అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!  | Sakshi Editorial On Governance Failures Of Chandrababu Government | Sakshi
Sakshi News home page

అటు విధ్వంసం... ఇటు విషప్రచారం!

Nov 23 2025 12:27 AM | Updated on Nov 23 2025 12:27 AM

Sakshi Editorial On Governance Failures Of Chandrababu Government

జనతంత్రం

చంద్రబాబు పెంపుడు మీడియా అవాకుల గురించీ, ఆయన ఆస్థానంలోని పెయిడ్‌ చిలుకల చెవాకుల గురించీ తెలుగు నాట తెలియనివారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాల పుట్ట పగులుతున్నకొద్దీ... యెల్లో మీడియా దురద రోగం మరింత ముదిరి వికృతరూపం దాలుస్తున్నది. రాజకీయ రంగుటద్దాలను తొలగించి నిష్పాక్షిక దృష్టితో ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను గమనించండి. ఎటు చూస్తే అటు చీకటి. వికసిత జీవితాల విధ్వంసం. రాష్ట్రానికి జీవనాడి వంటి వ్యవసాయ రంగం కకావికలైన దృశ్యం కనిపిస్తుంది.

అపురూపంగా పెంచుకున్న అరటి తోటల్ని దున్నేస్తున్నారు రైతులు. ఏం చేస్తారు మరి? టన్నుకు పది పన్నెండు వేలన్నా వస్తేనే... పెట్టిన ఖర్చు గిట్టుబాటవుతుంది. వెయ్యి రూపాయల కంటే ధర పలకని దుర్మార్గ పరిస్థితి నేడు దాపురించింది. జగన్‌ హయాంలో ఇరవై నుంచి ముప్ఫై వేలు పలికిన స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఆ రోజుల్లో రాయలసీమ నుంచి ఢిల్లీ నగరం దాకా పరుగెత్తిన ప్రత్యేక అరటి రైళ్ల దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసి లాభాలార్జించిన నాటి వైభవం ఇంకా వారి మనోఫలకాల్లో మెరుస్తూనే ఉన్నది. ఇప్పుడెందుకీ దుర్గతి?

పత్తి పంటనూ దున్నేస్తున్నారు. పలనాటి రైతు విలవిల్లాడు తున్నాడు. సర్కారు నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాల జమిలి దాడితో పత్తి రైతులు చిత్తయిపోయారు. అధిక వర్షాలు, తుపాను దెబ్బకు తేమ శాతం పెరిగింది. కొనుగోలుదారులెవరూ ముందుకు రావడం లేదు. కాటన్‌ కార్పొరేషన్‌ కళ్లప్పగించి చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి దూది పువ్వుల దుఃఖం చెవి కెక్కడం లేదు. ఈ సీజన్‌లో అన్ని పంటల పరిస్థితీ అంతే. గిట్టుబాటు ధరల్లేక ఉల్లి పంటను దున్నేసిన వార్తలను చదవాల్సి వచ్చింది. గుండెజారిన ఉల్లి రైతుల ఆత్మహత్యలు కూడా రిపోర్టయ్యాయి.

టమాటా రైతుల కన్నీటి పాట ఈ యేడు కూడా కర్నూలు జిల్లా నుంచి వినపడుతూనే ఉన్నది. ధరలు పతనమై మామిడి, చీనీ రైతులు కష్టాల పాలయ్యారు. జగన్‌ హయాంలో అమలు చేసిన పంటల బీమా పథకాన్ని కూటమి సర్కార్‌ ఎగరగొట్టింది. ప్రకృతి దయాదాక్షిణ్యాలకు వ్యవసాయరంగాన్ని వదిలేసింది. ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్‌లో సర్కార్‌ జోక్యం వంటి మాటలే ఇప్పుడు వినిపించడం లేదు. తుపానుతో దెబ్బతిన్న వరి రైతుల బాధ అరణ్య రోదన. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేది లేదు. రంగుమారిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నదీ లేదు. పెట్టుబడి సాయాన్ని ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరానికి అత్తెసరుతో సరిపెట్టారు.

