కూలూవెన్ వర్సిటీతో తెలంగాణ ఈసీ బృందం భేటీ | Telangana EC team visit to Belgium | Sakshi
Sakshi News home page

కూలూవెన్ వర్సిటీతో తెలంగాణ ఈసీ బృందం భేటీ

Jan 13 2026 9:04 PM | Updated on Jan 13 2026 9:10 PM

Telangana EC team visit to Belgium

సాక్షి హైదరాబాద్: బెల్జియం అధికారిక పర్యటనలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) రాష్ట్ర బృందం ప్రపంచ ప్రసిద్ధ కూలూవెన్ యూనివర్సిటీతో  కీలక చర్చలు నిర్వహించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలు, ఎన్నికల నిర్వహణ విధానాలపై భారత్-బెల్జియం దేశాల మధ్య పోలికలు ప్రధాన అంశంగా ఈ భేటీ సాగింది.

ఈ సందర్భంగా కూలూవెన్ యూనివర్సిటీలోని సోషల్ సైన్సెస్ విభాగం డీన్‌, ప్రొఫెసర్లు బెల్జియం ఎన్నికల వ్యవస్థ, ఓటింగ్ విధానాలు, సంస్థాగత భద్రతా చర్యలు, ఆధునిక సవాళ్లపై వివరాలను భారత బృందానికి సమగ్రంగా వివరించారు. అనంతరం భారత ప్రతినిధులు దేశంలోని ఎన్నికల వ్యవస్థ విస్తృతి, సామాజిక వైవిధ్యం, సమాఖ్య స్వరూపం వంటి విశిష్ట లక్షణాలను ప్రస్తావిస్తూ భారత ఎన్నికల ప్రక్రియపై తులనాత్మక సమీక్ష ప్రవేశపెట్టారు.

అనంతరం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్‌రెడ్డి మాట్లాడారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలెక్షన్ మేనేజ్‌మెంట్ ఎన్నికల అధికారుల సామర్థ్య వృద్ధి, అంతర్జాతీయ అనుభవాల మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. శిక్షణ, సంయుక్త పరిశోధనలు, గ్లోబల్ ఉత్తమ విధానాల పంచకంలో భాగస్వామ్యానికి కూ లూవెన్ యూనివర్సిటీ ముందుకు రావాలని ఈ సందర్భంగా  ఆయన ఆహ్వానించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో 99 కోట్ల మందికిపైగా ఓటర్ల విశ్వాసాన్ని నిలబెట్టేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న కఠిన చర్యలు, పారదర్శకత, ఎన్నికల సమగ్రత పరిరక్షణ అంశాలను  భారత బృందం ఈ సందర్భంగా వారికి  వివరించింది.ఈ సమావేశంలో ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డితో పాటు అనుదీప్ దురిశెట్టి, బోయపాటి చెన్నయ్య, కె. అనంత్‌రెడ్డి, ధృవ కుమార్‌రెడ్డి తదితర అధికారులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement