కళలు మానవానుభూతుల అభివ్యక్తి సాధనాలు. కళలు మానవ నాగరిక ప్రస్థానానికి సాక్షీభూతాలు. కళలు మానవుల సౌందర్య పిపాసకు నిదర్శనాలు. కళలు మానవుల సృజన సామర్థ్యానికి తార్కాణాలు. కళలు సామాజిక సంస్కృతికి ప్రతిబింబాలు. కళలకు చోటు లేని సమాజం మరుభూమితో సమానం.
ప్రపంచవ్యాప్తంగా నాగరికతలతో పాటే కళలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. రాజ్యాలు ఏర్పడ్డాక కళలకు ప్రోత్సాహం పెరిగింది. రాజాదరణ పొందిన కవులు, కళాకారులు లోటు లేని భద్రజీవితాలను గడుపుతూ, కళాసృజన చేసేవారు. కళల పట్ల అభిరుచి గల రాజులు కవులకు, కళాకారులకు కనకాభిషేకాలు సహా ఘన సత్కారాలు చేసేవారు. రాజులే కాక సమాజంలోని సంపన్న కులీనులు కూడా కళాకారులను ఆదరించేవారు. కళాపోషణ సమాజంలో ఒక హోదా చిహ్నంగా ఉండేది.
తెలుగునాట కళాపోషణకు అనేక ఉదాహరణలు మన చరిత్రలో కనిపిస్తాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాజాస్థానాలలో అనేక ఘనసత్కారాలను పొందాడు. ‘దీనార టంకాల తీర్థమాడించితి/ దక్షినాధీశు ముత్యాల శాల’ అని శ్రీనాథుడు స్వయంగా చెప్పు కున్నాడు. శ్రీనాథుడికి దీనార టంకాలతో కనకాభిషేకం చేసిన రాజు ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడి తర్వాత కనకాభిషేకం పొందిన మరో కవి అడిదం సూరకవి. శ్రీనాథుడికి శతాబ్దాల తర్వాతి వాడు అడిదం సూరకవి.
విజయనగరం ఆస్థానానికి వెళ్లిన అడిదం సూరకవి ఆ రాజ్యానికి రాజైన పూసపాటి విజయరామరాజును పొగుడుతూ, ‘రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా/ రాజు దిగంబరుడు మృగరాజు గుహాంతర సీమవర్తి వి/ భ్రాజిత పూసపాడ్విజయ రామ నృపాలుడు రాజు కాక ఈ/ రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్’ అని పద్యం చెప్పాడు. విజయరామరాజు సూరకవి పొగడ్తకు మురిసి ముక్కలై, కనకా భిషేకం జరిపాడు.
అయితే, ఈ కవిరాజుది మరీ విడ్డూరమైన కథ. ‘స్నానము చేసిన ఉదకమును పానము చేయలేను’ అని చెప్పి, కనకాభిషేకంలో వాడిన బంగారు నాణేలను తీసుకోవడానికి నిరాకరించాడు. అడిదం కవి ఆత్మాతిశయానికి మెచ్చిన విజయరామ రాజు తగురీతిలో ఘనసత్కారం జరిపి, ఆయనను సాగనంపాడట! తెలుగునాట కనకా భిషేకాల కాలం బహుశా అడిదం కవితోనే అంతరించింది.
ఎందరో రాజులు రాజ్యాలను ఏలారు. వారిలో చాలామంది చరిత్రలో కలిసి పోయారు. ఆ రాజులలో కొద్దిమంది మాత్రమే ఇంకా జనాలకు గుర్తున్నారు. కారణం ఒక్కటే! వారి ఏలుబడిలో జరిగిన కళాపోషణ. కళాపోషణ బాగా ఉన్న రాజ్యాలలో ప్రశాంతత ఉండేది. నిత్యం అంతర్బహిర్ కలహాలతో అట్టుడికిపోయే రాజ్యాలలో కళలు ఉన్నా; వాటి ఆదరణకు, పోషణకు ఆస్కారం అతి తక్కువ. రాచరికాల కాలంలో కూడా రాజాదరణ పొందిన కళాకారులే సుభిక్షంగా జీవించగలిగేవారు. అయితే, రాజాశ్రయం పొందడం అంత తేలికగా ఉండేది కాదు. అప్పట్లోనూ అనేక రాజకీయాలు ఉండేవి.
కృష్ణదేవరాయల ఆస్థానంలో చోటు పొందడానికి తెనాలి రామకృష్ణుడు అష్టకష్టాలు పడిన కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి. యోగ్యులైన కవులు, కళాకారులకు ఇవ్వాలనే ఉద్దేశం రాజుకు ఉన్నా, అతడి ఈవిని సాగనివ్వని వారు చుట్టూ ఉండేవారు. వారు తమకు పోటీ రాగల ఇతరులను రానివ్వకుండా నిరోధించేవారు. ఇలాంటి వారి గురించే ‘ఇయ్యగ నిప్పించగల/ యయ్యలకే గాని మీసమందఱకేలా?/ రొయ్యకు లేదా బారెడు...’ అని చౌడప్ప నిరసించాడు.
కళాపోషణ అంటే చాలామందికి ‘ముత్యాలముగ్గు’ సినిమాలోని రావు గోపాలరావు డైలాగు గుర్తుకొస్తుంది. ఆ మాదిరిగా కానీ ఖర్చులేని కళాపోషణ ఎవరైనా చేయగలరు గాని, ఖర్చుకు వెనుకాడకుండా కళాపోషణ చేయాలంటేనే కళాహృదయం ఉండాలి. వర్తమాన కాలంలో ఐర్లండ్ ప్రభుత్వానికి అలాంటి కళాహృదయమే ఉంది. అందుకే కవులు, రచయితలు, కళాకారుల ఆర్థిక సుస్థిరత కోసం నెలకు 1500 యూరోలు చెల్లించే పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తి అయిన మన దేశంలో ఇలాంటి పథకాన్ని కనీసం కలలోనైనా ఊహించగలమా!