వ్యవసాయ రంగం పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారయ్యా అనే అనుమానం రాకుండా ఉండదు. ఆయనేం ఖాళీగా లేరు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ తాను వ్యవసాయరంగం గురించి ఆలోచనలు చేస్తూనే ఉన్నానని కడప జిల్లాలో రైతులతో జరిపిన ముఖా ముఖిలో ఆయన చెప్పుకున్నారు. రాష్ట్రంలో వీస్తున్న గాలులు ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో, ఆ గాలుల క్వాలిటీ ఏమిటో, అందులో ఏమేమి తెగుళ్లున్నాయో, అవి ఎంత దూరం ప్రయాణిస్తాయో, ఏ పంటల మీద దాడి చేస్తాయో అనే విషయాన్ని తాను ఎనలైజ్‌ చేస్తున్నట్టు రైతులకు అభయమిచ్చారు.

ఆ తెగుళ్ల సంగతి, పురుగుల సంగతి తెలిస్తే రైతుకు ఏ భయం ఉండదని చెప్పారు. అంతేగాక భూమిలో తేమ ఎంత ఉంది, ఎండ ఎంత తగులుతుంది అనే విషయాలను కూడా ఆయన అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. ఈ రకమైన టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై తాను దృష్టి పెట్టినందువల్ల పంటల బీమా గురించి, మార్కెట్‌ జోక్యం గురించి, పెట్టుబడి సాయం గురించి, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి చర్యల గురించి అడగొద్దనేది ఆయన ఉద్దేశం కాబోలు! రాష్ట్ర రైతాంగంతోపాటు భూవసతి లేని వ్యవసాయ కూలీలను కూడా ప్రభుత్వం కష్టాల కొలిమిలోకి నెట్టింది.

ఈ–కేవైసీలు లేవన్న నెపంతో దాదాపు 16 లక్షల మంది ఉపాధి కూలీల జాబ్‌ కార్డులను రద్దు చేసింది. ఇది ఆ పథకం నిబంధనలకు విరుద్ధం. గ్రామసభలో నిర్ధారణ చేసుకోకుండా జాబ్‌ కార్డులను రద్దు చేయడానికి వీల్లేదు. అయినా ఎడాపెడా రద్దు చేస్తున్నారు. అటు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా, ఇటు ఉపాధి హామీ ఆసరా లభించకుండా ఉద్దేశపూర్వకంగా చేసి ఒక విస్తారమైన చీప్‌ లేబర్‌ మార్కెట్‌ను రైతు–కూలీల్లో సృష్టించే కుతంత్రంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నది.

ప్రైవేటీకరణ ఖడ్గాన్ని యథేచ్ఛగా ప్రయోగిస్తున్న బాబు సర్కార్‌ ఇప్పుడు పేదలకు అసైన్‌ చేసిన 34 లక్షల ఎకరాల భూములపై కూడా కన్నేసింది. పేదల దగ్గర నుంచి ఆ భూముల్ని లాక్కొని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడం కోసం ఆదరాబాదరా ఆర్డినెన్స్‌ను జారీచేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. నిరుపేదలైన అసైనీలకు ఉపయోగపడే విధంగా ఇరవయ్యేళ్ల తర్వాత వారు ఆ భూముల్ని అవసరార్థం అమ్ము కునే విధంగా జగన్‌ ప్రభుత్వం ఫ్రీహోల్డ్‌ ఇచ్చింది. దీనివల్ల తొమ్మిదిన్నర లక్షలమంది అసైనీలకు లబ్ధి జరిగింది. పేద రైతులకు లబ్ధి జరిగితే పెత్తందారీ సర్కార్‌కు నిద్రపట్టదు కదా! కాకుల్ని కొట్టి గద్దల్ని మేపడం దాని పాలసీ. అందుకే అధికారంలోకి వచ్చీరావడంతోనే యెల్లో మీడియా బాకా ద్వారా ఫ్రీహోల్డ్‌ స్కీమ్‌పై దుష్ప్రచారాన్ని ఊదరగొట్టి, ఆ భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టారు.

ప్రభుత్వ రంగంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన మెడికల్‌ కాలేజీలను ‘పీపీపీ’ ముసుగేసి ప్రైవేటీకరించ డానికి ఇప్పటికే బాబు సర్కార్‌ తెగబడింది. దీనిపై జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యాక మాట మార్చి ప్రైవేట్‌ వాళ్లకు అప్పగించినా నియంత్రణ మాత్రం సర్కారుకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, అదెలా సాధ్యమో తెలియదు. ఇక ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన సేవలను కూడా ప్రైవేటీ కరించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ సేవలు ఏవీ ఉచితం కాదని గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పేవారు.

