బాఫూ గారికి భయభక్తులతో ఉత్తరం రాసి మనవి చేస్తే భక్త సులభుడైన దేవునికి మల్లే టకాలున బొమ్మ గీసి పంపించేవారు. ‘చంద్ర గారూ... బొమ్మ కావాలండీ’ అనంటే తన సిగ్నేచర్ మందహాసంతో ‘అలాగే’ అని, మనకు కావాల్సిన టైము లోపల కన్నా తాను ఇవ్వాల్సిన టైము లోపు ఇచ్చేసేవారు. హైదరాబాద్ పంజగుట్టలో ఆఫీసు పెట్టుకుని ఉండే కరుణాకర్ ధోరణి పూర్తిగా వేరే. కథో, నవలో, సీరియల్ భాగమో ఇప్పుడు ఇస్తే మధ్యాహ్నానికి బొమ్మ రెడీ. వెళ్లి తీసుకోవడమే.
బాలీ గారు, గోపీ గారు, శీలా వీర్రాజు గారు పాత కాపులుగా ఉండి తమ రెగ్యులర్ పద్దుల్లో కొత్త బొమ్మలను జమ చేసుకుంటూ వెళ్లేవారు. ఇక ఆర్టిస్ట్ మోహన్ స్కూలు వేరే. ఈ క్షణమే కుంభవృష్టి కురవనూ వచ్చు... లేదా ఎప్పుడు కురుస్తుందా అని ఎదురు చూసేలా చేయనూ వచ్చు. మోహన్ బొమ్మలు అనూహ్య కటాక్షానికి తార్కాణాలు. ఇడ్లీ కంటే చట్నీ బాగున్నట్టు ఈలోపు మోహన్‌తో కంపెనీయే ఎక్కువ మందికి ఇష్టంగా ఉండేది. కవులకు, రచయితలకు తెలుగునాట రెమ్యూనరేషన్ మీద ఏ కోశానా ఆశ లేదు.
ఎందుకంటే అది ఇవ్వరు. ఇచ్చినా అల్లరి చేసే పిల్లాడికి బెల్లమ్ముక్క పెట్టినట్టే. కాని వారు ఆశించే, ఆనందించే సంగతొకటి ఉంది. తాము రాసిన కవితకో, కథకో మెరుగైన దృశ్యరూపం ఇచ్చే చిత్రాన్ని చూడగలగడం. ఒక ఉత్తమమైన కవి, రచయిత తాను రాసింది పాఠకులకు అర్థమై స్పందన పొందేలోపు తమ రచనలోని అంతరార్థాన్ని ఎక్సె›్టండ్ చేస్తూ చిత్రకారుడు బొమ్మ గీస్తే, ఆ బొమ్మతో రచన అచ్చయితే ఇక ఆ పూటకు భోజనం చేయరు.
అదే వారి సంబరపు విందు. అద్దో అలాంటి చిత్రకారులు గత కాలంలో ఎక్కువ శాతం ఉండేవారు. సాహిత్యం తెలిసి, రేఖలు తెలిసి, సాహితీ రేఖలు గీయగలిగిన వారు. పత్రికలు తెరిచినా, పుస్తకాల ముఖచిత్రాలు చూసినా ఆయా రచనల వైపు పాఠకులను ఆకర్షించేలా ఎంతో మేలిమి చిత్రాలను తీర్చిదిద్దేవారు. సినిమాలకు పోస్టర్ మల్లే రచనలకు వీరి బొమ్మ.
ఆర్థిక ఇబ్బందులుండి, ప్రచురణకు సాంకేతిక సహాయం అంతగా లేని రోజుల్లో కవులూ, రచయితలకు చిత్రకారుల బొమ్మలే పెద్ద ఊరట. ఫలానా చిత్రకారుడు నా కథకు బొమ్మ వేశాడు తెలుసా అని రచయిత గర్వంగా చెప్పుకుంటే, ఫలానా రచయిత కథకు నేను బొమ్మ వేశాను తెలుసా అని చిత్రకారుడు గొప్పగా చెప్పుకునే సందర్భాలు ఉండేవి. పరస్పర ప్రోత్సాహకరంగా తెలుగు సాహిత్యం వర్ధిల్లిన కాలం అది. ఇప్పుడు కవులకు, రచయితలకు పుస్తకాలు ప్రచురించడం అతి సులువు.
పిండి కొద్ది రొట్టె అన్నట్టు డబ్బు కొద్ది కాపీలు ఇచ్చే ‘ప్రింట్ ఆన్ డిమాండ్’ వచ్చాక పూర్తి ఆటే మారిపోయింది. వారానికి పది పుస్తకాలు అచ్చేయ్యే చోట వంద పుస్తకాలు అచ్చవుతున్నాయి. ఒకటీ అరా పబ్లిషర్ల సంఖ్య నుంచి ప్రతి నవ కవీ, యువ రచయితా పబ్లిషర్‌గా మారే సన్నివేశం అరుదెంచింది. తెలుగు పబ్లికేషన్ రంగం ఇంత కళగా ఎప్పుడూ లేదు. కాకుంటే ఒకటే వెలితి. పసిడి రేఖలు విసిరి కనుమరుగైపోయిన ఆ చిత్రకారులు ఎక్కడా? ఉన్న కొద్దిమంది చాలా బిజీ.
డిసెంబర్ నుంచి బుక్ ఫెయిర్‌ల సీజన్. ఎందరో సాహితీకారులు, పబ్లిషర్లు వందల కొలది పుస్తకాలను అచ్చెత్తించే పనిలో ఉన్నారు. అయితే తమ పుస్తకాల్లోని సారాన్ని అర్థం చేసుకుని అర్థవంతమైన బొమ్మ ఇచ్చే చిత్రకారుల కొరతతో బాధ పడుతున్నారు. తోట తరణి అంటారు– సెట్‌ను గీసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు, చేసి చూపే ఆర్ట్ డైరెక్టర్ వేరు అని. కేవలం బొమ్మ వేసే వారికి డిజైన్ పరిమితి... డిజైన్ చేయగలిగే వారికి బొమ్మ పరిమితి... ఈ రెండూ వచ్చిన వారికి సమయ పరిమితి విపరీతంగా ఉంది. దాంతో ఈ సీజన్ అంతా కృత్రిమమైన ఏఐ బొమ్మలతో తెలుగు పుస్తకాలు కిటకిటలాడబోతున్నాయి. మల్లెలూ, కాగడాపూలూ ఒకలాగే ఉన్నా రెండూ ఒకటి కాబోవు.
మంచి రచనకు మేలిమి చిత్రకారుడి కుంచెపోటు తెచ్చే బలం కావాలి. సముద్రం ఉన్న చోట లైట్‌హౌస్ వెలగాలి. నేడు మన వద్ద లిటరేచర్ ఫెస్టివల్స్, యూత్ ఫెస్టివల్స్ బాగా జరుగుతున్నాయి. కాని జరగాల్సింది ‘ఇలస్ట్రేటర్స్ ఫెస్టివల్’. కొత్తతరం రేఖాచిత్రకారుల కోసం ఏం చేయవచ్చో ఆలోచించాలి. బాపూ రమణీయం వలే తెలుగు రాత, తెలుగు రేఖ జమిలిగా వర్ధిల్లాలి.


