ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ సందర్శనకొచ్చేవారికి కనీస రక్షణ చర్యలు తీసుకో వటం ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వానికి చేతగాదని మరోసారి నిరూపణయింది. భక్తులందరూ పవిత్రంగా భావించే కార్తిక ఏకాదశి రోజైన శనివారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెయిలింగ్ ఊడిపడి తొక్కిసలాట జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన తీరు ఆయన ఏలుబడికి అద్దం పడుతోంది.
ఈ విషాద ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. వెనువెంటనే ఘటనాస్థలికొచ్చిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కొన ఊపిరితో ఉన్న కొందరికి సీపీఆర్ చేయటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన చొరవ కారణంగానే అంబులెన్స్‌లు వచ్చి గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించాయి. లేకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేది. రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకొచ్చాక ఇలాంటి దుర్ఘటన జరగటం ఇది మూడోసారి.
ఈ ఏడాది జనవరిలో పుణ్యక్షేత్రమైన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయటంలో చూపిన నిర్లక్ష్యం పర్యవసానంగా తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. మరో 43 మంది గాయ పడ్డారు. శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతిలో ఇటువంటి దారుణం జరగటం అదే ప్రథమం.
అటు తర్వాత మార్చిలో సింహాచల క్షేత్రంలో అక్షయ తృతీయ సందర్భంగా ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవంలో తొక్కిసలాట చోటు చేసుకుని ఏడుగురు చనిపోయారు. 2015లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన కారణంగా, ఆయన సమక్షంలో రాజమహేంద్రవరంలో పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 29 మంది బలయిపోయారు.
అనుకోని దుస్సంఘటనలు జరిగినప్పుడు వెనువెంటనే బాధ్యులెవరో గుర్తించి చర్య తీసుకోవటానికి పాలకులు ఉద్యుక్తులవుతారు. బాబు ఒక్కరు మాత్రం కబురు తెలిసిన వెంటనే సాకుల కోసం వెదుకుతారు. ఇలాంటివి సర్వసాధారణమేనన్న తర్కానికి దిగుతారు. పుష్కరాలు మొదలుకొని తిరుపతి, సింహాచలం తొక్కిసలాటల వరకూ ఆయన బాణీ అదే. ఇప్పుడు కూడా దాన్నే తు.చ. తప్పకుండా పాటించారు.
కాశీబుగ్గ ఆలయం ప్రైవేటు వ్యక్తిదట. ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని పోలీసులకు సమాచారం లేదట. ఇంకా నయం... కార్తిక ఏకాదశి రోజున ఆలయాలకు భక్తులొస్తారను కోలేదని అనలేదు! ఇంతకూ తిరుపతి, సింహాచలంలో తొక్కిసలాటలు చోటుచేసుకున్న ప్రాంగణాలు ఎవరి అధీనం లోనివి? చాలాముందుగా తెలిసినా అక్కడ బాబు సర్కారు ఒరగబెట్టిందేమిటి? పోలీసుల సంగతలా ఉంచి అనుకోనిది జరిగితే ముందుకు రికేందుకు అంబులెన్స్‌లూ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలనైనా అందుబాటులో ఉంచగలిగారా? మరి ఎవరిని వంచించటానికి ఈ మాటలు? టీడీపీ వందిమాగధ మీడియా ఆయన్ను మించిపోయింది.
ఫలానా రోజొచ్చే పర్వదినం మళ్లీ జన్మలో రాదని సోషల్ మీడియాలో ఊదరగొట్టేవారు పెరిగి పోవటం వల్లే ఈ దురదృష్టకర సంఘటన జరిగిందట! పర్వదినాలేవో పంచాంగాలే చెబుతాయి. దేవదాయ శాఖ ఆలయమైనా, ప్రైవేటు ఆలయమైనా భక్తులు క్యూ కడతారు. చెప్పినా చెప్పకున్నా ఏర్పాట్లు చేయటం ప్రభుత్వ బాధ్యత.
చంద్రబాబు గుర్తించారో లేదోగానీ, తెలియదు... చెప్పలేదు అనే రోగానికి మూలం మరోచోట ఉంది. ‘నలుగురు కూడిన కాడ నరలోకం యముడుండు’ అని గద్దర్ ఒక పాటలో అన్నట్టు పదిమంది జమయితే పోలీసులు అనుమానంగా చూస్తారు. అది నిరసనైనా, ఉత్సవమైనా, ఊరేగింపైనా వారి స్పందన ఒకేలా ఉంటుంది. అంతమంది గుమిగూడటానికి ముందస్తు అనుమతులున్నాయా అని ఆరా తీస్తారు. తగిన చర్యలు తీసుకుంటారు.
ఇంటెలిజెన్స్ విభాగం నిమగ్నమయ్యేది అలాంటి సమాచార సేకరణ లోనే. మరి బాబు రక్షకభటులేం చేశారు? డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు సహాయచర్యల్లో పాల్గొంటుండగా ప్రత్యక్షమయ్యారు. రాజకీయ కక్ష సాధింపులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేచోట, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలయ్యేచోట ఇంతకన్నా మెరుగ్గా పోలీసులు వ్యవహరిస్తారని ఆశించలేం. ఇప్పటికైనా బాబు తెలివి తెచ్చుకుని సవ్యంగా పాలించటం మొదలెట్టాలి. జనం ప్రాణాలు అరచేత బట్టుకుని ఉత్సవాలకెళ్లే్ల దురవస్థ నుంచి తప్పించాలి.