ఇప్పుడు దాన్ని అమల్లోకి తెచ్చే సన్నాహాల్లో ఉన్నారు. ఇక విద్యా, వైద్య రంగాల్లో జగన్‌ సర్కార్‌ తెచ్చిన సంస్కరణలు, వెచ్చించిన నిధులు పేద, మధ్యతరగతి వర్గాల్లో ఎన్నో ఆశలు నింపాయి. వారి ఆశల్ని కూటమి సర్కార్‌ అడియాసలు చేసింది. అక్కడా ప్రైవేటీకరణ మంత్రాన్నే జపిస్తున్నది. నాణ్యమైన విద్యను ఎంత ఖరీదైనా సరే కొనుక్కోవాల్సిందే. అవసరమైన వైద్యం అంగడి సరుకు మాత్రమే! ఇదీ బాబు విధానం.

విశాఖ ఉక్కుపై ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటి? ఇప్పుడు బాబు మాట్లాడుతున్నదేమిటి? విశాఖ ఉక్కు తెల్ల ఏనుగుగా మారిందని ఆయనీ మధ్యనే ఈసడించుకున్నారు. కార్మికులు పనిచేయట్లేదని అభాండాలు వేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లోకి రావడానికి అవసరమైన సొంత గనుల కేటాయింపు విషయాన్ని దాటవేశారు. ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలు మాత్రం మిట్టల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించేందుకు రాయ బారాలు నడుపుతున్నారు. అంతేకాదు విశాఖ పోర్టును దెబ్బ తీసే విధంగా ఆ స్టీల్‌ ఫ్యాక్టరీ సొంత రేవును కూడా నిర్మించుకుంటోంది. మిట్టల్‌ స్టీల్‌ కోసమే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రుల సెంటి మెంట్‌తో ముడిపడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని దెబ్బ తీస్తున్నారని వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మవలసి వస్తున్నది.

ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ‘పీ–4’ అనే పేరుతో ప్రైవేటీకరించే విపరీత చర్యకు కూటమి సర్కార్‌ తెగబడింది. ఈ దేశ సంపదలో పేద ప్రజలు హక్కుదారులు కాదు, కేవలం యాచకులు మాత్రమేననేది ఈ ‘పీ–4’ పథకంలో అంతర్లీనంగా ప్రవహించే ఫిలాసఫీ. ఇది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక ఆలోచన. బలహీన వర్గాల మహిళల ఆత్మ గౌరవాన్ని నిల బెట్టడం కోసం వారి పేర్లతో 30 లక్షల ఇళ్ల పట్టాలు కేటాయిం చింది జగన్‌ ప్రభుత్వం. అందులో తొమ్మిది లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించింది.

చివరి దశ నిర్మాణంలో ఉన్న 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి చంద్రబాబు సర్కార్‌ తామే వాటిని నిర్మించినట్టు ప్రచారం చేసుకొని మొన్ననే లబ్ధిదారులకు అప్పగించింది. ఈ పదిహేడు మాసాల పాలనలో ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వకుండా మూడు లక్షల ఇళ్లను  పూర్తిచేయడం నిజంగా ప్రపంచ వింతే! అంతటితో ఆగ లేదు. ఇరవై లక్షల ఇళ్లను ఇవ్వాలనుకుంటున్నామని, అందులో మూడు లక్షలు ఇప్పటికే అప్పగించామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? జగన్‌ సర్కార్‌ భూమిని సేకరించి ప్లాట్లు వేసి, పట్టాలిచ్చి నిర్మాణాలను ప్రారంభించినవి కావా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పదిహేడు మాసాల్లో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇది జాతీయ రికార్డు. ఒకపక్క విద్యా, వైద్య రంగాలతో సహా సమస్తాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజల కిచ్చిన హామీలను ఎగవేస్తున్న సర్కార్‌ ఈ సొమ్మునంతా ఏం చేస్తున్నట్టు? రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు దిగజారాయి. అమ్మకం పన్ను వసూళ్లు తగ్గడమంటే ప్రజల కొనుగోలు శక్తి తగ్గు తున్నట్టు! ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నట్టు! పోలీసింగ్‌పై కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అట్టడుగున 36వ స్థానం ఏపీకి దక్కింది. కారణం తెలిసిందే. పొలిటికల్‌ గవర్నెన్స్‌ మన పోలీసింగ్‌ను పక్కదారి పట్టించింది. ఉద్యోగాల కల్పనలో కూడా ఏపీ అధమ స్థానంలోనే ఉన్నట్టు నివేదికలు వచ్చాయి. ఇవేమీ యెల్లో మీడియాకు కనిపించవు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నదని వారికి తెలుసు. దాని నుంచి చంద్రబాబును రక్షించడానికి ప్రతిపక్ష నేతపై దిగజారుడు విమర్శలకు ఈ మీడియా తెగబడుతున్నది. 2014–19 మధ్య కాలంలో అధికారంలో ఉండి చేసిన అవినీతిపై విచారణ జరిపి పలు ఛార్జిషీట్లు వేశారు. స్కిల్‌ కుంభకోణంలో జైలుకు కూడా ఆయన వెళ్లి వచ్చారు.

