొలెరో.. లేటెస్ట్ వెర్షన్. ఇది మెరుగైన డ్రైవింగ్ అనుభూతిని అందివ్వడమే కాకుండా.. మెరుగైన ఫీచర్-ప్యాక్డ్ క్యాబిన్‌ను అందిస్తుంది. బొలెరో నియో కూడా కొన్ని నెలల క్రితం బొలెరోతో పాటు డిజైన్ ట్వీక్‌లు, అదనపు ఫీచర్లను పొందింది. బొలెరో నియో పవర్‌ట్రెయిన్.. సాధారణ బొలెరో మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 8.49 లక్షల నుంచి రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.

మారుతి సుజుకి ఎర్టిగా
మారుతి సుజుకి ఎర్టిగా.. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎంపీవీ. ధరకు తగిన సామర్థ్యం, డిజైన్, ఫీచర్లు, పవర్‌ట్రెయిన్ వంటివి ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ ఎంపీవీ పెట్రోల్, CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలలో లభిస్తుంది. ఇందులో 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ. 8.80 లక్షల నుంచి రూ. 12.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.


