నిర్ణయాత్మకంగా వ్యవహరించలేని సదస్సులు చివరాఖరికి నిరర్థకంగా మిగులుతాయి. బ్రెజిల్‌లోని బెలేమ్‌లో శనివారం ముగిసిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్)–30 ముచ్చటదే. ఐక్యరాజ్యసమితి ఛత్రఛాయలో ఏటా జరిగే కాప్ సదస్సులు ఎప్పుడూ పెద్దగా ఒరగబెట్టింది లేదు. 2015 నాటి ప్యారిస్ ఒడంబడికలో అంగీకరించిన లక్ష్యాలను ఏ దేశం ఏ మేరకు నెరవేర్చిందో చూసి, ఆ విషయంలో చేయాల్సిందేమిటో నిర్దేశించటం దీని ఉద్దేశం. బెలేమ్‌లో ఈసారి అన్ని దేశాల నుంచీ ఆ లక్ష్యాల సాధనకు అవలంబించ బోయే కార్యాచరణేమిటో తెలుసుకోవటమే ధ్యేయమన్నట్టు చెప్పారు. తీరా సాధించింది స్వల్పమే.
వాతావరణ మార్పులు, పర్యావరణం అంటేనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కంపరం. ప్యారిస్ ఒడంబడిక నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన ముందే ప్రకటించారు గనుక ఆ దేశం నుంచి ఆశించటానికేం లేదు. ప్రపంచ కాలుష్య కారక దేశాల్లో అగ్రభాగాన ఉన్న అమెరికా ఎగవేత ధోరణి సౌదీ అరేబియా వంటి చమురు ఉత్పత్తి దేశాలకు ధైర్యాన్నిచ్చింది. ఇదే అదనని చైనా మందకొడిగా మిగిలిపోయింది. పాశ్చాత్య దేశాల పాత్ర అంతంత మాత్రం. శిలాజ ఇంధనాల వినియోగాన్ని అంచెలంచెలుగా తగ్గించటానికుద్దేశించిన మార్గనిర్దేశనాన్ని కాప్ ప్రకటించాల్సి ఉండగా చమురు దేశాలు, రష్యా, భారత్ తదితర దేశాలు ఒత్తిళ్లు తెచ్చి దాన్ని వమ్ముచేశాయి.
భూగోళం వేడెక్కడానికి దారితీసే కారణాల్లో ప్రధానమైన శిలాజ ఇంధన వాడకంపైనే ఏమీ సాధించలేని స్థితిలో ఐక్యరాజ్యసమితి పరిధి వెలుపల వాటి తగ్గింపు కృషి కొనసాగుతుందనీ, ఇందుకు కొలంబియా, మరో 90 దేశాలూ సమష్టిగా ప్రణాళిక రచనకు పూనుకుంటా యనీ బ్రెజిల్ ప్రతినిధి ప్రకటించారు. వచ్చే ఏప్రిల్‌లో జరిగే ‘సమ్మతి కూటమి’ దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ విషయంలో ప్రగతి సాధిస్తుందంటున్నారు. బెలేమ్ సదస్సు గురించి చెప్పుకోదగ్గదల్లా వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనే దేశాలకు చేసే ఆర్థిక సాయాన్ని మూడు రెట్లు పెంచుతామని సంపన్న దేశాలిచ్చిన హామీ మాత్రమే!
అందువల్ల ఏటా 12,000 కోట్ల డాలర్లు సమకూరుతాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది 30,000 కోట్ల డాలర్లకు పెంచితే తప్ప ఏ మూలకూ చాలదని పర్యావరణ సంస్థలంటున్నాయి. అభివృద్ధి పేరుతో, ప్రగతి పేరుతో సంపన్న దేశాలు అనుసరించే విచ్చలవిడి పోకడల వల్ల కర్బన ఉద్గారాలు వ్యాపించి, వాతావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. సముద్ర మట్టాలు పెరిగి, లేదా కార్చిచ్చులు వ్యాపించి జనావాసాలు నాశనమవుతున్నాయి.
పునరావాసం కల్పించటానికి అవసరమైన నిధులు ఆ పేద దేశాల వద్ద లేవు. శిలాజ ఇంధనాల వాడకాన్ని ఆపడం మాట అటుంచి, తగ్గించటానికి కూడా సంపన్న దేశాలు ముందుకు రావటం లేదు. కాప్–30 సదస్సును బ్రెజిల్ అమెజాన్ అటవీప్రాంతం ముంగిట్లో నిర్వహించటంలో ఉద్దేశం అడవుల నిర్మూలన వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పటం కోసమే! 92 దేశాలు దీన్ని సమర్థించాయి. కానీ ఒక్క దేశం కూడా అడవుల నిర్మూలన నివారణకు తమ వంతు ఏం చేస్తామన్నది చెప్పింది లేదు.
వాతావరణ క్షీణత వల్ల మన దేశం సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. సదస్సులో రెండు సంస్థలు సమర్పించిన నివేదికలే ఈ సంగతి చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో వివిధ రాష్ట్రాల్లో ఏటా 0.1 డిగ్రీ సెల్సియస్ నుంచి 0.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆ నివేదికలు వివరించాయి. నిరుడు ఈ పెరుగుదల 0.65 డిగ్రీల సెల్సియస్‌కు చేరిందని తేలింది. మన దేశంలో ఉత్తరాదిన ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో దేశం తీవ్ర వాతావరణ పరిస్థితులు చవిచూసిందని మరో సంస్థ గణాంక సహితంగా తెల్పింది.
వడగాడ్పులు, చలిగాలులు, పిడుగుపాట్లు, పెనుగాలులు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటాలు వగైరాల వల్ల 4,064 మంది మరణించగా, దాదాపు 95 లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది. 99,533 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల్లో కూడా కాప్–30 సదస్సు మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోయిందంటే అది మానవాళి దురదృష్టమనుకోవాలి. కాప్–30 విఫలం కానీయరాదన్న సంకల్పంతో ప్రకటించిన అరకొర చర్యలు తప్ప బెలేమ్ సాధించిందేమీ లేదు.


