ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చే ఎల్లో మీడియాకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది. కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా.. పార్టీ మీటింగ్‌లో కార్యకర్తలతో మాట్లాడుతూ ‘‘భయం వద్దు... మళ్లీ ఆ పాలన రాదు’’ అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు ప్రయత్నించినా... వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి రావడం కష్టమేనని ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారన్న విషయం కూడా పవన్‌కు స్పష్టమైనట్లు అర్థమవుతోంది. నిజానికి ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కేంద్రం జమిలి ఎన్నికలకు సిద్ధమైతే కొంచెం తొందరగా వచ్చే అవకాశం మాత్రమే ఉంది. కానీ కూటమి నేతల్లో అప్పుడే ఎన్నికల చింత మొదలైంది ఎందకు? రాష్ట్రంలో కూటమి గ్రాఫ్ దారుణంగా పడిపోతూంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ బాగా పుంజుకుంటోందన్న సర్వే రావడమే కారణం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఏదో ఒక పేరుతో ప్రభుత్వం తరఫునే సర్వేలు నిర్వహిస్తుంటారు. ఆయా శాఖలపై సంతృప్తి తీరు అంటూ అధికారులకు పరోక్ష హెచ్చరికలూ చేస్తూంటారు. వాస్తవ పరిస్థితి బయటపడకుండా నెపం ఇతరులపై నెట్టి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలన్నమాట ఇవి. ఈ కారణంగానే కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రజలు తమ పాలనను మెచ్చడం లేదని బాబు అంగీకరించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలలో గేరు మార్చి వైఎస్సార్‌సీపీపై విమర్శల దాడి పెంచారు. వైఎస్సార్‌సీపీ వారు రౌడీయిజానికి పాల్పడుతున్నట్లు అభూత కల్పనలు సృష్టించి, దాన్ని ప్రచారం చేసే బాధ్యత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించారు. ఆ ప్రకారం పవన్ కళ్యాణ్ కూడా సినిమా డైలాగులు మాదిరి వైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో శాంతిభద్రల గురించి కబుర్లు చెప్పడం ఆరంభించారు. మంత్రి లోకేశ్ కూడా రెడ్‌బుక్ మూడు పేజీలే అయ్యాయని, మిగిలిన పేజీలను కూడా ప్రయోగిస్తామంటూ బెదిరించారు. ఇవన్ని వింటుంటే ఈ ముగ్గురు నేతలకు ఓటమి భయం పట్టుకుందని అనిపిస్తుంది.
ఏడాదిన్నరగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలపై వివక్షతో కూడిన వ్యవహారం నడుస్తున్న విషయం ప్రజలందరికీ తెలియందేమీ కాదు. పోలీసులూ అధికార టీడీపీ అడుగులకు మడుగులొత్తే స్థితికి చేరిపోయారు. పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఇప్పటికే పలుమార్లు తీవ్ర వ్యాఖ్యలు చేసింది కూడా. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలలో టీడీపీ, జనసేనల పరిస్థితి దారుణంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీకి 93 స్థానాలు వస్తాయని, సుమారు ఏభై మందిపై టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందని అంతర్గత సర్వేలలో తేలడం, వారిని పిలిచి మాట్లాడతామని చంద్రబాబే చెప్పడం కూడా చూశాం. అలాగే లోకేశ్ కూడా పనితీరు బాగోని 38 మంది ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇస్తామని పార్టీ సమావేశంలో తెలిపినట్లు ఎల్లో మీడియానే పేర్కొంది. ఇక జనసేన ఎమ్మెల్యేలలో మూడువంతుల మంది మళ్లీ గెలవడం అసాధ్యమన్న సంకేతం ఈ సర్వేలలో వస్తోంది.
ఈ సర్వేల ఫలితాలు ప్రభుత్వ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. అసలు టీడీపీ, జనసేనలు సంయుక్తంగా ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని అనేక హామీలను నెరవేర్చలేక చతికిలపడడం కూడా ప్రజలలో తీవ్ర విమర్శలకు దారితీపింది. దానికి తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం, కోట్ల విలువైన భూమిని ఎకరాకు 99 పైసలకే కట్టబెట్టడంం, రికార్డుస్థాయిలో రూ.2.60 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా ప్రజలు ఆశించినవేమీ జరగకపోవడం, అమరావతి పేరుతో మళ్లీ వేల ఎకరాలు సేకరించడం వంటివాటిని టీడీపీ, జనసేన శ్రేణులు కూడా సమర్ధించలేక పోతున్నాయి.ఇలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా, తన పార్టీ వారిలో ఏర్పడిన భయాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రజలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు ఎవరూ భయపడాల్సిన పని లేదని మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాదని పవన్ అన్నారట.
