రచయితలు ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారు. కవులు రావలసిన ఆ ఈ–మెయిల్ వస్తే బాగుండని అనుకుంటారు. విమర్శకులు ఫలానా విషయంపై తప్పక తమ పాయింట్‌ను అక్కడ ప్రెజెంట్ చేయాలనుకుంటారు. ఒక కొత్త పుస్తకందారు తన పుస్తకాన్ని ఆ చోటనే ఆవిష్కరించుకోవడం సంతసమైన సంగతిగా తలుస్తాడు. అసలు నలుగురినీ కలవడం, పలకరించుకోవడం, పరామర్శించుకోవడం... మనమంతా ఒకటి... మన బృందమే మనకు తోడు అనే భావన కల్పించుకోవడం... దానిని వేడుక అనండీ... సమ్మేళనం అనండి... అందరూ కలిసి చేసే సంబరం అనండి... సాహితీ సంబరం... లిటరేచర్ ఫెస్టివల్. ఇవి ప్రతి భాషలో జరుగుతుంటాయి. సాహిత్యాభిమానులకు ఇవి స్వాతిచినుకులు.
తెలుగువారి సాహిత్యానికి ఉన్నంత చరిత్ర సాహితీ ఉత్సవాలకు లేదు. అవి చాలా పరిమితమైనవి. వారికి తెలిసినవి పుస్తక ఆవిష్కరణలు. ఇన్విటేషన్ ప్రచురించడం, నలుగురిని ఆహ్వానించి వచ్చిన యాభై, అరవై మంది సమక్షాన పుస్తకం గురించి మాట్లాడుకుని, అదే పండుగగా తలవడం. ఇక శతజయంతి సభలు, కొందరు సాహితీవేత్తలు తమ సాహిత్యంపై ఏర్పాటు చేసుకునే ఒక రోజు సదస్సులు, తమ సాహిత్యంపై ప్రయత్నపూర్వకంగా జరిపే వారోత్సవాలు... ఇవన్నీ అందరూ పాల్గొనే అందరినీ నిమగ్నం చేసేవి కావు.
అందువల్ల జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్, కేరళ లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ తీరుతెన్నులు తెలిసినప్పుడు ఇక్కడ అలాంటివి ఎందుకు జరగవు... అని కవులు, రచయితలు అనుకోవడం పరిపాటి. అవి తాము పాల్గొనడానికే కాదు... అవి వదిలించగలిగే కొన్ని నిర్లిప్తతల కోసం, పెళ్లగించగలిగే మరికొన్ని జడత్వాల కోసం.
కొన్నేళ్ల క్రితం తిరుపతిలో ఏటా సాగిన భాషా బ్రహ్మోత్సవాలు తెలుగు సాహిత్యావరణంలో పెద్ద సందడి, కదలిక సృష్టించగలిగాయి. అదే తిరుపతిలో, ఆపై హైదరాబాద్‌లో జరిగిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ దేశ విదేశ సాహితీకారులను తరలి వచ్చేలా చేసి ఇది మన జాతి, మన భాష, మన సృజన అని మురిసిపోయేలా చేయగలిగాయి. కాని ఎందుచేతనో ఆ తర్వాత ప్రభుత్వాల నిష్ఠ సన్నగిల్లింది.
వాటిని పురిగొలిపే బయటి సంస్థలు, వ్యక్తులు కూడా ఊరికే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వారికి సాహితీ ఉత్సవాలంటే బుక్‌ఫెయిర్సే శరణమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ బుక్‌ఫెయిర్స్... వీటినే లిటరేచర్ ఫెస్టివల్‌గా భావించి అదే చారనుకో, అదే మజ్జిగనుకో అనే చందంగా అక్కడే ఆవిష్కరణలు, సమ్మేళనాలు జరుపుకొని సరిపుచ్చుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా లిటరేచర్ ఫెస్టివల్స్ జరుపుకోవడం ఆ యా దేశాల జాతి సంస్కారంలో భాగం. నాగరికత వికాసాన్ని వ్యక్తపరిచగలిగే సభ్యత. మన దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఈ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ముఖ్య నగరాల పేరుతో కూడా అదనంగా ఈ ఉత్సవాలు సాగుతున్నాయి. ఇవి ఎందుకు? సాహిత్యమే సంస్కారం కనుక. పుస్తకమే దిక్సూచి కనుక. కావ్యమే దీపం, అక్షరమే ఆలోచన కనుక. సాహిత్యం మనిషి ఇలా ఎందుకు ఉన్నాడో, ఇలా ఎందుకు ఉండకూడదో చెప్పగలిగే సృజనాత్మక రూల్‌బుక్. ఈ రూల్‌బుక్‌ను తరచి చూసుకోవడం కోసం, అప్‌డేట్ చేసుకోవడం కోసం, లిటరేచర్ ఫెస్టివల్స్ అవసరం. మూడు నుంచి ఐదురోజుల ఈ ఫెస్టివల్స్‌లో ఆ భాషలోని కథ, కవిత, నాటకం, సినిమా, విమర్శ, బాలసాహిత్యం, కళా ప్రదర్శనలు... ఎంత బాగుంటుంది.
కాని తెలుగునాట ఆధ్యాత్మిక ఉత్సవాలు అందుకున్నంత ఊపును ఈ సాహితీ ఉత్సవాలు అందుకోవడం లేదు. ప్రభుత్వాలు పూనుకోకపోవడం ఒక కారణమైతే, ప్రయివేటు వ్యక్తులు చేయాలనుకున్నా స్పాన్సర్స్ పైసా రాల్చకపోవడం మరో కారణం. ఈ నేపథ్యంలో ఒకే సందర్భంలో విజయవాడలో అమరావతి లిటరేచర్ ఫెస్టివల్, హైదరాబాద్‌లో ఛాయా లిటరేచర్ ఫెస్టివల్ జరగడం ఆహ్వానించదగ్గ విషయం. హైదరాబాద్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ చేయూతతో జరిగిన ‘ఛాయా లిటరేచర్ ఫెస్టివల్’ ఒక పెద్ద ఆసక్తిని ఏర్పరచడమే గాక దానికి హాజరైన సాహితీప్రియుల సంఖ్యను చూసి ఇలాంటివి మనం కూడా చేయవచ్చే అన్న ఉత్సాహాన్ని మరెందరికో కలిగించగలిగింది. ఇది పెద్దవిషయం.
నవంబర్ నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి వరకు లిటరేచర్ ఫెస్టివల్స్‌కు దేశంలో సీజన్. తెలుగువారికి ఎన్ని ముఖ్య నగరాలు... హైదరాబాద్, వరంగల్, విశాఖ, తిరుపతి, రాజమండ్రి... వీటిలో కనీసం రెండు రోజుల లిటరేచర్ ఫెస్టివల్స్ జరపడం స్థానిక ప్రజా ప్రతినిధులు, వదాన్యులు, సాహితీ సంస్థలు పూనుకుంటే పెద్ద కష్టమేమీ కాదు. వాటిని చేయవచ్చనీ, చేస్తే ప్రజలు మెచ్చుతారనీ తెలియడం ముఖ్యం.


