తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్సీ) గ్రూప్–2 పోస్టులకు 2015–16లో చేసిన ఎంపికలు రద్దయ్యాయి. తప్పుడు మూల్యాంకనంతో చేసిన ఎంపికలు చెల్లవని మంగళవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కొందరికి మోదం, మరికొందరికి ఖేదం మిగిల్చింది. జీవితంలో నిరుద్యోగ పర్వం సంక్లిష్టమైనది. ఎవరో కొందరు అదృష్టవంతులకు తప్ప దాన్నుంచి తప్పించుకోవటం సులభమేం కాదు. ఎలాగోలా దాటామనుకున్నంతలోనే, ఉద్యోగం వచ్చిందని సంబరపడేలోగానే అవకతవకలో, అవినీతో బయటపడి నియామకాలు రద్దుకావటం ఇటీవలి ధోరణి.
పశ్చిమ బెంగాల్‌లో 2016లో పాఠశాల సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుంభకోణం చోటుచేసుకోవటంతో దాదాపు 26,000 మంది టీచర్ల నియామకాలు రద్దయ్యాయి. తొమ్మిదేళ్లపాటు ఉపాధ్యాయులుగా పనిచేసినవారు తిరిగి నిరుద్యోగులు కావటం ఎంత వైపరీత్యం! తప్పు చేసిన వారిని శిక్షించాలి తప్ప తమనెలా ఇళ్లకు పంపుతారని కొందరు చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే సక్రమంగా ఎంపికైనవారు కొత్త ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకూ కొనసాగవచ్చని వెసులుబాటిచ్చింది.
అంటే అందరికందరూ నిరుద్యో గులై మళ్లీ తమ సత్తా చాటుకోవాలి. తెలంగాణ హైకోర్టు తీర్పు కొంతమేర నయం. గ్రూప్–2 పరీక్ష రద్దు కాలేదు. పునర్‌మూల్యాంకనం మాత్రమే జరుపుతారు. అయితే ఇన్నాళ్లూ ఉద్యోగస్తులుగా ఉన్నవారికి మళ్లీ ఫలితాలు వెలువడేవరకూ ఏం జరుగు తుందోనన్న గుబులు వెన్నాడుతుంది. అటు అప్పట్లో అవకాశాలు చేజారిన వారిలో ఆశలు చిగురిస్తాయి. నియామక బాధ్యతలు చూసే సంస్థలు అత్యంత జాగరూకతతో మెలగకపోతే, నిబంధనలను పాటించకపోతే యువతకు ఇలాంటి కష్టాలు తప్పవు.
1,032 పోస్టులకు 2016 నవంబర్‌లో జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం నియమించిన సాంకేతిక కమిటీ 2017లో సిఫార్సులు చేసింది. వాటిని శ్రద్ధగా అమలు చేస్తే వివాదమే తలెత్తేది కాదు. ఆ విషయంలో మొదట సింగిల్ జడ్జి బెంచ్, అటుతర్వాత ద్విసభ్య ధర్మాసనం తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా జరగటం వల్లే పునర్‌మూల్యాంకనం చేయాలని జస్టిస్ భీమపాక నగేశ్ ధర్మాసనం ఆదేశించాల్సి వచ్చింది.
శ్రద్ధగా చదువుకుని పట్టభద్రులైనా ఉద్యోగ నియామకాలకు నిర్వహించే పరీక్షల్లో సైతం కృతార్థులైతే తప్ప నిరుద్యోగ పర్వాన్ని దాటడం అసాధ్యం. ఇందుకోసం అమ్మానాన్నల్ని వదిలి, నగరాల్లో ఉండే కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. స్థోమతకు మించి వేలాది రూపాయలు వెచ్చించి, తినీ తినకా రాత్రింబగళ్లు కష్టపడతారు. తీరా ఆ పరీక్షలు లాటరీ లాంటివి. శ్రద్ధపెట్టి చదివిన అంశాలు రాకపోవచ్చు. అంత ముఖ్యం కాదనుకున్నవి పరీక్ష పత్రంలో ప్రత్యక్షమై సవాలు చేస్తాయి. వీటికి నియామక సంస్థల నిర్లక్ష్యం తోడైతే చెప్పేదేముంది? ఇస్తున్న ప్రశ్నపత్రం, దానికి జోడించాల్సిన ఓఎంఆర్ షీట్‌లపై నిర్వాహకులకే అవగాహన కొరవడితే అభ్యర్థులకూ, ఇన్విజిలేటర్లకూ ఏం చెబుతారు?
అప్పటికప్పుడు పరీక్ష హాల్‌లో ఏదో ఒకటి నిర్ణయించి అమలు చేయించటం వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? అభ్యర్థి వ్యక్తిగత వివరాల విషయంలో చిన్న చిన్న పొరపాట్లుంటే మన్నించవచ్చని, పార్ట్ట్–బిలోని ప్రశ్నలకు సంబంధించి జవాబులకు వైట్‌నర్ వాడినా, తుడిచే ప్రయత్నంచేసినా మూల్యాంకనం చేయొద్దని కమిటీ చేసిన సిఫార్సునే పాటించాలని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం చెప్పినా బేఖాతరు చేయటం సరైందేనా? తమ ఇష్టానుసారం మూల్యాంకనం కానిచ్చి, నియామకాలు పూర్తి చేయటం సమస్యాత్మకమవుతుందని, అర్హులైనవారికి అన్యాయం జరుగుతుందని కమిషన్‌కు తెలియదా?
నాలుగైదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్నవారు కమిషన్ నిర్వాకం వల్ల నియా మకాలు రద్దయి, అయోమయంలో పడ్డారు. దిద్దుబాట్లకూ, వైట్‌నర్ వినియోగానికీ, డబుల్ బబ్లింగ్‌కూ పాల్పడినవారూ మళ్లీ పరీక్షల సాగరంలో ఈదక తప్పదు. మొదటే అన్నీ సక్రమంగా పాటించి మూల్యాంకనం పూర్తిచేసి ఫలితాలు ప్రకటించివుంటే ఇంతమంది నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయేవారు కాదు. కమిషన్‌లో జవాబుదారీ తనం కొరవడటం వేలాది మందికి శాపం.


