జనతంత్రం
నిజాలపై నివురు కప్పడం, అసత్యాలకు అలంకారం చేయడం ఇప్పుడొక రాజకీయ క్రీడ. ఇందులో చంద్రబాబు, ఆయన బృందం ఆరితేరిన ఆటగాళ్లని ప్రశస్తి. ఈ ఖ్యాతిలో సింహభాగం యెల్లో మీడియాకు దక్కుతుంది. ఈ మీడియా గత మూడు దశాబ్దాలుగా ఊదరగొట్టిన ఫలితంగా, తెలుగునాట ప్రత్యామ్నాయ మీడియా నిలబడకుండా చేసిన కుట్రల కారణంగా నిజంగానే చంద్రబాబును ఒక ఐటీ నిపుణుడిగా, దూరదృష్టి గల విజనరీగా నమ్మేవారి సంఖ్య గణనీయంగానే ఉన్నది. సాంఘిక శాస్త్రాల అధ్యయనానికి దూరమై ప్రాపగాండా ప్రవాహంలో కొట్టుకుపోయే నవతరంలో కూడా ఇటువంటి అభిప్రాయాలున్నాయి.
ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలేమిటో తెలిసిన వారు లేకపోలేదు. అప్పుడూ ఉన్నారు. ఇప్పుడూ ఉన్నారు. కానీ నిజం నిద్ర లేచే సరికే అబద్ధం ఊరేగివస్తుందంటారు కదా! అదే జరుగుతున్నది. చంద్రబాబుకు విజనరీ వేషం వేయడానికి యెల్లో మీడియా పౌండ్రక వాసుదేవ పాత్రను కాపీకొట్టినట్టుంది. వసుదేవుని కుమారుడు గనుక శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవుడంటారు.
ఆ వసుదేవునికి ఇంకో కొడుకుండేవాడట! ఆయనకు కొందరు ‘వాలతుల్యుల’తో కూడిన ఒక కోటరీ ఉండే దట! అసలైన వాసుదేవుడివి నువ్వేనంటూ ఈ కోటరీ ఉబ్బేయ డంతో ఆయన కూడా నెమలి పింఛం ధరించడం, పిల్లనగ్రోవి పట్టుకోవడం సహా కృష్ణ వేషధారణ వేయడం మొదలు పెట్టాడట! అంతటితో ఆగలేదు – తన వేషాన్ని వేసుకోవద్దని శ్రీకృష్ణుడినే బెదిరించేదాకా వెళ్లాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొన్నటి మీడియా సమావేశంలో ఇటువంటి పౌండ్రక వాసు దేవ ఇమేజ్‌నే చీల్చి చెండాడారు. నేటి తరం రాజకీయ నేతల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన ప్రెస్‌మీట్లను గానీ, ఇతర కార్యక్రమాలను గానీ ఒక్క ‘సాక్షి’ యూ–ట్యూబ్ ప్లాట్‌ఫామ్ వీడియోల్లోనే 50 లక్షల మందికి పైగా వీక్షిస్తారు. ‘సాక్షి’ టీవీ, దాని డిజిటల్ ప్లాట్ ఫామ్‌లతోపాటు ఇతర దృశ్య మాధ్యమాలతో కలిపితే ఈ సంఖ్య ఒక్కరోజులోనే కోట్లలో ఉంటున్నది. దీనికి పత్రికా పాఠకులు, డిజిటల్ ఎడిషన్లలో చదివే వారి సంఖ్య తోడవుతుంది.
ఆయన మెసేజ్‌లు ఈ స్థాయి విస్తృతికి చేరడమే కాదు, వాటికి విశ్వస నీయత కూడా ఎక్కువ. జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాల్లో ఊకదంపుడు తక్కువ. సూటిగా తాను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రస్తావించడం, అందుకు సాక్ష్యంగా సాధికారికమైన లెక్కల్ని ఉటంకించడం, డాక్యుమెంట్లను ప్రదర్శించడం ఆయన అనుస రించే పద్ధతి. ఈ వైఖరి కారణంగా కూటమి సర్కార్ బండారాన్ని ఏడాదికాలంలోనే బట్టబయలు చేయగలిగారు.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో నాలుగు అంశాలపై జగన్ మాట్లాడారు. ముఖ్యంగా సర్కార్ ఆడుతున్న కల్తీ లిక్కర్ నాటకంపైనా, డేటా సెంటర్‌కు సంబంధించి చేస్తున్న క్రెడిట్ చౌర్యంపైనా సుదీర్ఘంగా మాట్లాడారు. ‘క్రెడిట్ చోరీ’ అనే మాటను కాయిన్ చేస్తూ, సైబర్ టవర్స్, ఔటర్ రింగ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు దాకా హైదరాబాద్ నిర్మాతగా బాబు తగిలించుకున్న నకిలీ మెడల్స్‌ను పీకిపారేశారు.
