సాక్షి, సత్యసాయి జిల్లా, సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా సమాధిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు సత్యసాయి బాబా జతజయంతి వేడుకల్లో పాల్గొనడానికి సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వెళ్లారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్రపతికి ప్రత్యేక స్వాగతం పలికారు. బాబా శతజయంతి వేడుకల్లో రాష్ట్రపతి మాట్లాడుతూ" సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం నా అదృష్టం. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారు. బాబా సందేశంతో కోట్లాదిమంది భక్తులు మానవ సేవ చేస్తున్నారు. సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందుతున్నాయి. ఈ ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని ద్రౌపదీ ముర్ము అన్నారు.


