విమానయాన సంస్థ ఇండిగో లోటుపాట్లన్నిటినీ సరిదిద్దుకోవటంతో దాని నిర్వహణ మెరుగై, సాధారణ స్థాయికి చేరుకుందని పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) విభాగం మంగళవారం తెలిపింది. మంచిదే! అత్యధిక శాతం మంది ప్రయాణికులు ఆధారపడే సంస్థ సవ్యంగా ఉండటం సంతోషించదగ్గదే. కానీ సమస్యకు మూలకారణం వెతకటంలోనూ, తగిన పెనాల్టీ విధించటంలోనూ డీజీసీఏ ఇంకా మెతకవైఖరే అవలంబిస్తోందని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.
గత నెలలో ఇండిగో సృష్టించిన సంక్షోభంతో పోలిస్తే దానికి విధించిన పెనాల్టీ రూ. 22.2 కోట్లు ఏపాటి? ఆ సంక్షోభం అనుకోకుండా సంభవించిందేమీ కాదు. డీజీసీఏ నియంత్రణలు నచ్చక, వాటిని అనుస రించటం ససేమిరా ఇష్టంలేక ఉద్దేశపూర్వకంగా సృష్టించిన పెను తుపాను అది. దాని ప్రభావం వల్ల దాదాపు వారంరోజుల పాటు విమానయాన సర్వీసులకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. దాదాపు 3,000 సర్వీసులు రద్దయి, కొన్ని సర్వీసుల్లో జాప్యం ఏర్పడి లక్షలాదిమంది ప్రయాణికులు ఎన్నో అగచాట్లు ఎదుర్కొనవలసి వచ్చింది.
పరీక్షలకూ, ఇంటర్వ్యూలకూ హాజరు కావలసిన వారు మొదలుకొని కోట్లాది రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకునే వారి వరకూ ఈ సంక్షోభం వల్ల నష్టపోయారు. మనోవేదన అనుభవించారు. ప్రాణాపాయంలో ఉన్న ఆప్తుల చివరిచూపు దక్కనివారూ, వైద్యచికిత్స కోసం బయల్దేరినవారూ రోదించారు. ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామనుకున్నా లగేజి గల్లంతై అల్లాడిపోయారు. ఇంతమంది ఇన్నివిధాల నష్టపోగా అందుకు తగిన మూల్యం చెల్లించవద్దా? వేరే దేశాల్లో ఇదే జరిగితే ఏమయ్యేది?
ఇండిగో సంక్షోభం వచ్చిపడ్డాక డీజీసీఏ మేల్కొంది. డిసెంబర్ మొదటివారం నుంచి నెలాఖరు వరకూ ఆ సంస్థ రోజువారీ నిర్వహణపై నివేదికలు తెప్పించుకుంది. విమా నాలు రద్దయినా, ఆలస్యమైనా అందులో పేర్కొనాలని, సిబ్బంది వివరాలివ్వాలని,ఎందరు సెలవులో ఉన్నారో, ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటో కూడా చెప్పాలని కోరింది. సర్వీసుల నిర్వహణ తీరును, సామర్థ్యాన్ని మదింపు వేశారు. ఈ క్రమంలో డీజీసీఏ కూడా తన లోపాలు సవరించుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రెండేళ్ల క్రితమే ఏర్పరిచిన నిబంధనలను విమానయాన సంస్థలు బేఖాతరు చేస్తున్నా ఆ సంస్థ సరిగా పట్టించుకోలేదు. అందునా ఇండిగోను చూసీచూడనట్టు వదిలేశారు.
ఆ నిబంధనలు నిజానికి భద్రతను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. లాభార్జన కోసం తక్కువమందితో అధికపని చేయించటం ప్రమాదకరమన్న ఉద్దేశంతో నిర్దేశించిన ప్రమాణాలవి. వారంలో పైలెట్లకు ఉండే విశ్రాంతిని 36 గంటల నుంచి 48 గంటలు చేయటం, రాత్రి పనివేళల్ని గరిష్ఠంగా 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లు మించి నైట్ ల్యాండింగ్ చేయకూడదని నిబంధన విధించటం వంటివి అందులో ఉన్నాయి. వీటిని అమలు చేయాల్సిందేనని చెబుతున్నా ఇండిగో మొండికేసింది. ‘మాపై ఒత్తిడి తెస్తే చివరికి జరిగేది ఇదే’ అని తెలియజెప్పేందుకే అడ్డగోలుగా సర్వీసుల రద్దు మొదలెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. మొదట్లోనే సరైన పర్యవేక్షణతో, సమస్యాత్మకంగా ఉండేవారిపై చర్యలు తీసుకుంటే కథ వేరుగా ఉండేది. డీజీసీఏలో ఇది లేకపోబట్టి ఇండిగో ఇలా చేయగలిగింది.
ఇంత సంక్షోభాన్ని సృష్టించిన సంస్థ నిర్వాహకులకు గుణపాఠం చెప్పే రీతిలో చర్యలుంటే మరే సంస్థా ఎప్పుడూ ఇలాంటి తప్పు చేయటానికి సాహసించేది కాదు. ఇండిగో భారత్‌లో నిర్వహించే కార్యకలాపాల వల్ల వచ్చే ఆదాయం తక్కువేం కాదు. 2024–25లో ఇండిగో సంస్థ లాభార్జన రూ. 7,253 కోట్లు. ఆ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇన్ని లక్షలమంది నష్టాలు, కష్టాలకు లోనయినప్పుడు కఠినమైన చర్యలుండొద్దా? నష్టపోయిన వారికి మెరుగైన పరిహారం చెల్లించేలా చూడొద్దా? డీజీసీఏలో కింది స్థాయిలో ఇండిగో వంటి సంస్థలతో లాలూచీ పడినవారు ఉంటే ఉండొచ్చు. అలాంటి వారిపైనే కావొచ్చు... ఆ సంస్థ చర్యలు కూడా తీసుకుంది. కానీ పై స్థాయిలో కూడా మెతకవైఖరే ఉన్నదని ఆ సంస్థ తాజా వైఖరి చూస్తే అర్థమవుతోంది. ‘నియంత్రణకు సంబంధించి తగిన సంసిద్ధత లేనందు వల్లే’ సంక్షోభం తలెత్తిందని డీజీసీఏ నిర్ధారణ చేయటం దేన్ని సూచిస్తోంది? ఇలాంటి ధోరణి మంచిది కాదు.


