నెల్లూరి శేషగిరమ్మ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డాక్టర్లు నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పబ్లిక్ సర్వెంట్లుగా నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని పేర్కొంది. వివరాల్లోకి వెళితే రాయపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల శేషగిరమ్మకు చెందిన భూమిని సీఆర్‌డీఏ భూసేకరణలో తీసుకోగా.. ఆమెకు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న మనుమరాలు శ్యామలకు జీవనోపాధి లేకుండా పోయింది. దీంతో ఇద్దరూ కారుణ్య మరణం కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ప్రభుత్వ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు శ్యామలకు ఎంత మేర మానసిక వైకల్యం ఉందో తేల్చాలని గతంలో వైద్యశాఖను ఆదేశించారు.
శుక్రవారం విచారణలో శ్యామలకు 95 శాతం మానసిక వైకల్యం ఉందని సంబంధిత అధికారి నివేదించారు. అయితే, శారీరక వైకల్యం పరిస్థితి పరీక్షించలేదని చెప్పడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్యామల ఇంటికి నిపుణులను పంపి పూర్తి పరీక్షలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేశారు. కాగా, ఈ వ్యాజ్యంలో సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది సింగమనేని ప్రణతి స్పందిస్తూ.. శేషగిరమ్మ, శ్యామల ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, అక్కడి నిర్మాణాల విలువను అధికారులు రూ.6 లక్షలుగా అంచనా వేశారని, ఈ మొత్తానికి మరో రూ.6 లక్షలు కలిపి మొత్తం రూ.12 లక్షలు వారికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
వారిద్దరిని అక్కడి నుంచి మరోచోటుకు తరలించిన పక్షంలో వారికి అక్కడ 5 సెంట్ల భూమిని కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించామన్నారు. ఈ వ్యాజ్యంలో న్యాయమూర్తి గతంలో స్వయంగా తన కారు డ్రైవర్‌ను ఇచ్చి అడ్వకేట్ కమిషనర్‌ను బాధితుల ఇంటికి పంపి వారి వివరాలు తెలుసుకున్న సంగతి తెలిసిందే.


