తాడేపల్లి : ఏపీ రాష్ట్రాన్ని కూటమి నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో చంద్రబాబుకు భాగస్వామ్యం ఉండి కూడా ఏపీకి నష్టం చేస్తున్నారని పేర్ని నాని విమర్శించారు. ఈరోజు(శనివారం, నవంబర్ 22వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన పేర్ని నాని.. ‘చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటే రైతులు రోడ్డున పడినట్టే. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరికి అరటి పంటని కూడా అమ్ముకోలేక పోతున్నారు.
పొగాకు, మిర్చి, మామిడి, పత్తి, కొబ్బరి, పామాయిల్, ధాన్యం.. ఇలా ఏ పంటకూ ధరలేదు. రైతులు సర్వనాశనం అవుతున్నా చంద్రబాబుకు పట్టింపు లేదు. జగన్ హయాంలో రైతలు ఎంత గొప్పగా బతికారు? చంద్రబాబు హయాంలో ఎలా ఉన్నారు?, ప్రపంచమంతా వ్యవసాయంలో యంత్రాలు వాడుతున్నారుఇక చంద్రబాబు కొత్తగా నేర్పించేదేంటి?, ఈ 20 నెలల్లో ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నైనా తెచ్చారా?, చంద్రబాబు వాడే హెలికాప్టర్లు, విమానాలకు వెంటనే డబ్బులిస్తారు. కానీ రైతులకు మాత్రం ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వటం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతుల ధాన్యాన్ని రానివ్వటం లేదు. రైతులు కాలర్ ఎగరేయటం కాదు, కనీసం ఒంటి మీద చొక్కా వేసుకునే పరిస్థితి కూడా లేదు.
పోలీసులు, టీడీపీ గూండాలు లేకుండా ఎమ్మెల్యేలు రైతుల దగ్గరకు వెళ్లే దమ్ముందా?, 85 లక్షల మంది రైతుల్లో ఎంతమందికి క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు?, తుపానులు, వరదల వలన నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వందల ఎకరాల భూములను మాత్రం ఇష్టం వచ్చి వారికి దోచి పెట్టే పనిలో ఉన్నారు. దళితులు, పేద రైతుల ఎసైన్డ్ భూములను సైతం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
రైతులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టారు. ధరల స్థిరీకరణ నిధితో పంటలు కొంటామని చెప్పి ఒక్క గింజైనా కొన్నారా?, దళ్వాకు సాగు నీరు అందించాలి. ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలి. మోంథా తుపానుతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి. ప్రధానిని ఎన్నిసార్లు కలిసినా రైతులకు మేలు చేయమని ఎందుకు అడగటం లేదు?, లేఖల పేరుతో డ్రామాలు ఎందుకు?, ఇరిగేషన్ లో ఓనమాలు తెలియని వ్యక్తి రామానాయుడు. బుడమేరు వరదలతో వందలమందిని చనిపోయినా పట్టించుకోని వ్యక్తి. అలాంటి వారు కూడా జగన్ గురించి విమర్శలు చేస్తారా?, కేంద్ర జలసంఘాన్ని ఏనాడైనా కలిసి రాష్ట్రానికి ఏమైనా మేలు చేశారా?, జగన్ తప్పులు చేస్తే ఈ 20 నెలల్లో ఎందుకు సరి చేయలేదు?’ అని ప్రశ్నించారు.


