గాల్లో తేలుతున్నదో... రోడ్డుపై ఉరకలెత్తుతున్నదో తెలియనంత పెనువేగంతో దూసుకు పోయే ట్రావెల్స్ బస్సు శుక్రవారం వేకువజామున కర్నూలు సమీపాన ప్రమాదంలో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇటీవల ఈ రకం బస్సులు తరచూ ప్రమాదాలకు లోనవుతున్నాయి. పదిరోజుల క్రితం రాజస్థాన్‌లో కూడా ఇలాంటి బస్సే తగలబడి 20 మంది మరణించారు. ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో తాజా ప్రమాదం జరిగిందంటున్నారు.
చూడటానికి భారీగా కనిపిస్తూ మెరిసే అద్దాలతో, సకల హంగులతో, స్లీపర్ కోచ్‌లుగా ఉండే ఈ బస్సులు తక్కువ వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తా యని ఆశిస్తారు. అంత వేగంతో పోవటానికి అవసరమైన ఏర్పాట్లున్నాయో లేదో ఎవరూ గమనించుకోలేరు. ఇవి రోడ్డెక్కింది మొదలుకొని పాదచారుల నుంచి వాహనదారుల వరకూ అందరినీ హడలెత్తిస్తాయి. డిజైన్ రీత్యా చూసినా, బస్సు అంతర్నిర్మాణంఅందంగా కనబడటానికి వాడే మెటీరియల్ గమనించినా అవి ఏమాత్రం సురక్షితం కాదని తెలిసిపోతుంది. సీట్ల మధ్య తక్కువ స్థలం ఉండటంవల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు తప్పుకునే వ్యవధి ఉండదు.
ఇవి ఎక్కువగా రాత్రివేళల్లో వెళ్తుంటాయి కాబట్టి ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటారు. మెలకువ వచ్చి ఏదో జరిగిందనిగుర్తించేలోపే మంటలు చుట్టుముడతాయి. కనీసం పక్కవారిని అప్రమత్తం చేయటం మాట అటుంచి, గమనించినవారు తప్పుకోవటమే అసాధ్యమవుతుంది. గందరగోళం ఏర్పడి తోపులాట చోటుచేసుకుంటుంది. ఇక సురక్షితంగా బయటపడేదెక్కడ? సుదూర ప్రయాణాల్లో డ్రైవర్లకు తగిన విశ్రాంతికి సమయం చిక్కకపోతే, అలసటకు లోనయితే కునుకుతీసే ప్రమాదం ఉంటుంది. రాత్రివేళ ప్రమాదాలకు ఇదొక కారణం.
దానికితోడు బస్సు లోపల సర్వసాధారణంగా బెర్త్‌ల కోసం వాడే ఫైబర్, రెగ్జిన్, తెరల కోసం ఉపయోగించే పాలియెస్టర్, సిల్క్ వగైరాలు మండే స్వభావం ఉండేవి. చిన్న నిప్పురవ్వ చాలు... సెకన్ల వ్యవధిలో భగ్గున మండటానికి! నిప్పంటుకున్నప్పుడు కేబుళ్లు దగ్ధమై ఎమర్జెన్సీ డోర్‌లు సైతం మొరాయిస్తాయి. అదృష్టవశాత్తూ తెరుచుకునే సందర్భా లున్నా కనీసం 8,9 అడుగుల ఎత్తులో స్లీపర్‌లపై ఉన్నవారు వాటివద్దకు చేరుకోవటం అయ్యే పనేనా? అద్దాలైనా అంత సులభంగా బద్దలుకావు. ఇవన్నీ ముప్పును మరింత పెంచేవే. ఈ రకం బస్సుల సంక్లిష్ట నిర్మాణం వల్ల ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు బయటి వారు సాయపడాలన్నా అసాధ్యమే.
రోడ్డు ప్రమాదాలు సహజంగా జరిగేవికాదని, మనుషుల తప్పిదాల వల్లా, నిర్లక్ష్యంవల్లా అవి చోటుచేసుకుంటాయని గతంలో ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన వ్యాపారి మారియో గాబ్రియెల్ అన్నారు. తాజా ప్రమాదం విషయంలో కూడా అది అక్షరాలా నిజం. స్లీపర్ బస్సులు సాధారణంగా ఏసీ సదుపాయంతో ఉంటాయి. సాధా రణ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో అధిక విద్యుత్ అవసరమవుతుంది. ఏసీని కనీసం 24 డిగ్రీల వద్ద ఉంచాలి.
కానీ అంతకన్నా తగ్గిస్తే చల్లదనం పెరగొచ్చుగానీ దానివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. ఆ మేరకు కేబుళ్లపై ఒత్తిడి పెరిగి అవి త్వరగా వేడెక్కుతాయి. కంప్రెసర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి మధ్యమధ్యలో విరామం ఇవ్వకపోతే పనితీరు దెబ్బతింటుంది. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేసు కుంటూ అవసరాన్నిబట్టి మారుస్తుండాలి. లేనట్టయితే షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు వీటిని నిశితంగా గమనిస్తున్నారా?
ప్రమాదానికి లోనయిన బస్సు ఫిట్‌నెస్ బాగానే ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. అందులోని నిజానిజాల సంగతటుంచి అంతటి పెనువేగంతో వెళ్లేందుకు అనువుగా మన రోడ్లు ఉంటున్నాయా? అధిక వేగంతో పోయే వాహనాలను నడిపేవారి సామర్థ్యాన్ని కొలిచేందుకు విడిగా పరీక్షలుంటున్నాయా? ఎంతో చురుగ్గా ఉండేవారు చోదకులుగా ఉంటే క్లిష్ట సమయాల్లో తక్షణం స్పందించగలుగుతారు. లేనట్టయితే పెను ప్రమాదాలకు కారణమవుతారు. అసలు ఈ మాదిరి బస్సులపై రెండు దశాబ్దాల క్రితంనుంచే చైనా, జర్మనీ వంటి దేశాల్లో నిషేధం అమలవుతోంది. మన దేశం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనట్టే ఉంది.


