అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి! | Sakshi Editorial On Jubilee Hills by election | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!

Nov 2 2025 12:52 AM | Updated on Nov 2 2025 12:52 AM

Sakshi Editorial On Jubilee Hills by election

జనతంత్రం

అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.

తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ ఓడించ గలిగింది.

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. 

ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్‌ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.

సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్‌ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్‌ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.

మైసూర్‌ పాక్‌లో మైసూర్‌ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్‌ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌ ప్రాంతాలు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్‌ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్‌ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. 

మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్‌ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్‌ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.

జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్‌ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్‌ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. 

కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్‌ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.

అజారుద్దీన్‌ జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్‌ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. 

క్రీడారంగంలో దేశానికి అజర్‌ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.

ఆరు మాసాల్లోగా అజర్‌ భాయ్‌ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్‌ కేసును ఎదు ర్కొంటున్నారు. 

ఈ పరిస్థితుల్లో గవర్నర్‌ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్‌ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్‌ పార్టీ అవమానించినట్టవుతుంది.

మజ్లిస్‌ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్‌ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్‌ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్‌ ఏమాత్రం కనిపించడం లేదు. 

ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్‌ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.

ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని  పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్‌ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్‌ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్‌ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. 

ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్‌ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్‌ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్‌ హయాంలో తమకు అందిన రంజాన్‌ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. 

వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.

గడచిన రెండేళ్ళలో మార్కెట్‌లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్‌ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. 

కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్‌ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. 

రేషన్‌ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్‌ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు  పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. 

ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement