
సోమవారం వైట్‌హౌస్‌కు చేరుకున్న జెలెన్‌స్కీతో ట్రంప్ కరచాలనం
పుతిన్, జెలెన్‌స్కీలతో కలిసి యుద్ధాన్ని సమాప్తం చేస్తా
శ్వేతసౌధంలో ఈయూ కూటమి అగ్రనేతలతో సంయుక్త
సమావేశం తర్వాత ట్రంప్ ప్రకటన
అమెరికా రాజధానిలో కీలక పరిణామం
వాషింగ్టన్: ఉక్రెయిన్ యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలికేందుకు కంకణం కట్టుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యురోపియన్ యూనియన్ కీలక సభ్య దేశాల అగ్రనేతలు యుద్ధ పరిసమాప్తి కృషిపర్వంలో కీలక పురోగతి సాధించారు. ఇందుకు అమెరికా రాజధాని నగరం వేదికైంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లతో కలిసి తాను త్రైపాక్షిక సమావేశం నిర్వహించబోతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం వాషింగ్టన్‌లోని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోని ఈస్ట్‌రూమ్‌లో ఐరోపా సమాఖ్య కీలక సభ్యదేశాల అగ్రనేతలతో ట్రంప్ సంయుక్త సమావేశం ఏర్పాటుచేశారు. త్వరలో యుద్ధ విరమణ కోసం పుతిన్, జెలెన్‌స్కీ, ట్రంప్ త్రైపాక్షిక సమావేశం జరిపేందుకు ఈయూ నేతలు ఏకగ్రీవంగా అంగీకరించారు. అయితే ఈ త్రైపాక్షిక భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది ఇంకా నిర్ణయించలేదు. సెక్యూరిటీ గ్యారెంటీలో ఉండే ప్రధానాంశాలు సైతం ఇంకా ఖరారుకాలేదు.
‘నాటో’ కూటమిలో చేరకపోయినా సరే అదే తరహాలో ‘రక్షణ హామీ’ని ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్న అంశం ఈ సంయుక్త సమావేశంలో ప్రస్తావనకు వచి్చంది. ఈ సంయుక్త సమావేశంల నాటో కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రూటే, యురోపియన్ కమిషన్ మహిళా అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశమయ్యారు.
అయితే ఈ త్రైపాక్షిక సమావేశంలో ఈయూ తరఫున సైతం ఒక ప్రతినిధి పాల్గొంటే మంచిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు. నాటోయేతర రక్షణహామీకి ట్రంప్ ముందుకు రావడం ఈ మొత్తం ప్రక్రియలో కీలక పరిణామమని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే అన్నారు. తక్షణం కాల్పుల విరమణ ప్రకటిస్తే బాగుంటుందని జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్ అభిప్రాయపడ్డారు. యుద్ధకాల్పుల మోత మెల్లగా తగ్గుముఖం పట్టనుందని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వ్యాఖ్యానించారు. అంతకుముందు నేతలంతా ఒక గ్రూప్ ఫొటో దిగారు.
జెలెన్‌స్కీని మెచ్చుకున్న ట్రంప్
ఈయూ నేతలతో భేటీకి ముందు తొలుత జెలెన్‌స్కీతో ట్రంప్ విడిగా సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గత భేటీలో టీ–షర్ట్ వేసుకొచి్చన జెలెన్‌స్కీని అమెరికా మీడియా తప్పుబట్టిన నేపథ్యంలో ఈసారి నలుపు రంగు సూట్ ధరించారు. సూట్ డిజైన్‌ను ట్రంప్ మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఒక లేఖ అందించారు. ‘‘ ఇది మీ భార్య కోసం. అయితే ఇది నేను రాసింది కాదు. నా భార్య రాసింది’’ అనడంతో అందరూ ఫక్కున నవ్వేశారు. తర్వాత ట్రంప్ మాట్లాడారు. ‘‘
యుద్ధంలో యావత్ ప్రపంచమే అలసిపోయింది. మనం దీనిని ఇక ముగింపునకు తీసుకొద్దాం. ఈరోజంతా మంచే జరగబోతోంది. పుతిన్, జలెన్‌స్కీతో కలిసి త్రైపాక్షిక భేటీ ఆమోదయోగ్యమైన రీతిలో జరిగే అవకాశముంది. ఈ యుద్ధం ముగియబోతోంది. ముగింపు అనేది అంతా కాకపోయినా కొంతైనా మిస్టర్ జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉంది’’ అని ట్రంప్ అన్నారు. సెక్యూరిటీ గ్యారెంటీ హామీలో భాగంగా ఉక్రెయిన్‌కు భవిష్యత్తులో అమెరికా బలగాలు మొహరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ సూటిగా సమాధానం చెప్పలేదు.