కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం పదేళ్ల క్రితం ప్యారిస్ వేదికగా కుదిరిన చరిత్రాత్మక ఒడంబడికను దాదాపు అన్ని దేశాలూ పోటీలు పడి మరీ ఉల్లంఘిస్తున్న తరుణంలో బ్రెజిల్ లోని బెలేమ్ నగరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్–30) సదస్సు సోమవారం ప్రారంభమైంది. ప్యారిస్ ఒడంబడికలో దేశాల వాగ్దానమేమిటో, నెరవేర్చింది ఏ మేర కో చూసి లక్ష్య నిర్దేశం చేయటం కోసం ఏటా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ సదస్సు 10 రోజుల పాటు జరుగుతుంది. కానీ విషాదమేమంటే... పెద్దగా ఫలితం లేకుండానే అవి ముగిసిపోతున్నాయి.
తీసుకున్న అరకొర నిర్ణయాలైనా అమలుపరిచే నాథుడు కనబడడు. అందువల్లే నిరుడు అజర్‌బైజాన్‌లోని బాకూలో కాప్–29 తరువాత పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఈసారి సదస్సుకు అనేక విధాల ప్రాముఖ్యం ఉంది. ఇంతవరకూ ఎక్కువగా యూరప్ లేదా పశ్చిమాసియా ప్రాంత దేశాల్లో ఈ సదస్సులు నిర్వహించటం రివాజు. అందుకు భిన్నంగా దక్షిణ అమెరికా ప్రాంత దేశాన్ని ఎంపిక చేసుకోవటం ఈసారి ప్రత్యేకత.
అది కూడా భూగోళానికి శ్వాసకోశాలుగా పరిగణించే అమెజాన్ అడవుల ముంగిట కొలువుదీరిన నౌకాశ్రయ నగరం బెలేమ్ కావటం గమనించదగ్గది. వాతావరణ మార్పులపై చర్చించటానికి అదైతేనే ప్రతీకాత్మక వేదికవుతుందని నిర్వాహకులు అభిప్రాయపడి ఉండొచ్చు. అత్యంత దారిద్య్రం, వనరుల దుర్వినియోగం కొట్టొచ్చినట్టు కనబడే బెలేమ్‌ను దేశదేశాల నుంచీ వచ్చే ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షిస్తే సుస్థిరాభివృద్ధికి మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకతను అంతర్జాతీయ సమాజం గుర్తిస్తుందని కూడా వారు భావించి ఉండొచ్చు.
ప్రపంచం ఇప్పుడు ప్రమాదకర వాతావరణంలోకి ప్రవేశించింది. పారిశ్రామికీ కరణకు ముందున్న ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 2 డిగ్రీల సెల్సియస్ లోపే పెరుగుదల ఉండేలా... వీలైతే అది 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితమయ్యేలా ప్రయత్నించాలన్నది ప్యారిస్ ఒడంబడిక కృతనిశ్చయం. కానీ 2024కే ఆ 1.5 డిగ్రీల పరిమితి దాటిపోయామని గణాంకాలు చెబుతున్నాయి. పది రోజులపాటు కొనసాగే ఈ సదస్సులో ఏదో అనుకోని అద్భుతం జరిగితే తప్ప ముంచుకురానున్న విపత్తును ఆపటం దుర్లభం. కానీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మాట తప్పడం, సాకులు చెప్పడం అన్ని దేశాలకూ అలవాటైంది.
గత ఏలుబడిలో ప్యారిస్ ఒడంబడిక నుంచి బయటికొచ్చినట్టే ఇప్పుడు కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుకున్నారు. ఇది ఒకరకంగా మేలేనని వివిధ దేశాలు భావిస్తున్నాయి గానీ, ట్రంప్ తన ‘బెదిరింపు దౌత్యం’తో మున్ముందు అందరినీ తన దారికితెచ్చే ప్రయత్నం చేస్తారు. గత నెలలో జరిగిన పరిణామమే ఇందుకు తార్కాణం. రవాణా నౌకల కాలుష్యాన్ని సంపూర్ణంగా అరికట్టేందుకు 100 దేశాల మధ్య అవగాహన కుదిరి, ఒడంబడికపై సంతకాలు కాబోతుండగా ట్రంప్ టీమ్ సైంధవ పాత్ర పోషించింది.
సంతకాలు చేసే దేశాల నావికుల్ని అమెరికా తీరంలో అడుగు పెట్టనీయబోమని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివిధ దేశాలకు స్వయంగా ఫోన్లు చేసి బెదిరించారని ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం. ఇక సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, వీసా బెదిరింపులు షరా మామూలే. దాంతో అది కాస్తా నిలిచిపోయింది. ఇప్పుడు కాప్–30కి ఆ బెడద తప్పదు.
ట్రంప్ వచ్చాక అమెరికాలో హరిత ఇంధన ప్రాజెక్టులు అటకెక్కాయి. వాతావరణ మార్పు పెద్ద బోగస్ అంటూ శిలాజ ఇంధన ఆధారిత ప్రాజెక్టులకు అనుమతులిస్తున్నారు. వాతావరణ మార్పులపై గతంలో పెద్ద మాటలు మాట్లాడిన బిల్ గేట్స్ ప్లేటు ఫిరాయించారు. ‘మరీ అంత ప్రమాదమేమీ లేద’ంటూ నసుగుతున్నారు. యూరొప్ యూనియన్ డిటో. అక్కడ అందరిదీ తలో దోవ అవుతోంది.
కర్బన ఉద్గారాల తగ్గింపులో మన దేశం రికార్డు కూడా ఏమంత మెరుగ్గా లేదు. దక్షిణ అమెరికా, ఆఫ్రికా తీరాల సమీపంలోని వేడి నీటి పగడపు దిబ్బలు కనుమరుగు కావటం ప్రమాద సంకేతమని ఇటీవలే బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చెప్పిన నేపథ్యంలో కాప్–30 చిత్తశుద్ధితో, దృఢంగా వ్యవహరించి నిర్ణయాలు తీసుకుంటేనే భూగోళం పది కాలాలు పచ్చగా ఉండగలదు. లేనట్టయితే ఇక సరిదిద్దుకోవటం సాధ్యపడని ప్రమాదకర స్థితికి చేరుకోవటం ఖాయం.


