
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.
భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్‌స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి ఉక్రెయిన్‌కు ఆహ్వానించకపోవడం విచారకరమని కామెంట్స్ చేశారు. అయితే, మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.
కాగా.. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్‌స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్‌తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నుంచి భారత్‌పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.