పోలీసు శాఖలో ఏఎస్‌ఐగా పనిచేస్తున్న తండ్రి
పోలీసు రికార్డుల్లో కొడుకుపై రౌడీషిట్
చిలకలూరిపేట జాతీయ రహదారిపై ప్రమాదం
ఈజీ మనీ కోసం ఐదుగురి ప్రాణాలు బలిగొన్న కుమారుడు
ఏఎస్‌ఐ కుమారుడి పాత్ర ఉండటంతో గోప్యంగా విచారణ
న్యాయం చేయాలని చిలకలూరిపేటకు వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు
సాక్షి, నరసరావుపేట: పెడదారిపడుతున్న కొడుకును మందలించి దారిలో పెట్టాల్సిన తండ్రి తనయుడి మోసాలను చూసీచూడనట్టు వదిలేశాడు. కన్న పేగు మమకారంతో తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికే నమోదైన కేసుల్లో బయటపడేలా చేస్తుండటం ఆ కొడుకు మరింత రెచ్చిపోయేలా చేసింది. ఈ క్రమంలో ఈజీ మనీకి అలవాటుపడిన ఓ ఏఎస్‌ఐ కొడుకు చేసిన నిర్వాకానికి ఏకంగా ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిలకలూరిపేట నేషనల్ హైవే రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ముఠా జాతీయ రహదారిపై వాహనాలు ఆపి నగదు వసూలు చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసు విచారణలో తేలింది.
నకిలీ రవాణాశాఖ అధికారుల పేరుతో...
చిలకలూరిపేట బైపాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఈనెల 4న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. వినుకొండ రూరల్ మండలంలో అయ్యప్పస్వామి భజనకు హాజరుకావడానికి గుంటూరు నుంచి వెళ్తున్న కారు ట్రాక్టర్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాలర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ట్రాలర్‌ను ముందుగా వెళ్తున్న కారులోని వ్యక్తులు ఆపడంతో ప్రమాదం జరిగినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసిన నాదెండ్ల పోలీసులు విచారణ చేపట్టారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ముఠా ట్రాలర్‌ను ఆపినట్టు నిర్ధారించారు.
ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న నరసరావుపేటకు చెందిన ఏఎస్‌ఐ కుమారుడు వెంకట్ నాయుడు, చిన్న తురకపాలేనికి చెందిన ఎస్‌కే బాషా, బాలయ్యనగర్‌కు చెందిన వెంకట్రావ్, నకరికల్లు మండలం నర్సింగపాడుకు చెందిన గోపి, మహేష్ లు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వీరికి పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా నలుగురు తమకేమీ తెలియదని బుకాయించినప్పటికీ, ఒకరు మాత్రం నిజం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. హైవేపై వెళ్తున్న లారీలను రవాణాశాఖ అధికారుల పేరిట ఆపి నగదు వసూలు చేయడం కోసమే ఆపాం అని, అయితే అనుకోని విధంగా ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చినట్టు తెలియవచ్చింది.
పోలీసు దందాలకు నాయకుడు రౌడీషిటర్
ఐదుగురు యువకుల మరణానికి కారణమైన ఏఎస్‌ఐ కుమారుడిపై నరసరావుపేట రూరల్ పోలీసుస్టేషన్‌లో రౌడీషిట్ నమోదై ఉంది. పదుల సంఖ్యలో చీటింగ్, చోరీలు, హత్యాయత్నం వంటి తీవ్రమైన నేరారోపరణలో కేసులు నమోదయ్యాయి. ఇటువంటి రౌడీషిటర్లను తరచూ పోలీసుస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తుండాలి. ఈ పోలీసు కంత్రీ కుమారుడిని ఇటీవల కాలంలో స్టేషన్‌కి పిలిచి కౌన్సెలింగ్ చేపట్టిన దాఖలాలు లేవని రూరల్ పోలీసు సిబ్బంది చెబుతున్నారు. తండ్రికి ఉన్నతాధికారులతో ఉన్న సత్ససంబంధాలతో రౌడీషిటర్ల కౌన్సెలింగ్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా సెట్ చేశారట. గతేడాదిగా సదరు రౌడీషిటర్‌తో పోలీసు ఉన్నతాధికారులు మామూళ్ల వసూళ్లకు ఏజెంట్‌గా నియమించినట్టు తెలుస్తోంది.
నెలవారీ మామూళ్లను ఈ రౌడీషిటరే తండ్రి తరపున వెళ్లి బెదిరించి మరీ వసూళ్లు చేసేవాడని పోలీసు వర్గాలే చెప్పుకొస్తున్నాయి. తమ శాఖలోని కొందరు ఉన్నతాధికారులు అండతో తండ్రీకొడుకులు రెచ్చిపోయారని, అయినా ఏం చేయలేక మిన్నుకుండిపోయామని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా సదరు ఏఎస్‌ఐపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో కోటప్పకొండ వద్ద రూ.40 లక్షలు మోసం చేసిన ఘటనలో తండ్రీకొడుకులను శిక్షించి ఉంటే ఈ సమస్య వచ్చేంది కాదని అంటున్నారు. ఇతని బా«ధితులు నరసరావుపేటలో పదుల సంఖ్యలో ఉన్నా తండ్రి అధికారంతో బా«ధితులు బయటకు రావడానికి భయపడుతున్నారు.


