
యుద్ధం ఆపాలని రష్యా, ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడి పిలుపు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో రెండుగంటలపాటు చర్చలు
జరిగిన రక్తపాతం చాలు.. ఇక ఆపండని ట్రూత్‌లో పోస్ట్
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలని, ఇకనైనా ఎక్కడిదక్కడే ఆపేసి రెండు దేశాలు వెనక్కు తగ్గాలని సూచించారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ శుక్రవారం (స్థానిక కాలమానం) మధ్యాహ్నం ట్రంప్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిగాయి. అనంతరం తన సొంత సోషల్‌మీడియా కంపెనీ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ‘వారు ఎక్కడిదక్కడే ఆపేయాలి. ఇద్దరూ ఎవరికి వారే యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవచ్చు. అసలు విషయాన్ని చరిత్రకు వదిలేద్దాం’అని పేర్కొన్నారు.
ఇక ఇళ్లకు వెళ్లండి
యుద్ధాన్ని ఆపేసి ఇరుపక్షాలు చర్చలకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవులు గడిపేందుకు ఫ్లోరిడాకు వచి్చన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడికైనా యుద్ధక్షేత్రంలోకి వెళ్లి చూడండి. అంతటా తీవ్రమైన పరిస్థితులే. యుద్ధాన్ని ఎక్కడిదక్కడే ఆపేసి ఇరుపక్షాలు ఇళ్లకు వెళ్లిపోండి. కుటుంబాలతో గడపండి. హత్యలు ఆపండి.
ఇరుపక్షాలు ఈ పనిచేయటం మంచిది’అని పేర్కొన్నారు. యుద్ధ విరమణపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ గురువారం ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయతి్నస్తున్న ట్రంప్.. గతంలో జెలెన్‌స్కీని తీవ్రంగా విమర్శించగా, తాజాగా పుతిన్‌పై బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాలను వదిలేసి వెనక్కు వెళ్లాలని హెచ్చరించారు.
వెనక్కు తగ్గకుంటే ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి అత్యాధునిక తొమహాక్ క్షిపణులు అందిస్తానని రష్యాను హెచ్చరించిన ఆయన.. తాజాగా మాట మార్చి రష్యాను బెదిరించేందుకే అలా చెప్పానని, ఆ క్షిపణులు ఉక్రెయిన్‌కు అవసం లేదని ఎన్‌బీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం ఆపాలన్న ట్రంప్ ప్రకటనను జెలెన్‌స్కీ స్వాగతించారు. కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరిపేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు.