జనతంత్రం
చిరకాలం జరిగిన మోసం, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు ఇంకానా... ఇకపై చెల్లవని మన మహాకవి ఏనాడో చెప్పారు. ఇప్పుడైనా అంతే! బూటకపు మాటలతో, నకిలీ క్రెడిట్లతో, నయవంచనలతో ఇంకెన్నాళ్లు చక్రం తిప్పు తారు? సమాచార గుత్తాధిపత్యాన్ని సాంకేతిక విప్లవం బద్దలు కొట్టిన తర్వాత వార్తలపై, వ్యాఖ్యలపై పెత్తనాలు ఇంకెంతో కాలం సాగబోవని అర్థమైంది. సంకెళ్లు తెంచుకున్న సమాచారం సోషల్ మీడియా అవతారమెత్తిన తర్వాత కూడా కొంతమంది ఆధిపత్యం కొంతకాలం సాగిందేమో! సాంకేతిక సవ్యసాచులైన నవయువతరం వాళ్లు సమాచార చైతన్యం సంతరించుకుంటున్న క్రమంలో పాత ఆధిపత్యం పలాయన మంత్రం పఠిస్తున్నది.
అరబ్ వసంతపు చివుళ్లు, సోనార్ బంగ్లా మెరుపులు, నేపాల్ ప్రకంపనలు... ఇప్పటికే సోషల్ మీడియా పవర్‌ను చాటి చెప్పాయి. చివరకు ప్రపంచపు గుత్తాధిపతుల కంచుకోటను కూడా సోషల్ మీడియా కుదిపేసింది. విశ్వగురువులూ, విజనరీ వేషధారులూ కూడా ఇక సవాళ్లను ఎదుర్కోక తప్పకపోవచ్చు. అభివృద్ధికి పర్యాయపదంగా చంద్రబాబు పేరును మన గుత్తాధి పత్య మీడియా ఎంత దీక్షగా చిత్రించిందో మొన్నటివరకూ కొంతమందికే తెలుసు. ఇప్పుడాయన అభివృద్ధి ప్రచారం బలుపు కాదు వాపేనన్న సంగతి సోషల్ మీడియా కారణంగా చాలామందికి సాక్ష్యాధారాలతో తెలిసిపోతున్నది.
చంద్రబాబును విజనరీగా చూపడం కోసం యెల్లో మీడియా పూనకంతో చేసిన ప్రచారం కారణంగా తానే హైదరాబాద్ నిర్మాత ననీ, సెల్‌ఫోన్‌ను తెచ్చింది తానేననీ, ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేసింది కూడా తానేననీ ఆయనే స్వయంగా నమ్మే మానసిక స్థితిలోకి జారిపోయారు. ఈ రకమైన మానసిక రుగ్మతను ప్రతిపక్ష నేతకు అంటగట్టి చంద్రబాబు ఇమేజ్‌ను కాపాడాలనుకునే దుఃస్థితికి కూడా యెల్లో మీడియా దిగజారిపోయింది.
జగన్‌మోహన్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ తరహా ప్రగల్భాలు పలుకలేదు. ఐటీ విప్లవం తనవల్లే వచ్చిందని ఆయన చెప్పలేదు. బస్సులో కూర్చొని తుపాన్లను కంట్రోల్ చేశానని చెప్పలేదు. ఆయన సహచరులు, పార్టీ కార్య కర్తలు కూడా అలా మాట్లాడలేదు. వీలైతే, వచ్చే తుపాన్‌ను జుట్టు పట్టుకుని వెనక్కి పంపేవాడేనని టీవీల్లో కూర్చొని ఆయన గురించి ఎవరూ చెప్పలేదు.
భారత క్రీడా జట్లు సాధించిన విజయాల వెనుక ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని ఆటగాళ్లు అక్కడక్కడా చెప్పుకుంటున్నారని కూడా ఎవరూ మాట్లాడలేదు. తదుపరి ఒలింపిక్స్‌ను రాష్ట్రంలోనే నిర్వహిస్తానని కానీ, నోబెల్ బహుమతులను పట్టుకొచ్చి యువతకు రివార్డు లిస్తానని కానీ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించలేదు.
జగన్ ప్రభుత్వం అమలుచేసిన ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సరైన ప్రచారం చేసుకోలేదనే ఇప్పుడాయనపై, ఆయన క్యాంపుపై వస్తున్న విమర్శ. అభివృద్ధి పనులైనా, ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రభుత్వ బాధ్యతలే తప్ప కేవలం ప్రచారాంశాలుగా నాటి ప్రభుత్వం భావించలేదు. దీన్నే అలుసుగా భావించిన బాబు శిబిరం ప్రాపగాండా మిషనరీని మరింత అప్డేట్ చేసింది. మొన్నటికి మొన్న విశాఖ డేటా సెంటర్‌పై ఏ స్థాయిలో చెలరేగిపోయారో గమనించాము.