ఆరెకరాల స్థలంలో లక్షా నలభైవేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ‘సైబర్ టవర్స్’కు ‘హైటెక్ సిటీ’ అని నామకరణం చేసి ప్రచారం చేసుకున్న వైనాన్ని ఆయన ఎండగట్టారు. ఆ భవనానికి కూడా అంతకుముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు.
వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, భూసేకరణతోపాటు తొలి దశ నిర్మాణం కూడా పూర్తిచేసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు, ఆయన హయాంలోనే ప్రారంభమై పూర్తిచేసుకొని వినియోగంలోకి వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, 12 కిలోమీటర్ల ‘పీవీ ఎక్స్ ప్రెస్ వే’లు హైదరాబాద్ నగరాభివృద్ధికి వన్నెలద్దిన విషయాన్ని జగన్ గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గద్దెదిగే నాటికి రాష్ట్ర ఐటీ ఎగుమతుల విలువ రూ.5,660 కోట్లు మాత్రమే. దేశంలో నాలుగో స్థానం. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల లోనే రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. ఎగుమతుల విలువ రూ.32,500 కోట్లకు చేరింది. కేసీఆర్ పదేళ్ళ పాలన తర్వాత ఆ ఎగుమతులు రెండు లక్షల కోట్లకు చేరుకున్నాయి.
తాను న్యూయార్క్‌లో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా అని హీరో రజనీకాంత్‌కు ఆశ్చర్యం కలిగించిన దృశ్యాలన్నీ కేసీఆర్ కాలంలోనే ఆవిష్కృతమయ్యాయి. ఇలాంటి వాస్తవాలతో పొంతన లేకుండా వందిమాగధ మీడియా బృందంచే బాబు వేయించు కున్న వీరతాళ్ల బాగోతాన్ని జగన్ విప్పిచెప్పారు. అన్నిటికంటే ముఖ్యం – తాజా డోల్‌బాజా విశాఖ డేటా సెంటర్.
ఈ డేటా సెంటర్ మీద టీడీపీ యెల్లో మీడియా సృష్టించిన సంరంభాన్ని, జగన్ మీడియా సమావేశానికి ముందూ, వెనకగా విభజించాలి. గురువారానికి ముందు ఆ సందడే వేరు! సాక్షాత్తూ గూగుల్ సంస్థే ఆంధ్రప్రదేశ్ కేరాఫ్ చంద్రబాబు అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సిద్ధమైందని ప్రచారం చేశారు. జరిగిన నేపథ్యాన్ని, అంతకుముందే పడిన పునాదిని మరుగునపెట్టారు.
ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకటే హోరు. చంద్రబాబంటే డేటా సెంటర్లు, అమరా వతి నిర్మాణాలు – జగనంటే మటన్ షాపులు, చికెన్ సెంటర్లని ప్రచారం చేశారు. జగనంటే పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, పిల్లలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, అందరికీ ఆరోగ్యశ్రీ, ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్, 30 లక్షలమంది ఇళ్లు – ఇళ్ల స్థలాలు, అధికార వికేంద్రీకరణ, రైతు భరోసా కేంద్రాలు అనే విషయాన్ని జనం మరిచిపోయి ఉంటారని వారి నమ్మకం కావచ్చు. గురువారం నాటి జగన్ సమావేశం తర్వాత టీడీపీ నేతలు, యెల్లో మీడియాల సందడి తేలు కుట్టిన దొంగల చందంగా మారింది.
ప్రతిపక్ష నేత వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నవంబర్‌లోనే విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం కుదిరింది. డేటా సెంటర్‌కు డేటా తీసుకురావడానికి వీలుగా సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవునా సబ్‌సీ (సముద్ర మార్గం) కేబుల్ వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 9నే లేఖ రాసింది. ఈ లేఖ కాపీని కూడా ఆయన విడుదల చేశారు.
ఢిల్లీ సమీపంలోని నోయిడాలో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్‌తో అదానీ సంస్థకు ఒప్పందం కుదిరింది. ఈమేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అప్పుడే ప్రచురితమైన వార్తా కథనం కటింగ్‌ను జగన్ విడుదల చేశారు. అంటే మూడేళ్ళుగా ఈ రంగంలో అదానీ గ్రూప్, గూగుల్ కలిసి పనిచేస్తున్నాయి. 2023 మే నెలలో విశాఖలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. అంతకుముందటి రెండేళ్ళలో ఎక్కువకాలం కోవిడ్ పరిస్థితులు న్నాయని గమనంలో ఉంచుకోవాలి.
