కాస్త ఆలస్యం కావొచ్చు గానీ... పుష్కలంగా డబ్బూ, కండబలం ఉన్నవాడు ఎన్ని నేరాలు చేసినా మర్యాదస్తుడిగా మారడం కష్టమేం కాదని సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు బుధవారం అమెరికాలో లభించిన స్వాగత సత్కారాలు చూస్తే తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం ఆయన అంతర్జాతీయంగా అంటరానివాడు. సల్మాన్‌ను ఆహ్వానించటానికి అమెరికా జంకింది. సౌదీలో జరిగే పెట్టుబడుల సదస్సును పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి. కానీ ఇప్పుడంతా మారింది.
సల్మాన్‌కు 21 శతఘ్నుల వందనం, అశ్వారూఢులైన నావికాదళ పటాలం మేళతాళాలు, యుద్ధ విమానాల పరేడ్... ఒకటేమిటి ఆయన రాకే పెద్ద వేడుకన్నట్టు అధికార వ్యవస్థ సమస్తం పులకించిపోయింది. అమెరికాలో సల్మాన్ షాపింగ్ తక్కువేం లేదు మరి. దొంగచాటుగా వెళ్లి శత్రు స్థావరంపై దాడిచేయగలిగిన ఎఫ్–35 యుద్ధ విమానాలు, అణుశక్తి సాంకేతికత, చిప్‌లు, అరుదైన ఖనిజాల వేటలో సహకారం వగైరాలన్నీ అందులో ఉన్నాయి. వీటి విలువ అక్షరాలా లక్ష కోట్ల డాలర్లు. అదిగాక ట్రంప్ కుటుంబానికి గల్ఫ్ దేశాల్లో వందల కోట్ల డాలర్ల విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో అండదండలందించేందుకు సౌదీ ఇప్పటికే అంగీకరించింది.
వీటన్నిటి పర్యవసానంగానే ఈ మర్యాదలు! నిజానికి ఆయనతో మళ్లీ సాన్నిహిత్యం కావాలని మాజీ అధ్యక్షుడు జో బైడెన్ సైతం ప్రయత్నించకపోలేదు. జెడ్డాలో 2022లో పర్యటించినప్పుడు ఆయన్ను ‘భవిష్యత్తు రాజు’గా కీర్తించారు. కానీ ప్రజాభిప్రాయానికి జడిసి అమెరికా ఆహ్వానించటానికి సందేహించారు. బిన్ సల్మాన్ దుష్కృత్యం సాధారణమైనది కాదు. రాజ కుటుంబానికి సన్నిహితు డిగా, ‘వాషింగ్టన్ పోస్ట్’ కాలమిస్టుగా ఉన్న జమాల్ ఖషోగ్గీ తనపై తరచు చేసే విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. సల్మాన్ బతకనీయడని తెలిసి ఖషోగ్గీ అమెరికా వెళ్లి పోయారు. తన ప్రియురాల్ని పెళ్లాడటానికి అమెరికాలో దాఖలు చేయాల్సిన పత్రాల కోసం సౌదీ వెళ్లాల్సివున్నా, ముప్పు తప్పదన్న ఉద్దేశంతో టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ కాన్సులేట్‌కు వెళ్లారు. తీరా సౌదీ నుంచి వచ్చిన 15 మంది హంతక ముఠా అంతకుముందే అక్కడ మాటువేసి ఆయన్ను మట్టుబెట్టింది.
మామూలుగా కాదు... మనిషిని హతమార్చి, ముక్కలుగా కోసి ఎముకలన్నీ యాసిడ్‌లో కరిగిపోయేలా చేశారు. సల్మాన్ ఆదేశాలతోనే ఆ దారుణానికి ఒడిగట్టారని అప్పట్లోనే అమెరికా గూఢచార సంస్థ సీఐఏ తేల్చింది. కాన్సులేట్ వద్దగల సీసీ కెమెరాల్లో ఖషోగ్గీకి ముందే 15 మంది సభ్యులు లోపలికెళ్లటం, కొన్ని గంటల తర్వాత వారంతా నిష్క్రమించటం రికార్డయింది. అంత ర్జాతీయ పాత్రికేయుల్లో ప్రతిష్ఠగల ఖషోగ్గీ హత్య అమెరికా, పాశ్చాత్య దేశాల ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. అందుకే తన తొలి ఏలుబడిలో సల్మాన్‌ను ట్రంప్ దూరం పెట్టారు. హత్యలో ఆయన ప్రమేయం రుజువైందని వ్యాఖ్యానించారు.
కానీ ఇన్నేళ్లు గడిచాక ట్రంప్ తీరు మారింది. ‘మీపై సీఐఏ నివేదిక గురించి ఏమంటార’ని ఏబీసీ చానెల్ మహిళా ప్రతినిధి ఒకరు సల్మాన్‌ను అడిగేసరికి ట్రంప్ మండి పడ్డారు. ‘అదంతా ఏం లేదు... ఖషోగ్గీ వివాదాస్పదుడు. ఈ ప్రశ్న వేసి అతిథిని అవమానిస్తావా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏబీసీ ‘ఫేక్ న్యూస్’ అంటూ దూషించారు. ఆయనతో పోలిస్తే సల్మాన్ నాగరికంగా మాట్లాడారు. తన ప్రమేయం లేదని వివరించారు. నిజానికి సౌదీ పెట్టుబడుల రాక అంత సులభం కాదు. ఇప్పటికే ఎఫ్–35లను వినియోగిస్తున్న ఇజ్రాయెల్ అభ్యంతరాలను కాదని సౌదీకి ఇవ్వటం అసాధ్యం. పైగా ఆ విమానాల కోసం 20 దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నా అమెరికన్ కాంగ్రెస్ వాటిని ఖరారు చేయలేదు. అణుశక్తి సాంకేతికత కూడా అంతే. సౌదీకి ఎఫ్–35లిస్తే వాటి సాంకేతికత చైనాకు చేరే ప్రమాదం ఉన్నదని ఇటీవలే అమెరికా రక్షణ గూఢచార సంస్థ హెచ్చరించింది.
ఇన్ని అవరోధాలున్న ఒప్పందాల ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చిపడతాయని ట్రంప్ జనాన్ని మభ్యపెడుతున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదవుతున్నా ట్రంప్ తాను ఇంకా ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాననుకుంటున్నారు. దేశాల మధ్య సంబంధాలకు లాభాలు, లోపాయికారీ ప్రయోజనాలే తప్ప విలువలు ఎవరికీ అక్కర్లేదని వర్తమాన ప్రపంచంలో కనబడుతూనే ఉంది. సల్మాన్ అమెరికా పర్యటన దాన్నే మరోసారి రుజువు చేసింది.


