కడప జిల్లా: మండలంలోని మడూరు గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జి.కుమారి దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో కుమారి విధులు ముగించుకున్నారు. పులివెందుల వచ్చేందుకు తొండూరు సాయిబాబా ఆలయం వద్ద బస్సు కోసం వేచి ఉండగా, బూచుపల్లెకు చెందిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కనిపించాడు.
ఆమె చేయి ఎత్తడంతో తన ద్విచక్రవాహనాన్ని ఆపి ఆమెను ఎక్కించుకుని పులివెందులకు బయలుదేరాడు. మడూరు గ్రామ సమీపంలోకి రాగానే నాలుగు లేన్ల రోడ్డు పనులలో భాగంగా బ్రిడ్జి పనులు జరుగుతున్న ప్రదేశంలో లారీ వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమారి లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు, రెవెన్యూ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ ఘన మద్దిలేటి, రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు.
ఈ విషయాన్ని ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు తెలియజేశారు. మృతురాలు కుమారికి భర్త విశ్వనాథ్(చిన్నా)తోపాటు ఇద్దరు కుమారులు విశ్వనాథ్, నందు, కుమార్తె సిరిచందన ఉన్నారు. కుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, రెవెన్యూ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీడీఓ రామచంద్రుడు, రెవెన్యూ సిబ్బంది కోరారు.