ఇప్పుడు కూటమి సర్కార్ ఆర్భాటంగా ప్రకటించుకున్న వెయ్యి మెగావాట్ల గూగుల్ సెంటర్, 2023లో జగన్ శంకు స్థాపన చేసిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే! ఈ డేటా సెంటర్‌కు అవసరమైన సబ్ సీ కేబుల్, డేటా ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన పూర్వరంగం జగన్ హయాంలోనే సిద్ధమైంది. కేవలం డేటా సెంటర్ మాత్రమే అయితే ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండదు కాబట్టి దానికి అనుబంధంగా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి, పాతిక వేలమందికి ఉపాధి కల్పించాలని జగన్ సర్కార్ షరతు పెట్టింది.
ఇప్పుడు ముందుకొచ్చిన విస్తరణలో అటువంటిదేమీ కనిపించలేదు. కేవలం డేటా సెంటర్ మాత్రమే. దాని ఏర్పాటుకు దోహదం చేసిన పూర్వరంగంలోని అదానీ– గూగుల్ గ్రూప్‌తో పాటు అప్పటి జగన్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం పాత్రధారులే! పాత్రధారులందరినీ మరుగునపెట్టి, కేవలం గూగుల్‌కూ, చంద్రబాబుకూ మధ్య జరిగిన ఒప్పందం ఫలితంగా వచ్చిన కొత్త ప్రాజెక్టుగా కూటమి సర్కార్ ప్రచారం చేసుకున్న తీరును జగన్ ప్రశ్నించారు.
‘క్రెడిట్ చోరీ’ అనే పదబంధం కొత్తది కావచ్చు కానీ, ఇతరుల క్రెడిట్‌ను చంద్రబాబు కోసం యెల్లో మీడియా కొట్టేస్తుందనే విషయం చాలాకాలంగా తెలిసిందే. ఈ విధానా నికి ఇంకో పార్శ్వం కూడా ఉన్నది. అదే డెబిట్ బదిలీ. తాము తప్పు చేస్తూ, ఆ తప్పును ప్రత్యర్థుల ఖాతాలో వేయడం! మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించిన నకిలీ లిక్కర్ తయారీ అంశం ఈ కోవలోనిదే.
రాష్ట్రవ్యాప్తంగా ఒక పరిశ్రమ మాదిరిగా విరాజిల్లుతున్న నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాన్ని ఫోటోలతో సహా ఆయన మీడియా ముందు బహిరంగపరిచారు. ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం, పర వాడ, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, రేపల్లె, నెల్లూరుల గురించే ఆయన ప్రస్తావించినప్పటికీ ఇటువంటి కార్ఖానాలు ఇంకా డజన్లకొద్దీ ఉన్నట్టు సమాచారం.
నకిలీ మద్యం తయారీ – అమ్మకాలపై కూటమి ప్రభుత్వం ప్రారంభం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు కనిపి స్తున్నది. ఈ రంగంలో అనుభవం ఉన్న జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి పోటీకి నిలిపారు. ఈ కార్యక్రమంలో మరో ‘నిపుణుడు’ జనార్దన్‌రావు కూడా పాల్గొన్నట్టు వార్తలు, ఫోటోలు బయటకు వచ్చాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మద్యం షాపుల వ్యవస్థ ఈ నకిలీ మద్యం ప్రవాహానికి అనుకూలించదు. అందువల్ల దాన్ని రద్దు చేయాలి. మద్యం అలవాటును నియంత్రించే ఉద్దేశంతో జగన్ ప్రైవేట్ వ్యాపారుల వ్యవస్థను తొలగించారు. బెల్ట్‌షాపులను, పర్మిట్ రూములను పూర్తిగా తొలగించారు. లైసెన్స్‌డ్ మద్యం షాపులను కూడా కుదించి, ప్రభుత్వ రంగంలోనే నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు సాగించారు.
సామాజిక ప్రయోజనాల రీత్యా, ఆరోగ్యాల రీత్యా కూడా అది మంచి వ్యవస్థ. దాన్ని తొలగించి ప్రైవేట్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలంటే ఉన్న వ్యవస్థ మంచిది కాదని ప్రచారం చేయాలి. కూటమి సర్కార్ అదే పని చేసింది. వ్యాపారాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించి అమ్మకాలను ప్రోత్సహించినట్లయితే, బెల్ట్ షాపులకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చినట్లయితే, మద్యం తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా అనుమతులిచ్చి నట్లయితే అందులో స్కామ్ ఉండేందుకు అవకాశం ఉంటుంద నేది కామన్‌సెన్స్.
