
తీరికూర్చుని ఉక్రెయిన్ ద్వారా రష్యాను రెచ్చగొట్టి అనవసర యుద్ధానికి కారణమైన యూరప్ దేశాలకు రెండేళ్లు గడిచాక ఆ ఊబి నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గం తెలియటం లేదు. ఎప్పుడేం మాట్లాడతారో, ఎలాంటి ప్రతిపాదన తెస్తారో తెలియని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యాక జరిగిన పరిణామాలతో ఆ దేశాలకు ఎటూ పాలుబోవటం లేదు.
ట్రంప్ తాజా ప్రతిపాదన ప్రకారం రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ పరస్పరం తలపడుతున్న ప్రాంతం వద్ద వెంటనే యుద్ధం నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరికి వారు విజయం తమదేనని ప్రకటించుకోవచ్చు. దీనర్థం ఏమంటే... తమ భూభాగంలో ఇంతవరకూ రష్యా చొచ్చుకువచ్చి ఆక్రమించిన డోన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ మరిచిపోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే రెండు దేశాలూ చర్చించుకుని ఇతరేతర అంశాలపై అంగీకారానికి రావొచ్చు.
జెలెన్‌స్కీకి ట్రంప్ వద్ద భంగపాటు ఎదురుకావటం ఇది మొదటిసారి కాదు. ఆయన అధ్యక్షుడైన కొన్నాళ్లకే వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు అంతర్జాతీయ చానెళ్ల సాక్షిగా ట్రంప్ ‘ప్రపంచ కోర్టు’ నడిపారు. జెలెన్‌స్కీపై నిప్పులు చెరిగారు. తన ఆత్మగౌరవం కాపాడుకోవటానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆయనకు రెట్టింపు చీవాట్లు పడ్డాయి. చివరకు ట్రంప్ ఇవ్వదల్చుకున్న విందును కూడా బహిష్కరించి వెనుదిరగాల్సి వచ్చింది. అటుపై ఏం జరిగిందో ఏమో... నేతలిద్దరూ సఖ్యంగా కనబడ్డారు.
ఉక్రెయిన్ అడిగిన సాయమల్లా చేస్తానని హామీ ఇవ్వటమేకాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను దారికితెస్తానని చెప్పారు. గత నెలలో కూడా ట్రంప్... జెలెన్‌స్కీకి పెద్ద వాగ్దానాలే చేశారు. పెను విధ్వంసాన్ని సృష్టించగల తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు అందిస్తామని, వాటి సాయంతో కోల్పోయిన భూభాగాన్ని వెనక్కితీసుకోవటంతోపాటు మరింత ముందుకు చొచ్చుకుపోయి రష్యా భూభాగాన్ని ఆక్రమించవచ్చంటూ అభయం ఇచ్చారు. వీటిని నమ్మబట్టే గంపెడంత ఆశతో జెలెన్‌స్కీ మొన్న వాషింగ్టన్ వెళ్లారు. కానీ జరిగింది వేరు. తోమహాక్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు.
ట్రంప్ తాజా వైఖరి మారదన్న గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పటికైతే ఇది సరైనది. ఎందుకంటే సోవియెట్ యూనియన్ 15 దేశాలుగా విడిపోయి ప్రధాన భూభాగం రష్యాగా మిగలటంతో ప్రచ్ఛన్నయుద్ధ దశ ముగిసింది. నాటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ తమ ఆధ్వర్యంలోని ‘వార్సా’ కూటమి రద్దయిందని ప్రకటించారు. ‘నాటో’లో చేరడానికి సంసిద్ధత తెలిపారు.
ఆ రోజుతో నాటో కూటమికి ప్రాతిపదిక లేకుండా పోయింది. దాన్ని రద్దుచేయాలి. కానీ అమెరికా, యూరప్ దేశాలు అందుకు అంగీకరించలేదు. నాటో విస్తరణ ఉండబోదనీ, కొత్తగా ఎవరినీ చేర్చుకోబోమనీ హామీ ఇచ్చాయి. జరిగిందంతా ఇందుకు విరుద్ధం. గత వార్సా కూటమిలోని పది దేశాలను చేర్చుకున్నాయి. ఈ నాటకంలో ఉక్రెయిన్ చివరి పావు.
తోమహాక్ సాయంతో మాస్కోతో సహా రష్యా నగరాలన్నిటినీ ధ్వంసం చేయొచ్చు. దాని ప్రయోగానికి అమెరికా బలగాలు రంగంలోకి దిగుతాయి. కానీ ఆ తర్వాత? అది రష్యా–నాటో ఘర్షణగా మారుతుంది. పుతిన్ రెచ్చిపోయి తన పంతం నెరవేర్చుకోవటానికి అణ్వస్త్ర ప్రయోగానికి తెగించే ప్రమాదం ఉంటుంది. ఇది వెనువెంటనే యూరప్‌నూ, ఆపై అమెరికానూ... చివరకు ప్రపంచ దేశాలన్నిటినీ వినాశనం వైపు నెడుతుంది. దీనివల్ల ఒరిగేదేమిటి? నిజానికి, నాటోను అడ్డంపెట్టుకుని అమెరికా జూదమాడుతోంది.
గత అమెరికా అధ్యక్షులంతా యూరప్ దేశాలను రష్యాపై ఉసిగొల్పటం, సమస్య జటిలమైనప్పుడు ట్రాక్–2 దౌత్యం ద్వారా రష్యాను చల్లబరచటం ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. బైడెన్ వరకూ అది సజావుగా సాగింది. కానీ ట్రంప్‌కు దానిపై ఏ మేరకు అవగాహన ఉందన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ తెలిసినా దాన్ని ట్రంప్ గుట్టుచప్పుడు కాకుండా చేయగలరన్న నమ్మకం లేదు.
ఇన్నాళ్లూ అమెరికాతో అంటకాగి పొరుగునున్న రష్యాతో సొంతంగా దౌత్యం నెరపటం తెలియని యూరప్‌కు తగిన శాస్తి జరిగింది. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ను వెనక్కులాగి, ట్రంప్ తాజా ప్రతిపాదన బాగుందని కీర్తిస్తే ఈ లంపటం నుంచి బయటపడటం ఆ దేశాలకు తేలిక. ఇంకా శ్రుతి మించితే మొదటికే మోసం వస్తుంది.