బిహార్‌లో మూడు నెలలపాటు కొనసాగి, వివాదాలకు తావిచ్చి చివరకు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం కూడా తప్పనిసరైన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కొత్తగా 12 రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి ప్రారంభం కాబోతోంది. నెల రోజుల్లో ఇది పూర్తవుతుంది. ఇందులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలున్నాయి. ఎన్నికలు జరగబోయే మరో రాష్ట్రం అస్సాంను దీన్లోంచి మినహాయించారు.
బిహార్ వరకూ చూస్తే ‘సర్’ పూర్తయ్యాక నికరంగా 47 లక్షల మంది ఓటు హక్కు కోల్పోయారు. ఇందుకు దారితీసిన కారణాలేమిటో ఎన్నికల సంఘం(ఈసీ) ఇంతవరకూ చెప్పలేదు. వారంతా ‘విదేశీయులా’, వలసపోయినవారా, మరణించినవారా అన్న వివరాలు ఇంత వరకూ ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో సాగుతున్న విచారణ సందర్భంలోనైనా ఇవి వెల్లడ వుతాయో లేదో తెలియదు. సరిగ్గా ఆ విచారణ జరగబోతున్న రోజే కొత్తగా ‘సర్’ మొదలుకానుండటం గమనార్హం.
ఈసారి నిర్వహించనున్న ‘సర్’లో ఈసీ స్వల్పంగా మార్పులు చేసింది. దీని ప్రకారం తొలి దశలో ఓటర్ల ఇళ్లకు పోయి ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందిస్తారు. ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌తో సహా వాటిని నింపి వెనక్కిచ్చాక క్రితంసారి... అంటే 2002–04 మధ్య కాలంలో నిర్వహించిన ‘సర్’లో వారి పేరుందో లేదో చూస్తారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు లేదా బంధువుల గుర్తింపు నంబర్లు నింపాల్సి ఉంటుంది.
అది లేనట్టయితే 11 పత్రాల్లో ఏదో ఒకటి దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏదీ ఇవ్వలేకపోతే ముసాయిదా జాబితాలో వారి పేరుండదు. అలాగే తీసుకున్న ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కివ్వనివారి గురించి ఆరా తీస్తారు. కారణం తెలుసుకుంటారు. వీరందరి పేర్లూ తొలగించిన ముసాయిదాను స్థానిక సంస్థల కార్యాలయాల్లో ఉంచుతారు. తొలగించిన కారణాలు కూడా పొందుపరుస్తారు.
తాజా ప్రకటన కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో స్వాతంత్య్రానంతరం ఇంతవరకూ 8 దఫాలు ‘సర్’ చేపట్టామని, ఇది తొమ్మిదవదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. పేరు వరకూ అది నిజమే కావొచ్చు. కానీ వాటికీ, ఇప్పుడు చేపడుతున్న ‘సర్’కూ పోలికే లేదు. అప్పుడు ఓటర్ల పేరు నమోదు చేసుకోవటమే తప్ప ఫామ్ పూర్తి చేసి ఇవ్వాలని కోరలేదు. వారినుంచి ఎలాంటి పత్రాలూ లేదా పౌరసత్వ ధ్రువీకరణ పత్రం అడగలేదు.
చుట్టుపక్కలవారు అతని స్థానికతపై లేదా పౌరసత్వంపై సందేహాలు వ్యక్తం చేసిన సందర్భంలో మాత్రమే అటువంటివి కోరేవారు. ఫామ్ పూర్తి చేసి వెనక్కిస్తేనే పేరు నమోదు చేస్తామనటం వల్ల అక్షరాస్యత అంతంతమాత్రంగా ఉండే అట్టడుగు వర్గాల ప్రజలకూ, దివ్యాంగులకూ, వృద్ధులకూ, రోగులకూ అది సమస్యా త్మకం కావొచ్చు. క్రితంసారి పేరులేనట్టయితే అందుకు కారణాలు తెల్పాలి. తల్లిదండ్రులు లేదా బంధువులు అప్పట్లో నమోదు చేసుకునివుంటే వారి ఓటర్ నంబర్ తెల్పాలి.
లేనిపక్షంలో వారి పేరు జాబితాకు ఎక్కదు. ఈ దశలో రాజకీయ పక్షాలు ఏ మేరకు శ్రద్ధ తీసుకుంటాయో, సాయపడతాయో లేదో తెలియదు. బీఎల్‌ఓలతోపాటు వలంటీర్లు ఇందుకు తోడ్పడతారని చెప్పటం కాస్త ఊరట. కానీ ఇన్ని రకాల నిబంధనల చట్రంలో... జరుగుతున్నది ఓటర్ల నమోదు ప్రక్రియా లేక తొలగింపు ప్రక్రియా అనే సందేహం తలెత్తే అవకాశం లేదా?
బిహార్‌లో ‘సర్’ అమలైనప్పుడున్న నిబంధనలు చాలావరకూ ఇప్పుడు మారాయి. అప్పట్లో పలు నిబంధనలపై తలెత్తిన గందరగోళంపై స్పష్టత రాకుండానే ఆ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు వచ్చిన నిబంధనలపై కూడా అనేక సందేహాలుంటాయి. ఇక పౌరస త్వాన్ని ధ్రువీకరించేందుకు ఈసీకి వున్న అర్హతపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సే ఉంది.
ఈ దశలో మళ్లీ అనేకులు న్యాయస్థానం తలుపు తట్టే అవకాశం లేకపోలేదు. ఈసీ తన స్థాయిలోనే సందేహ నివృత్తి చేస్తే వేరు. కానీ నిరుడు మేలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపైనా, ఈవీఎంల విశ్వసనీయతపైనా వైఎస్సార్ కాంగ్రెస్ దాఖలు చేసిన ఫిర్యాదులపై ఇంతవరకూ నిమ్మకు నీరెత్తినట్టున్న ఈసీ నుంచి అలాంటిది ఆశించగలమా?


