నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో ఇటీవల సంచలనంగా మారిన బాలింత మృతిపై జరిగిన విచారణలో దారుణ వాస్తవాలు వెల్లడయినట్లు తెలుస్తోంది. రక్త మార్పిడి విషయంలో ప్రభుత్వ డాక్టర్, బ్లడ్ బ్యాంక్ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని విచారణలో తేలినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. రెంటచింతల మండలం పాల్వాయిగేటు గ్రామానికి చెందిన సాగరమ్మ (21) పురిటినొప్పులతో ఈ నెల 15వ తేదీన నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు వచ్చింది. 17న కాన్పు చేశారు. శస్త్రచికిత్స తర్వాత ఆమెకు ‘ఓ’ పాజిటివ్ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏరియా వైద్యశాలలో నిర్వహిస్తున్న బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తీసుకువచ్చారు. అయితే రక్తం ఎక్కించే సమయంలో ఆమె శరీరంపై దద్దుర్లు రావడం ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయింది.
తీవ్ర నిర్లక్ష్యం
‘ఓ’ పాజిటివ్ బదులుగా ‘ఏ’ పాజిటివ్ రక్తం ఎక్కించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇందుకు సంబంధించి విచారణలో వెల్లడయినట్లు తెలిసింది. దీంతో రక్త గ్రూప్ నిర్ధారణ, క్రాస్ మ్యాచ్, డబుల్ చెక్.. వంటి ముఖ్య విధానాలను అటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది.. ఇటు వైద్యులు విస్మరించారన్న విషయం స్పష్టమైంది. విచారణ నేపథ్యంలో తప్పు మాది కాదంటే మాది కాదంటూ ఇటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, అటు వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వీరిపై చర్యలు తీసుకోవద్దంటూ ఉన్నతాధికారులపై అధికార పార్టీ నేత ఒకరు తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. బ్లడ్ బ్యాంక్‌పై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణసైతం పూర్తిగా కొరవడినట్లు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం ఇచ్చి వివాదాన్ని సర్ధుమణిగింపచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
త్వరలో చర్యలు..
బాలింత మృతిపై విచారణ జరిపి నివేదికను పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వైద్యశాఖ ఉన్నతాధికారులకు పంపించాం. బాధ్యులపై త్వరలో చర్యలుంటాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– ఎం ప్రసూన, డీసీహెచ్‌ఎస్, పల్నాడు జిల్లా