స్వయంగా ప్రభుత్వాధినేతలే గూగుల్ కంపెనీ వారి చెవిలో మంత్రోపదేశం చేసి వారిని చేయిపట్టుకొని నడిపించి విశాఖకు తీసుకొచ్చినట్టు ప్రచారం చేశారు. 15 బిలియన్ డాలర్ల అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని తీసుకొచ్చామని ప్రకటించుకున్నారు. ఇందులో అదానీ సంస్థ ముఖ్య భాగస్వామి అనే సంగతిని మాత్రం పొరపాటున కూడా ఎక్కడా రానీయలేదు. అసలా పేరునే ప్రస్తావించలేదు. ప్రత్యక్షంగా గూగుల్‌తోనే తమ బంధుత్వమున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు.
ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అసలు సంగతి బయటపెట్టారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం అదానీ సంస్థతో అప్పటి జగన్ ప్రభుత్వానికి 2020 నవంబర్‌లో అవగాహన కుదిరింది. డేటా సెంటర్‌లో కీలకమైన 3,900 కిలోమీటర్ల సబ్‌సీ కేబుల్ వేయడానికి సింగపూర్ ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభమయ్యాయి.
దాంతో పాటు డేటా ల్యాండింగ్ స్టేషన్ ఏర్పా టుకు కూడా పూర్వరంగం సిద్ధమైంది. ఆ తర్వాత 2023 మే నెలలో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈలోగా 2022లోనే ఈ రంగంలో గూగుల్‌కూ, అదానీ సంస్థకూ మధ్యన ఒక అవగాహన కుదిరింది. ఇప్పుడు తాజాగా జరిగింది ఆ డేటా సెంటర్‌ను మరింత విస్తరించడం మాత్రమే.
డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నప్పుడు అందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసిన తమ ప్రభుత్వాన్ని గానీ, ఏర్పాటులో కీలక భాగస్వామి అయిన అదానీ సంస్థను గానీ ఎందుకు ప్రస్తా వించలేదు, ఎందుకు కృతజ్ఞతలు చెప్పలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలెవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ, గూగుల్ కంపెనీనే తాము విశాఖకు లాక్కొచ్చామనే ప్రచా రాన్ని మాత్రం ఆపలేదు.
ఈ వ్యవహారంపై ఈ రోజున (శనివారం) ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో అదానీ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ ఒక ఎడిట్ పేజీ వ్యాసాన్ని రాశారు. భారత దేశాన్ని కృత్రిమ మేధ (ఏఐ)కు ప్రపంచ హబ్‌గా మార్చే లక్ష్యంతోనే తాము గూగుల్‌తో కలిసి విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని ఆ వ్యాసంలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఏఐ మిషన్’ లక్ష్యాల సాధనకు తోడ్పడే మౌలిక వ్యవస్థను తాము ఈ సెంటర్ ద్వారా ఏర్పాటు చేస్తున్నా మని ఆయన పేర్కొన్నారు.
ఆ వ్యాసంలో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తా వన కానీ, చంద్రబాబు – లోకేశ్‌బాబుల వ్యవహార దక్షత గురించి కానీ ఒక్క మాట కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రెడిట్ చోరీ వ్యవహారం గురించి తెలిసినందువల్లనే అదానీ రాష్ట్ర ప్రభుత్వం గురించి ప్రస్తావించలేదా? లేకపోతే అదానీ పేరును ప్రస్తావించకుండా సొంత డబ్బా కొట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాస రాహిత్యానికి పాల్పడినందువల్ల టిట్ ఫర్ టాట్ చందంగా అదానీ వ్యవహరించారా? చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా న భూతో న భవిష్యత్ అనిపించేలా ఈ ప్రాజెక్టుకు 22 వేల కోట్ల కిమ్మత్తు చేసే రాయితీలిచ్చి, 600 ఎకరాల భూసంతర్పణ చేసిన రాష్ట్రం గురించి అదానీ స్పందించకపోవడంపై ప్రభుత్వం ఏమనుకుంటున్నది? నేషన్ వాంట్స్ టు నో!
ఒక్క అదానీ – గూగుల్ డేటా సెంటర్ విషయంలోనే కాదు... గత ముప్ఫయ్యేళ్లుగా ఇటువంటి క్రెడిట్స్‌ను తమ ఖాతాలో వేసుకోవడంలో బాబు శిబిరం, యెల్లో మీడియా నిర్మొహమాటంగా వ్యవహరిస్తున్నవి. సోషల్ మీడియా పుణ్యమా అని అప్పటి చాలా విషయాలలో లోగుట్టు కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నది. ఇంకో మూడు రోజుల్లో ‘పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నది.