ఇప్పుడా కేసుల నుంచి బయటపడేందుకు బాబు సర్కార్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నది. ఈ వ్యవహారం నుంచి కూడా దృష్టి మళ్లించాలి. కనుక జగన్‌ ప్రభుత్వ హయాంలో అవినీతి పేరుతో, ‘సిట్‌’ చెప్పిందన్న సాకుతో యెల్లో మీడియా నిండా అవే వార్తలు. పెట్టుబడులు తరలివస్తున్నాయంటూ పోచికోలు ప్రచారం. అమరావతిలో అంతస్థులు లేస్తున్నాయనే ప్రచారం. ఈ ప్రచార ఆర్భాటాలతో ఎంతకాలం రాష్ట్ర దైన్యస్థితిని దాచి పెట్టగలరు! విశాఖ సదస్సు ద్వారా పది లక్షల కోట్లు వస్తున్నా యని క్రితంసారి ప్రకటించుకున్నారు.

కానీ పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్న నిజాన్ని దాచగలిగారా? ఇంకెంత కాలం జగన్‌ వ్యక్తిత్వ హననంతో సమాచార భ్రష్టత్వానికి పాల్పడగలరు! జగన్‌ హైదరాబాదు కోర్టుకు హాజరైనా తప్పేనా? చాలాకాలం తర్వాత హైదరాబాదుకు వచ్చారు కనుక పెద్దసంఖ్యలో అభిమానులు స్వాగతం పలికారు. యెల్లో మీడియాకు, కూటమి సర్కార్‌కు మింగుడుపడినా, పడక పోయినా జాతీయ స్థాయిలోనే జగన్‌ అతిపెద్ద పొలిటికల్‌ క్రౌడ్‌ పుల్లర్‌. కోర్టు హాజరుపై సైతం యెల్లో టీవీలు మరో వార్త లేకుండా రోజంతా విషాన్ని ఎగజిమ్మాయి.

ఒక ఎల్లో విశ్లేషకు డైతే ఏకంగా హిడ్మా మాదిరిగా జగన్‌ను కూడా ఎన్‌కౌంటర్‌ చేయాలని ఊగిపోయాడు. కొత్తగా చేయడమేమిటి? పదహా రేళ్లుగా ఆయన వ్యక్తిత్వంపై ఎన్‌కౌంటర్లు చేస్తూనే ఉన్నారు కదా! హిడ్మా ప్రజాస్వామ్యాన్ని పరిహసించాడట! రాజ్యాంగాన్ని వ్యతి రేకించాడట! జగన్‌ కూడా అదే పని చేశాడట. అదీ ఆ విశ్లేషకుని రీజనింగ్‌. సరే, హిడ్మా చనిపోతే వందలాది గిరిజన గూడేలు గుండె పగిలేలా ఎందుకు రోదించాయో, దండకారణ్యం కడుపు కోతతో ఎందుకు కుదేలైందో కాలమే సమాధానం చెబుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిలబెట్టి, ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని అణువణువునా నింపుకొని అడు గడుగునా అమలుచేసిన జగన్‌ రాజ్యాంగ వ్యతిరేకా? ఆ రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెల్లా తూట్లు పొడుస్తున్న కూటమి సర్కార్‌ రాజ్యాంగ వ్యతిరేక శక్తా? తేల్చడానికి ఇదేమంత క్లిష్టమైన సమస్య కాదు.

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement