
త్వరలో ‘భారీ పురోగతి’ అంటూ ట్రంప్ ఊరింపు
డోన్బాస్ కావాలంటున్న రష్యా అధ్యక్షుడు పుతిన్?
బదులుగా ఉక్రెయిన్‌కు ‘నాటో’ తరహా రక్షణ!
న్యూయార్క్: ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్‌కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం.
నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్–5 తరహాలో ఉక్రెయిన్‌కు రక్షణ ఆఫర్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనేదే పుతిన్ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్ ఆఫర్ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.
నేడు ట్రంప్–జెలెన్‌స్కీ భేటీ
ట్రంప్ సోమవారం జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో భేటీ కానున్నారు. పుతిన్‌తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్‌స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్, ఫిన్లండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు.
డోన్బాస్ ఇచ్చేయండి
డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్‌స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్‌స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్‌ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్‌స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.