సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.
ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.
ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు.