ఇప్పుడు ప్రజలు కాని, అధికారులు కాని భయపడుతున్నది కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో సాగిస్తున్న అరాచకాల గురించే అన్న సంగతి ఆయనకు తెలియదా! తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్ర సమగ్రతకు భంగం కలగనివ్వరట. ఇందుకోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారట.గత పది, పదిహేనేళ్లుగా రకరకాల ఎత్తులు వేసి ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి పదవి పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానిని నిలుపుకోవడంపైనే ఎత్తులు వేస్తుండాలి. అంతే తప్ప రాష్ట్ర సమగ్రతకు ఎక్కడ సమస్య వచ్చింది? గతంలో ఆయా చోట్లకు వెళ్లి ఇదే తనకు రాజధాని అనిపిస్తోందని, మరొకటి చెబుతూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టే యత్నం చేసిన సంగతి పవన్ మర్చిపోయి ఉండవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అయ్యేవరకు కూటమి ఉండాలట.
ఇన్నాళ్లు 15 ఏళ్లు టీడీపీతోనే కలిసి ఉంటామని అనేవారు. తాజా డైలాగు వింటే టీడీపీతో శాశ్వతంగా అంటకాగాల్సిందే అన్నట్లు జనసేన శ్రేణులకు సందేహం వస్తుంది. వైఎస్సార్‌సీపీ వాళ్ల పేర్లు చెప్పడం ఇష్టం లేదట.అదొక రౌడీల సమూహంగా కనిపిస్తుందట. ఇలాంటి మాటలను టీడీపీపైన 2019కి ముందు చాలా చెప్పారు. అంతెందుకు చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి తారాస్థాయికి చేరిందని కూడా ఆ రోజుల్లో విమర్శించేవారు. లోకేశ్ భవిష్యత్తు కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారని కూడా అనేవారు. ఈ ప్రసంగాల తాలూకూ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విరివిగా కనిపిస్తున్నాయి. అందుకే సోషల్ మీడియాపై కూడా ఆయనకు కోపం వస్తోంది. ఎందుకంటే ఆయన ఒరిజినల్ స్వభావాన్ని, ప్రజలను వంచించడానికి వెనుకాడని నైజం బయటకు వస్తున్నాయన్న ఆగ్రహం అప్పడప్పుడు కనిపిస్తుంటుంది.
అలాంటి వాటి గురించి ప్రశ్నించేవారంతా ఆయనకు రౌడీలుగా కనిపించవచ్చు. కాని ఈ 18 నెలల్లో టీడీపీ, జనసేన క్యాడర్ ఏ స్థాయిలో రౌడీయిజం చేస్తున్నది అందరికి తెలుసు.పైగా విపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ వారు ఏదో చేశారని అబద్దాలు చెబుతున్నారు. అదే నిజమైతే కూటమి ప్రభుత్వం బలహీనంగా ఉందని ఒప్పుకున్నట్లే కదా!. జనసేన నేతలు ప్రైవేట్ సెటిల్ మెంట్లు చేయడాన్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేయండని ఆయన సలహా ఇవ్వడాన్ని ఏమనాలి? గత ఎన్నికలకు ముందు పోలీసులను బెదిరిస్తూ చంద్రబాబు, లోకేశ్‌లతోపాటు తాను కూడా ఎన్ని మాటలు అన్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు.
అధికారం రాగానే నీతులు చెప్పడంలో బిజీ అయిపోతుంటారు. టీడీపీ కార్యకర్తలు ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే పోలీసు వాహనాన్ని దగ్ధం చేశారే. ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టారే! జనసేన కార్యకర్తలు ఆనాటి మంత్రి రోజాపై విశాఖ ఎయిర్ పోర్టులో దాడులు చేయించడం, కుండీలను పగలకొట్టి విధ్వంసం సృష్టించడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయితే పోలీసుల సూచనలను కాదని రోడ్డుమీద పడుకోవడం, చిత్తూరు ఎస్పీని, ఆయా చోట్ల అధికారులను ఉద్దేశించి లోకేశ్ బెదిరించడం వంటివి ఏ కోవకు కిందకు వస్తాయో పవన్ చెప్పాలి.
అధికారం వచ్చాక కక్ష కట్టి ఆ రోజులలో పనిచేసిన పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టి కొందరిని జైలుకు పంపడం, పలువురికి పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఉంచడం..ఇలాంటివన్నీ అధికారులలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ వారిని సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసు అధికారులు ఏమి చెబుతున్నారో తెలుసా? పైనుంచి వస్తున్న ఒత్తిడితో తప్పుడు కేసులు పెడుతున్నామని ఓపెన్ గానే తెలియచేస్తున్నారు. హిందుపూర్లో ఎక్సైజ్ శాఖ సీఐ వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఒకరి మీద కేసు పెట్టి క్షమించాలని ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వందలాది ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు శాంతిభద్రతలకు ఏదో జరిగిపోయిందంటూ అభూతకల్పనలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ పడిపోయిన గ్రాఫ్ పెంచుకోవడానికి తంటాలు పడుతున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.



