అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తన మనోభీష్టాన్ని నెరవేర్చుకున్నారు. గాజాలో ‘శాంతి నెలకొల్పడమే’ లక్ష్యంగా 19 సభ్యదేశాలతో ‘శాంతిమండలి’ ఏర్పాటై నట్టు గురువారం ప్రకటించారు. అర్జెంటీనా మొదలుకొని వియత్నాం, పాకిస్తాన్ వరకూ పోటీ పడి ఇందులో సభ్యత్వం తీసుకోగా, ఈ అర్థరహిత విన్యాసానికి మన దేశందూరంగా ఉండి మంచి పని చేసింది.
అమెరికా చిరకాల సన్నిహిత దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, స్లొవేనియాలు ఇందులో చేరబోమని ప్రకటిస్తే, మనతోపాటు రష్యా, చైనా, జర్మనీ, యూరోపియన్ యూనియన్(ఈయూ), సింగపూర్ వగైరాలు తటస్థంగా ఉండి పోయాయి. అమెరికా ప్రత్యక్ష, పరోక్ష సహాయ సహకారాలతో రెండేళ్ల పాటు గాజాలో నరమేధం సాగించిన ఇజ్రాయెల్ సైతం ‘తగుదునమ్మా’ అంటూఇందులో చేరటం కొసమెరుపు. ‘నాకు నోబెల్ శాంతి బహుమతి రాలేదు గనుక, ఇకపై శాంతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని ప్రకటించిన ట్రంప్, వారం తిరిగేసరికల్లా అంత ర్జాతీయ శాంతిదూత అవతారం ఎత్తడం ఒక వైచిత్రి.
భద్రతామండలి తన 70 ఏళ్ల చరిత్రకు కళంకం తెచ్చుకునే విధంగా గత నవంబర్‌లో గాజా శాంతికి అగ్రరాజ్యాలు చొరవచూపాలని కోరుతూ ఆమోదించిన తీర్మానాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్ ఈ చర్యకు సాహసించారు. రష్యా, చైనాలు వీటో చేసివుంటే ఆ తీర్మానానికి ఆమోదముద్ర పడేదికాదు. కానీ గైర్హాజరుతో సరిపెట్టి ఈ వైపరీత్యానికి వారూ తోడ్పడ్డారు. దురాక్రమణలు, నరమేధాలు, ఊచకోతలు, సైనిక కుట్రలు తదితరాలను ఎదుర్కొనటానికి అంతర్జాతీయంగా ఆమోదించిన అనేక చట్టాలున్నాయి.
వాటిల్లో ఏ చట్టాలు విఫలమైనాయని, ఎలాంటి ప్రయత్నాలు చేసిందని నవంబర్ తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందో భద్రతామండలి చెప్పాలి. గాజాలో అకారణంగా, అన్యాయంగా వేలాదిమందిని హతమారుస్తుంటే, విధ్వంసకాండను కొనసాగిస్తుంటేకంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా, ఆ సంస్థ పక్షాన జరిగిన యత్నాలేమీ లేవు. కానీ అకృత్యాలకు పాల్పడినవారికే దాన్ని ఉద్ధరించేందుకు లైసెన్సునిచ్చింది. ఈ‘శాంతిమండలి’ అమెరికా కోసం కాదు... ఏకంగా ప్రపంచ ఉద్ధరణకేనని దావోస్ లోట్రంప్ ఘనంగా ప్రకటించుకున్నారు. గాజాలో శాంతి నెలకొల్పగానే అది ప్రపంచంలోని ఇతర ఘర్షణలపై దృష్టిసారిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు.
ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి ఎంతగా విఫలమైనా, వాటికి ఉజ్జ్వలమైన చరిత్ర ఉంది. రెండో ప్రపంచయుద్ధం మానవాళికి తెచ్చిపెట్టిన లాంటి ఉత్పాతం భవిష్యత్తులో ఎన్నడూ సంభవించనీయబోమని వాగ్దానం చేస్తూ అవి ఆవిర్భవించాయి. కానీ ఇప్పుడు పుట్టుకొచ్చిన ‘శాంతిమండలి’ ట్రంప్ అల్లుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి జేర్డ్ కుష్నెర్ మానసపుత్రిక. 3,000 కోట్ల డాలర్ల వ్యయంతో గాజా సాగరతీరాన కళ్లు చెదిరే భవంతులు, రిక్రియేషన్ క్లబ్‌లు, క్యాసినోలు నిర్మించాలని ఆయనగారి తపన.
తరతరాలుగా పేదరికంలో మగ్గిన పాలస్తీనియన్లు ఈ అభివృద్ధి చూసి మూర్ఛపోతారని ట్రంప్ చెబుతున్నారు. శాంతిమండలిలో చేరిన నెతన్యాహూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో యుద్ధనేరారోపణలు ఎదుర్కొంటున్నారు. స్విట్జర్లాండ్‌లో అడుగుపెడితే అరెస్టవుతానని తెలిసి ఈ సంబరానికి దూరంగా ఉండిపోయారు. నిర్మానుష్యమైన తూర్పు జెరూసలేంలోని ఐక్యరాజ్యసమితి సహాయసంస్థ భవనాన్ని బుల్‌డోజర్లతో నేలమట్టం చేయించిన మర్నాడే ఆయన ‘శాంతిమండలి’లో చేరటం గమనార్హం.
ఇంతవరకూ ట్రంప్‌కు అంటిన మరకలు ఇకపై శాంతిమండలి సభ్యులకూ తప్పవు. వెనిజులాపై సైనిక దాడి చేసి ఆ దేశాధ్యక్షుణ్ణి అపహరించటం, అక్కడి ముడిచమురుపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవటం, గ్రీన్‌ల్యాండ్‌ను కాజేయాలని ఆత్రపడటం, మాట వినని దేశాలపై భారీ సుంకాలు విధించటం, ప్రపంచం నలుమూలలా సైనిక స్థావరాల ఏర్పాటు యత్నాలు వంటి ట్రంప్ అనాలోచిత చర్యలకూ, ఆయన బెదిరింపు ధోరణు లకూ ఇకపై ఈ మండలి సైతం సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సమితికి సంబంధించిన కర్తవ్యాలు శాంతిమండలి స్వీకరిస్తుందని ట్రంప్ చెప్పటంతోపాటు భవిష్యత్తులో సమితికి కాలం చెల్లుతుందనటాన్ని గమనిస్తే ఇదంతా చివరకు ఎటుపోతుందో... ఏమవు తుందో సులభంగానే గ్రహించవచ్చు.


