
మన దేశంలో కాఫీ హోటల్ బయట పెట్టిన బైక్‌లు మాయమవడం మామూలే. కాని యు.కె.లో కూడా ఇలా జరిగితే వెర్రి ముఖం వేయక తప్పదు. అది కూడా ఆ బైకే ఆధారంగా ప్రపంచ యాత్ర చేస్తున్నవాడికి. అదే జరిగింది. ముంబైకి చెందిన 33 ఏళ్ల యోగేష్ అలెకరి తన కెటిఎం బైక్ మీద దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తుంటాడు. ఇతడు మొన్నటి మే నెలలో తన తాజా యాత్ర మొదలెట్టి 17 దేశాల మీదుగా సెప్టెంబర్ మొదటి వారానికి యు.కె. చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆఫ్రికా చేరుకుంటే యాత్ర ముగుస్తుంది. అయితే యు.కె.లోని నాటింగ్‌హామ్‌లో ఒక కేఫ్‌లో కాఫీ తాగి బయటకి వచ్చేసరికి బైక్ కొట్టేశారు. దాంతో యాత్ర ఆగిపోవడమే కాదు అన్ని వస్తువులూ పోయాయి.
దేశం కాని దేశంలో బైక్ కొనడం కూడా ఖరీదైన వ్యవహారమే. హతాశుడైన యోగేష్ తన ఇన్‌స్టాలో జరిగింది మొరపెట్టుకోవడంతో అతణ్ణి ఫాలో అవుతున్నవారంతా సాయానికి ముందుకొచ్చారు. తాము బైక్ కొనిస్తామన్నారు. అయితే నాటింగ్‌హామ్‌లోని ఒక సెకండ్‌హాండ్ బైక్ స్టోర్ ఓనరు స్పందించాడు. ‘మా దేశం మర్యాద మేం పోగొట్టుకోము. అతనికి అలాంటి బైకే మరింత మంచి కండిషన్‌లో ఉన్నది ఇస్తాము’ అని ప్రకటించి మరీ మంచి బైక్ ఇచ్చాడు. దాంతో యోగేష్ ముఖాన నవ్వు వచ్చింది. అతని యాత్ర మళ్లీ మొదలైంది. దేశం పరువును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మన దేశంలో విదేశీ టూరిస్ట్‌లు కనిపిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవడం పౌరుల ధర్మం.