
భాషలో అదో విచిత్రం. వ్యతిరేక పదాలు పక్కపక్కనే ఉంటాయి, జంటగా సాగుతూ ఉంటాయి; మంచి–చెడు, పాపం–పుణ్యం, కీర్తి–అపకీర్తి; అలాగే, వెలుగు–చీకటి! అసలు జగత్తులో ఉన్నదంతా చీకటే, వెలుగు రాగానే అది మాయమవుతుంది. వెలుగు నిచ్చేది దీపం. ప్రకృతి వెలిగించిన అతిపెద్ద దీపం సూర్యుడు. ఆయన సంచారానికి వెడుతూ వెడుతూ తన కాంతిని నింపి ఆకాశపు నట్టింట ఉంచే చిన్నా, పెద్దా ప్రమిదలే నక్షత్రాలూ, చంద్రుడూ. తెలతెల్లని సూర్యుడు ఉదయించగానే, నల్లని పెనుచీకటులన్నీ కాకుల్లా ఎగిరిపోయాయంటాడు ఓ కవి.
మనిషి జీవితంతో పడుగూ పేకలా అల్లుకుపోయిన ఉపమానం ‘చీకటి వెలుగు’లను మించి మరొకటి లేదు. అందుకే, ‘చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి’ అంటాడొక సినీకవి. ‘దీపాలు బాగుంటాయి, పాపల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు, దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో, పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో’ అంటాడు – కవి తిలక్. దీపోపమానం మహాకవి కాళిదాసుకు ఏకంగా దీపశిఖ అనే బిరుదునే తెచ్చిపెట్టింది. విదర్భ రాకుమారి ఇందుమతీదేవి స్వయంవర సభలో వరమాల పుచ్చుకుని ఒక్కొక్క రాజునే దాటివెడుతున్నప్పుడు అచ్చం దీపశిఖలా ఉందని తన రఘు వంశ కావ్యంలో వర్ణిస్తాడాయన.
ఆమె తనను సమీపించగానే ఆశతో వెలిగిపోయిన రాజుల ముఖాలు, తమను దాటిపోగానే నిరాశతో నల్లబడిపోయాయంటాడు. రఘు మహారాజు కొడుకు అజుడు – ఒక దీపం వెలిగించిన మరో దీపంలా – రూపంలో, శౌర్యంలో, ఔన్నత్యంలో ముమ్మూర్తులా తండ్రి పోలికేనంటాడు. అంటుకున్న అడవి దీపాలతో రాత్రిళ్ళు చీకటిని జయించే తొలిపాఠాలు మనిషికి నేర్పింది కూడా ప్రకృతే. అప్పటినుంచి సంస్కృతీ, నాగరికతల మీదుగా మనిషి వెలుగుల ప్రస్థానం బహుముఖ దీపతోరణాలతో ముందుకు సాగుతూ జీవితాన్ని నిత్య దీపావళిగా మలుస్తూనే ఉంది.
‘ఆరని ఎర్రని దీపంగా, నిరంతర జీవన తాపంగా, తనను తాను కాల్చుకుని భస్మ మయే మోహన శాపం’గా కూడా తిలక్ అభివర్ణించిన దీపం, దేశ కాల మత భేదాలకు అతీతంగా సర్వత్రా మనిషికి దారిదీపమవుతూనే ఉంది. దీపాల వరుసలతో ఇళ్ళు, గుళ్ళు, రహదారులతో సహా సమస్త పరిసరాలనూ సముజ్వలం చేయడం పితృదేవతా హ్వానంలో భాగంగానే మొదలైందంటారు. మెక్సికోతో మొదలుపెట్టి, కంబోడియా, బర్మా, చైనా, జపాన్, ఈజిప్టు, రోమ్ సహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో దివ్వెల పండుగ జరుపుకోవడం పరిపాటిగా వస్తోంది. మన దగ్గర దీపావళి పండుగ మూలాలు అతిప్రాచీన కాలంలోనే ఉన్నాయనీ, ‘ఉల్కాదానం’ పేరిట అది మన పురాణాలకు ఎక్కిందనీ, దీపాలు వెలిగించడంతోపాటు, సూరేకారం వంటివి ఉపయో గించి పేలుళ్లను సృష్టించడం కూడా అప్పటినుంచీ ఉందని అంటున్నవారూ ఉన్నారు.
నింగీనేలా దద్దరిల్లే పెను శబ్దాలతో, ఆకసాన చిత్రవిచిత్ర కాంతులతో రంగుల రంగ వల్లులు తీర్చే బాణాసంచా వాడకం మాత్రం మనకు పదిహేనవ శతాబ్దిలోనే పరిచయ మైందనీ, బహుశా అది చైనా నుంచి వ్యాపించిందనీ, తుపాకీ మందు కనిపెట్టడం దానికి ప్రారంభమనీ అంటున్నారు. ఆ విధంగా తుపాకీ మందుతో జమిలిగా అల్లుకున్న బాణా సంచా రాజులకు యుద్ధ, వినోదాలు రెంటితోనూ అలరిస్తూ వచ్చిందనీ, పోర్చుగీసు వర్తకుల ద్వారా తమకు పరిచయమైన బాణాసంచా ధగధగలను, ఫెళఫెళలను విజయ నగర రాజులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆస్వాదించేవారనీ చరిత్ర.
అయితే, ‘చీకటి వెలుగుల’ మధ్య ఎడం లేకపోవడం భాషావైచిత్రే కాక, ప్రకృతి వైచిత్రి కూడా! పెద్ద ఎత్తున బాణసంచా జోడింపుతో రానురాను దీపావళి వెలుగులు పర్యావరణ, ప్రజారోగ్యపరమైన సమస్యల చీకట్లనూ వెంటబెట్టుకుని వస్తున్నాయి. సమస్య తీవ్రరూపం ధరించడంతో, ఢిల్లీలో బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం విధించిన సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆంక్షలూ, హెచ్చరికలతో ఆ నిషేధాన్ని సడలించింది. కాలుష్యాన్ని తగ్గించే బాణసంచా రకాల వాడకంతోపాటు నిర్దిష్ట సమయాల్లో, నిర్దిష్ట కాల పరిమితుల్లో మాత్రమే బాణసంచా వినియోగించాలని ప్రభుత్వాలూ చెవినిల్లు కట్టుకుని చెబుతున్నాయి.
బాణసంచా కాల్పులకు ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఈ సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకున్నాయి. ఆ ఒరవడిని ఇప్పటికిప్పుడు మనం పూర్తిగా అనుసరించలేమనుకున్నా, ఇతోధిక జాగ్రత్తలు అత్యవసరం. కాటుక, కన్నే పోగొట్టకూడదు; వెలుగుల విస్ఫోటం చీకటి వాకిట మనల్ని నిలబెట్టకూడదు. అతి అనర్థం, మితిలోనే అందం, ఆనందం.