ఇవేమీ లేని వ్యవస్థలో స్కామ్ జరిగిందనేది ఏడాది కాలంగా సర్కార్ చేస్తున్న న్యూసెన్స్. దీనికోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి డైలీ సీరియల్ మాదిరిగా ఈ కేసును నడుపుతున్నారు. జగన్ హయాంలో స్కామ్ జరిగిందని నమ్మించడానికి అనేకమంది ముఖ్యనాయకులను, ప్రముఖ వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకున్నా సరే, ఒకరిద్దరిని బెదిరించి తీసుకున్న వాఙ్మూలాల ఆధారంగా ఈ కేసు నడుస్తున్నది. ఈ దర్యాప్తు నిర్వా కాన్ని చూసి పలుమార్లు న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే అసలు ఉద్దేశం వేరు. ఈ కేసు పేరుతో రచించే బేతాళ కథలతో మీడియాను ముంచెత్తుతూ, నిశ్శబ్దంగా నకిలీ మద్యం వ్యాపారం – తయారీ రాష్ట్రమంతటా విస్తరించింది. కేవలం మూడువేల పైచిలుకు మద్యంషాపులు, అవి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మకాలు జరిగే వ్యవస్థ పాతది.
ఇప్పుడు ప్రతి షాపుకూ ఓ బార్ లాంటి భారీ పర్మిట్ రూమ్ నడుస్తూ, అరవైవేల పైచిలుకు బెల్టు షాపుల్లో తాగిస్తున్నప్పుడు గతంతో పోలిస్తే అమ్మకాలు ఎన్ని రెట్లు పెరగాలి? కానీ, ఎక్సైజ్ ఆదా యాన్ని చూస్తే ఏటికేడు సహజంగా పెరగాల్సినంత కూడా పెరగడం లేదు. మరి ఇన్ని పర్మిట్ రూమ్‌లూ, బెల్ట్ షాపుల ద్వారా వస్తున్న రెండు మూడు రెట్ల ఆదాయం ఎక్కడికి పోతు న్నట్టు? ... నకిలీ మద్యం పాలవుతున్నట్టు లెక్క.
ముల్కల చెరువు, ఇబ్రహీంపట్నం కార్ఖానాలు బయట పడకముందే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో ఏపీ సరిహద్దున ఉన్న మేళ్ళచెరువులో ఇటువంటి కార్ఖానా బయట పడింది. దర్యాప్తులో ఈ కార్ఖానాకు జనార్దన్‌రావుకు సంబంధా లున్నాయని వెల్లడైనట్టు విశ్వసనీయ సమాచారం. దుకాణా న్నయితే మూసేశారు కానీ, తెలంగాణ ఎక్సైజ్ సిబ్బంది ఇంకా ముందుకెళ్లి దర్యాప్తు చేయలేదు.
జనార్దన్‌రావు పేరు బయటకు రాకుండా తెలంగాణ అధికార యంత్రాంగాన్ని ప్రభావితం చేయగల స్థితిలో ఉన్న ఆంధ్ర నేతలెవరు?... కనిపెట్టడం ఓ బ్రహ్మవిద్యేం కాదు గదా! రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బంధువైన చంద్రశేఖరనాయుడు ఎక్సైజ్ శాఖలో మాజీ అధికారి. జాయింట్ కమిషనర్‌గా పనిచేసి ఐదేళ్ల కిందనే రిటైరయ్యారు. అధికారికంగా ఆయన్ను ఈ ఫిబ్రవరి నెల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓఎస్‌డీగా నియమించారు.
రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలు, బ్రూవరీ లన్నింటినీ ఆయన అజమాయిషీలోకి తెచ్చారని సమాచారం. అనధికారికంగా అంతకుముందు నుంచే ఆయన ఈ పనుల్ని చక్కబెడుతున్నారని ఆ శాఖలో ఉన్న టాక్. నకిలీ మద్యం తయారీదారులు మందుబాబుల్ని బురిడీ కొట్టించడం కోసం అసలు బ్రాండ్లకు సంబంధించిన ఫ్లేవర్ వచ్చేలా ఎసెన్స్‌ను కొంత కలుపుతున్నారని తెలుస్తున్నది.
ఈ ఎస్సెన్స్ ఆ బ్రాండ్ కంపెనీల వద్ద గానీ, దాన్ని లీజుకు తీసుకున్న డిస్టలరీల వద్దగానీ ఉంటుంది. మరి నకిలీ కార్ఖానాలకు ఎలా చేరుతున్నాయనేది రాజకోట రహస్యమే! ఇప్పుడు జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారంలో కూడా వైసీపీ వాళ్లను ఇరికించడమెలా అనే అంశంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. కొంతమందిని కొంతకాలం మోసం చేయవచ్చు. కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరనే నానుడి ఏమవుతుందో చూద్దాం.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