ఈవెంట్ మేనేజ్‌మెంట్లలో తెలుగుదేశం ప్రభుత్వాల సామర్థ్యాన్ని శంకించవలసిన పనిలేదు. కాకపోతే ఈవెంట్ల నిర్వహణే తప్ప ఆ తర్వాత అడుగు ముందుకు పడదనేదే మన విమర్శ. రెండు వేలమంది ప్రతి నిధులు హాజరవుతారనీ, 30 దేశాల వాణిజ్య మంత్రులు వస్తు న్నారనీ, భారీ ఎత్తున పెట్టుబడులొస్తాయనీ చెబుతున్నారు.
గతంలో కూడా ఇటువంటి ఈవెంట్‌నే నిర్వహించి భారీ ఎత్తున పెట్టుబడులొస్తున్నాయని ప్రకటించారు. కానీ, ప్రకటించిన దానిలో పది శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం విషాదం. ఇప్పుడు కూడా ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. ఈ పార్ట్‌నర్‌షిప్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రధాన కారణం లోకేశ్‌బాబు ప్రమోషన్ కోసమే అనే మాట వినిపిస్తున్నది. తాజాగా శుక్రవారం జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో లక్ష కోట్ల పైచిలుకు పెట్టుబడులకు ఆమోదం తెలిపినట్టు ముఖ్య మంత్రి చెప్పారు.
వీటి ద్వారా 86 వేలమందికి ఉపాధి లభిస్తుందని ఆయన వెల్లడించారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారానే 33 లక్షలమందికి ఉపాధి దొరికింది. కేవలం ఈ ఒక్క రంగంలో మాత్రమే. ఇందులో పెద్ద పరిశ్రమల ఉద్యోగాలు, ప్రభుత్వోద్యోగాలు కలపలేదు. అప్పటి పారిశ్రామిక విధానంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు, స్థానికులకు ఎక్కువ అవకాశాలు అనే అంశాల మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడది లోపించింది.
ఈవెంట్లలో కార్యకర్తలకు టైలు కట్టి, కోట్లు తొడిగి లెక్క పెంచడం వల్ల ఫలితముండదు. రాష్ట్రంలో పరిశ్రమలు నడిచే వాతావరణం ముఖ్యం. ఈ పదిహేడు మాసాల పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. పారిశ్రామిక వేత్తలను వేధించి, భయపెట్టి డబ్బులు దండుకోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు పోటీలుపడ్డ ఉదంతాలు తొలి ఏడాదిలోనే డజన్లకొద్దీ రిపోర్టయ్యాయి.
వసూల్ రాజాల ధాటికి భయపడి ఇండియా సిమెంట్స్ యాజమాన్యం కోర్టును ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. బహుశా ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి ఘటన జరిగి ఉండదు. బూడిద సరఫరా కాంట్రాక్టు మాకంటే మాకే కావాలని నాయకులు రోడ్డున పడి తన్నుకున్న అసహ్యకరమైన పరిణామాలను చూడవలసి వచ్చింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను అక్రమ కేసులతో విసిగించి 3 లక్షల కోట్ల పెట్టుబడిని సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలే మహారాష్ట్రకు తరిమేశారు. మామూళ్ల కోసం శ్రీకాకుళంలో యూబీ కంపెనీ బీర్ల రవాణాను తెలుగుదేశం నేతలు అడ్డుకుంటే కేంద్రం రంగంలోకి దిగి రాష్ట్ర నేతలకు తలంటాల్సి వచ్చింది. ఇటువంటి ఉదాహరణలు అనేకం. ఉన్నత స్థాయిలో జరుగుతున్న సంతర్పణలు, క్రెడిట్ చోరీలు పక్కనబెడితే, క్షేత్ర స్థాయిలో పారిశ్రామిక వాతావరణం ఇంత వైభవోజ్జ్వలంగా వెలిగిపోతున్నది.
ఈ వెలుగు జిలుగుల్లో విశాఖలో జరగబోయే పెట్టుబడుల సమీకరణ సభలో లోకేశ్ అంతా తానై వ్యవహరించబోతున్నారట. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ స్థానంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే కొత్త భావన లోకేశ్ మేధో శిశువనే సంగతిని కూడా ఆ సభలో ప్రకటిస్తారట! ఇంతకూ ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరో? ఎంతకూ ఆ పేరు గుర్తుకు రావడం లేదు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


